చట్టసభల్లో కమ్యూనిస్టులుంటేనే ప్రజలకు మేలు

ప్రజా సమస్యల్ని చర్చించి నిర్ణయాలు చేసే చట్టసభల్లో కమ్యూనిస్టులుంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రస్తుత శాసనసభలో కమ్యూనిస్టులు– ప్రశ్నించే గొంతుక సీపీఐ(ఎం)ను గెలిపించండి
– నోటుకు ఓటు కాదు.. కొట్లాడేటోళ్లకు ఓటేద్దాం
– కేంద్రంలో నియంతృత్వ పాలన :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, చుక్క రాములు
– పటాన్‌చెరులో జె.మల్ల్లికార్జున్‌ నామినేషన్‌
– భారీ ర్యాలీ, బహిరంగ సభ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యల్ని చర్చించి నిర్ణయాలు చేసే చట్టసభల్లో కమ్యూనిస్టులుంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రస్తుత శాసనసభలో కమ్యూనిస్టులు లేనిలోటు కనిపిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లికార్జున్‌ నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం బహిరంగ సభలో వీరయ్య మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించి మేలు చేకూర్చే నిర్ణయాలు చేయాల్సిన శాసనసభ తిట్ల పురాణాలు, పొగడ్తలకు వేదికైందన్నారు. అక్కడ కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించి శాసనసభకు పంపాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య బాటలో నడుస్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడేలా శాసనసభ చర్చా వేదిక కావాలంటే అందులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అవసరమన్నారు. ఎర్రజెండాకు చెందిన ఎమ్మెల్యేలు చట్ట సభలో ఉంటేనే పేదలు, శ్రామికులు, మహిళలు, సామాజిక తరగతులు, మైనార్టీలు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు చర్చకు వస్తాయని తద్వారా పరిష్కారాలు లభిస్తాయన్నారు. కేంద్రంలో మతోన్మాద నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. మతాన్ని రాజకీయాల్లో సాధనంగా వాడు కుంటున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. పేదలు, కార్మికుల్ని విస్మరించిన పాలకుల్ని దించి పేదల పక్షపాతి సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. నోటుకు ఓటు కాదు.. కొట్లాడేటోళ్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 3.80 లక్షల మంది ఓటర్లుండగా.. అందులో కార్మిక కుటుంబాలవే 2 లక్షల ఓట్లున్నాయన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, హక్కుల సాధన కోసం పోరాడుతున్న కార్మిక ఉద్యమ నాయకుడైన మల్లికార్జున్‌కు కార్మికులంతా ఓట్లేసి గెలిపిస్తే వేతనాల పెంపు, సదుపాయాల కోసం పాలకుల్ని బతిమాలే అవసరమే ఉండదన్నారు.
”కంపెనీల్లోనే ఎర్రజెండా.. ఇంటికాడ మా జెండాలే పడుతారని” వెకిలి మాటలు అంటున్న వాళ్లకు కార్మిక శక్తి ఏంటో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కంపెనీల్లో కార్మిక నాయకుడిగా పనికి రాని ఎమ్మెల్యే బయట పరిపాలకునిగా ఎలా పనికొస్తారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లు తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తే కాంగ్రెస్‌ ఎంపీలు, రాహుల్‌ గాంథీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని సీపీఐ(ఎం) కొట్లాడిందని గుర్తు చేశారు.
అభ్యర్థి జె.మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. మియాపూర్‌-సంగారెడ్డి వరకు మెట్రోలైన్‌ వేయాలని సీపీఐ(ఎం) పాదయాత్ర, ఇతర అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం కొట్లాడామన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కార్యదర్శులు గొల్లపల్లి జయరాజు, సత్యం, రాష్ట్ర నాయకులు ఆశాలత, లక్ష్మీ, ఎ.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కార్మిక లోకం
సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఎమ్మెల్యే అభ్యర్థి జె.మళ్లికార్జున్‌ నామినేషన్‌ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ర్యాలీలో కదం తొక్కారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అనేక కంపెనీలకు చెందిన వేలాది మంది కార్మికులు తమ ఉద్యమ నాయకులైన మల్లికార్జున్‌ గెలుపు కోసం ముందుకు నడిచారు. పట్టణమంతా ఎర్రజెండాల రెపరెపలు కనిపించాయి.
ప్రజా సమస్యల పోరాట సారధులు కమ్యూనిస్టులే..
– సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి… కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు భువనగిరిలో కొండమడుగు నర్సింహ నామినేషన్‌
నవతెలంగాణ – భువనగిరి
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే సారధులు కమ్యూనిస్టులేనని.. వారిని ప్రజలు ఆదరించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మార్కెట్‌ యార్డ్‌ నుంచి పాత బస్టాండ్‌ మీదుగా సీపీఐ(ఎం) శ్రేణులు ఎర్రజెండాలు చేత పట్టుకొని భారీ ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన సభలో చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ భువనగిరి అని చెప్పారు. ఆ చరిత్ర స్ఫూర్తితో ప్రతి కార్యకర్తా కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైనదన్నారు. జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ మాట్లాడుతూ.. ప్రజల గొంతుకైన సీపీఐ(ఎం) అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
భువనగిరి నియోజకవర్గంలో కాంట్రాక్టుల, భూదందాల పాలన సాగుతోందని సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహ అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ కుమార్‌రెడ్డి ఇద్దరూ బెంగళూరు బ్రదర్స్‌గా పేరు గడించారన్నారు. ఇక్కడ కొట్లాడుతున్నట్టు నటిస్తూ అక్కడ వ్యాపారాలు చేసుకునే స్నేహితులన్నారు. ప్రజలను మోసం చేయడానికి వీరు చెరో పార్టీలో చేరి భువనగిరి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను సీపీఐ(ఎం) అభ్యర్థిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, మంగ నరసింహ, కల్లూరు మల్లేశం, దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.

Spread the love