
నవతెలంగాణ – కంటేశ్వర్
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా గిరిజన ఉద్యోగులకు సెలవు సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. చెడు వ్యసనాలకు, దురలవాట్లకు దూరంగా ఉంటూ, సమాజ హితానికి పాటుపడాలని శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ చేసిన బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేసి సన్మార్గంలో నడిపించాయని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమాజ ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ హితవు పలికారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావు, వివిధ శాఖల అధికారులు, గిరిజన సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.