ఆరున్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనను 65 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను పోల్చండి

– బీఎన్‌ఐ సభ్యులతో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరున్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనను, దాదాపు 65 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనను పోల్చాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.టి.రామారావు ప్రజలకు సూచించారు. ఆరున్నరేండ్లలో బీఆర్‌ఎస్‌ అందించగలిగింది ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ అందించలేకపోయిందని తెలిపారు. బిజినెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్నేషనల్‌ (బిఎన్‌ఐ) సభ్యులతో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదిన్నరేండ్లు అయ్యిందని, అయితే అందులో కోవిడ్‌ కారణంగా రెండేండ్లు, వివిధ ఎన్నికల కారణంగా ఒక ఏడాది పోనూ తాము నికరంగా పాలన చేసింది ఆరున్నరేండ్లు మాత్రమే అని తెలిపారు. ఆ కాలంలో అన్ని రంగాలలో అభివద్ధి చేస్తూనే అన్ని వర్గాల సంక్షేమం పథకాలు అమలు చేశామని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో విద్యుత్‌, నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదనీ, ఒక్కొక్క సమస్య పరిష్కరించామని పేర్కొన్నారు. శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి సమర్థవంతమైన పాలన అందించామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ అభివృద్ధి చేశామనీ, దాంతో ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, క్రీడా మౌలిక సదుపాయాలు, విద్యా, నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడతామని కేటీఆర్‌ తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో తనకు పర్యాటక శాఖ కేటాయించమని సీఎం కేసీఆర్‌ను కోరతానని తెలిపారు. తనకు సీఎం, పీఎం కావాలి…ఢిల్లీకి వెళ్లాలి అన్న కోరికలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరం అంటేనే తనకు ఇష్టమనీ, తాను ఇక్కడే ఉంటానని ఉద్ఘాటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందని కెటిఆర్‌ తెలిపారు. అనారోగ్య యూనిట్లు ఒత్తిడి నుండి బయటపడటానికి ఇండిస్టియల్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

Spread the love