నవతెలంగాణ – హైదరాబాద్ : నానాటికీ పెరిగిపోతున్న నకిలీ వస్తువుల తయారీ, స్మగ్లింగ్ బెడదను అరికట్టడానికి జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన విధానం అవసరమని తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ జే. రామచందర్ నాయక్ నొక్కి చెప్పారు. “అక్రమ రవాణా: స్మగ్లింగ్ మరియు నకిలీల నిరోధానికి ఒక ఏకీకృత విధానం” అనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ఆధ్వర్యంలో ‘ఫిక్కీ క్యాస్కేడ్’ నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.
అక్రమ వాణిజ్యం అనేది సుదూర ఆర్థిక, సామాజిక పరిణామాలను కలిగించే ఒక తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ఆయన ఉద్ఘాటించారు. “నకిలీల తయారీ, స్మగ్లింగ్ అనేవి ఇప్పుడు కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే కాదు; ఇవి వినియోగదారుల భద్రత, చట్టబద్ధమైన వ్యాపారాలు, జాతీయ అభివృద్ధికి తీవ్రమైన ముప్పుగా పరిణమించాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన విధానాల మద్దతు, చట్టాల పటిష్ట అమలుతో పాటు ప్రభుత్వాలు, పరిశ్రమలు, పౌరుల మధ్య సన్నిహిత సహకారం అవసరం. అక్రమ వాణిజ్యానికి వ్యతిరేకంగా ఒక ఏకీకృత వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, అవగాహన పెంపొందించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో ‘ఫిక్కీ క్యాస్కేడ్’ వంటి వేదికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి” అని ఆయన అన్నారు.
హైదరాబాద్ కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ శ్రీ రాజీవ్ తంపుల మాట్లాడుతూ… “భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడం కస్టమ్స్ ప్రధాన కర్తవ్యం. ఇందులో స్మగ్లింగ్, నకిలీలను అరికట్టడమే మా ప్రాథమిక లక్ష్యం. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటమే కాకుండా, చట్టబద్ధమైన వాణిజ్యానికి విఘాతం కలుగుతుంది. అంతేకాకుండా ఇది వ్యవస్థీకృత నేరాలను ప్రేరేపించడంతో పాటు, వినియోగదారుల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. నిఘా ఆధారిత చట్టాల అమలు, పటిష్టమైన సరిహద్దు తనిఖీలు, జాతీయ-అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహిత సమన్వయం ద్వారా.. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను ఛేదించడానికి, నకిలీ వస్తువుల రవాణాను నిరోధించడానికి కస్టమ్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. అలాగే భారతదేశ వాణిజ్య, ఆర్థిక సమగ్రతను పరిరక్షించే దిశగా ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా కృషి చేస్తోంది” అని తెలిపారు.
తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, సీఐ సెల్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) శ్రీ ఆర్. భాస్కరన్ మాట్లాడుతూ.. “పెరిగిపోతున్న స్మగ్లింగ్, నకిలీల బెడద.. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా భద్రత, జాతీయ భద్రతలకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. వివిధ రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దుల గుండా కార్యకలాపాలు సాగిస్తున్న నేర నెట్‌వర్క్‌లను గుర్తించడం, విచారించడం, ఛేదించడం ద్వారా.. ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి పటిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, సంస్థల మధ్య బలమైన సహకారం అవసరం. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి నిరంతరం సామర్థ్య నిర్మాణం అవసరం. వ్యవస్థీకృత అక్రమ వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి, పౌరులు, దేశ ప్రయోజనాలను కాపాడటానికి ఒక సమన్వయంతో కూడిన, నిరంతర విధానం అత్యంత ఆవశ్యకం” అని అన్నారు.
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మాజీ చైర్మన్, టీఎంఐ గ్రూప్ చైర్మన్ శ్రీ టి. మురళీధరన్, అక్రమ వాణిజ్యాన్ని ఎదుర్కోవడంలో సమష్టి కార్యాచరణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “నిజమైన సంస్థలను దెబ్బతీయడం, ఆవిష్కరణలను నిరుత్సాహపరచడం ద్వారా అక్రమ వాణిజ్యం అనేది ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇది వ్యాపారాలకు అసమాన వాతావరణాన్ని సృష్టిస్తుంది.



