- దళారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి
నవ తెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మానేరులో జేసీబీలతో భారీ స్థాయిలో ఇసుక తవ్వి, ట్రాక్టర్లు,లారీల ద్వారా ఖాసింపల్లి,జంగెడు,భూపాలపల్లి, హనుమకొండ,హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెప్పారు.
అక్రమ తవ్వకాల కారణంగా మానేరు ప్రాంతం భారీ గుంతలమయంగా మారుతోందని,పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రాక్టర్లు, లారీలు వెళ్లేందుకు జేసీబీలతో ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.మైనింగ్, రెవెన్యూ,ఇరిగేషన్ శాఖల అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించి మానేరు నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలించబడిందో గుర్తించాలని కోరారు.
అక్రమంగా తరలించిన ఇసుకకు మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు.అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రి వేళల్లో డ్రోన్ పర్యవేక్షణ, చెక్‌పోస్టులు, ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర తనిఖీలు నిర్వహించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.


