ప్రభుత్వ చేతకాని తనం వల్లే
మెట్రో ఫేజ్2కు అనుమతి రాలేదు
ఎల్ అండ్ టీని బెదిరించటం ద్వారా మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, చాతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారనీ, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్-2కి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపైన ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీని విమర్శించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని తెలిపారు. ఆయనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే ప్రధాని మోడీని కాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చాతగానితనానికి బాధ్యత వహిస్తూ హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, కాంగ్రెస్ పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీని ప్రశ్నించలేని అసమర్ధుడు సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో వదిలేసిందని గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని వివరించారు. కేవలం సీఎం స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహా నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని తెలిపారు.
కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. రెండున్నరేండ్లలో మెట్రో ఫేజ్-2ను అటకెక్కించడం ప్రభుత్వ వైఫల్యమనీ, కాంగ్రెస్ అధికారం లోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసి ద్రోహం చేసిందని తెలిపారు. మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయి స్తున్నారని ప్రశ్నించారు. ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్టుగా భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది ఈ పాలకులు కాదా? అని ఆరోపించారు. రూ.30 వేల కోట్ల మెట్రో ఆస్తులను, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే ఎల్ అండ్ టీ సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కాసుల కక్కుర్తి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డిది అసమర్థ పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



