నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లక్నో కోచింగ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంటల్లో చిక్కుకొని 13 మంది మరణించారని అధికారులు తెలియజేశారు. సంఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం ఒక కోచింగ్ సెంటర్ ఉన్న భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక గ్రంథాలయం ,కంప్యూటర్ శిక్షణా సంస్థ ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.మరికొందరు ప్రమాదం నుంచి బయటపడ్డానికి బిల్డింగ్ పై నుంచి దూకారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.
ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల పట్ల సీఎం యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా కేంద్రం నుంచి గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.



