వీటీడీఏ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

– ప్రతీ వారం పనులపై నివేదిక ఇవ్వాలి: జిల్లా పాలన అధికారి జయంతి
నవతెలంగాణ – వేములవాడ
వీటీడీఏ(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వీటీడీఏ పనులు, మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు,  లైబ్రరీ నిర్మాణ పనులు, ల్యాండ్ పూలింగ్ పై సమీక్ష సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించారు. బద్ధి పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్ ను ఆదేశించారు. వేములవాడకు వచ్చే అన్ని రహదారుల్లో ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే సరి చేయాలని, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని సూచించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని, ప్రతీ వారం పనులపై నివేదిక ఇవ్వాలని తెలిపారు. అదే చోట ఓపెన్ క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆధునిక టాయిలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే వేములవాడలో  లైబ్రరీ పనులపై ఆరా తీశారు. ల్యాండ్ పూలింగ్ పనులు ఎక్కడి దాకా వచ్చాయని ఆరా తీశారు.
ఆన్లైన్ సేవలపై అవగాహన కల్పించాలి: వేమువాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు, దర్శనం ఇతర ఆన్లైన్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రత్యేక యాప్ రూపొందించాలని సూచించారు. మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల పురోగతిని ఆరా తీశారు. పారిశుధ్య, తాగునీరు, వసతి పనులకు ఇంచార్జీ లను నియమించాలని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ లు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తాయని అడిగి తెలుసుకున్నారు. అగ్ని మాపక పరికరాలు వినియోగం పై సిబ్బంది అందరికీ అవగాహన కల్పించాలని, వాటిని మరోసారి చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్యప్రకాష్, ఆర్ & బి ఈఈ శ్యామ్ సుందర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ ఈఈ రాజేష్, తహశీల్దార్ మహేష్ కుమార్, పర్యాటక శాఖ డీఈ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love