రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు రణన్నిన్నాదంతో కదిలిన కార్మికదండు
‘మేడే’ సామ్రాజ్యవాదుల వెన్నులో వణుకుపుట్టించే కష్టజీవుల ప్రపంచవ్యాప్త పండుగ. ప్రపంచ కార్మికుల ఐక్యతే ఆ వేడుక లక్ష్యం. శ్రమే వారి ఆయుధం. కార్మికరాజ్య స్థాపనే గమ్యం. రాష్ట్రంలో శ్రామికులే కేంద్రంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు జరిగాయి. ఊరు, వాడల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. పట్టణాల్లో అరుణపతాకాలు చేతపట్టిన కార్మికవర్గం పెట్టుబడిదారులారా…మా శ్రమను తక్కువచేయకండి…ఖబడ్దార్ అని నినదిస్తూ భారీ కవాతులు నిర్వహించింది. కమ్యూనిస్టుపార్టీలు తమ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించి కష్టజీవులకు సంఘీభావం తెలిపాయి. జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ యూనియన్లు ఎక్కడికక్కడ ‘మేడే’ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించాయి.
కష్టజీవే కేంద్రంగా, పోరాటాలే లక్ష్యంగా నాయకులు చేసిన ప్రసంగాలు కార్మికలోకాన్ని ఉత్తేజపరిచాయి. కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘటిత, అసంఘటితరంగ కార్మికులంతా ఈ వేడుకల్లో భాగస్వాములు అయ్యారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నారాయణగూడ నుంచి గోల్కొండ చౌరస్తా వరకు జరిగిన కార్మిక కవాతులో ఆ సంఘం అఖిలభారత ఉపాధ్యక్షురాలు డాక్టర్ కే హేమలత భాగస్వామి అయ్యారు. నవతెలంగాణ దినపత్రిక కార్యాలయంలో జరిగిన ‘మేడే’ వేడుకల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.
మఖ్దూం భవన్‌లో జరిగిన ‘ప్రతిఘటన సభ’ను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో ఎర్రజెండాను అవిష్కరించి రాజ్యసభ మాజీ సభ్యులు పీ మధు కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. అన్ని రంగాల కార్మికులు తమ కష్టానికి ప్రతిరూపమైన ఎర్రజెండాకు ‘లాల్‌సలాం’ అంటూ పిడికిలి బిగించి రణన్నిన్నాదం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ భవన్‌లో తమ అనుబంధ కార్మిక సంఘం బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించింది. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ‘లాల్‌సలాం కామ్రేడ్స్’ అని నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘మేడే’ వేడుకలు, శ్రమశక్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంత్రులు జీ వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావుల నేతృత్వంలో జరిగాయి. వామపక్షపార్టీలన్నీ అరుణపతాకాన్ని ఆవిష్కరించి ‘లాల్‌సలాం’ చేశాయి. ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అనే ఏకైక నినాదం విశ్వవ్యాప్తంగా మార్మోగింది.
ఎర్రజెండా రెపరెపలు, భారీ ప్రదర్శనలు
నేతల స్ఫూర్తివంత ప్రసంగాలు విభజన రాజకీయాలను కార్మికలోకం తిప్పికొట్టాలి
కార్మికరాజ్యం రావాలంటే సామ్రాజ్యవాదం పోవాలి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడితో ప్రపంచ ప్రజల ఇక్కట్లు
శాంతి ఒప్పందం జరిగేలా కృషి జరగాలి : మేడే ఉత్సవాల్లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రమ అనేది కుల, మతాలకతీతమనీ, రాజకీయ లబ్ది కోసం విభజన రాజకీయాలు చేస్తున్న శక్తులను తిప్పికొట్టాలని కార్మికలోకానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పిలుపు నిచ్చారు. మేడే సందర్భంగా హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ..సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో ప్రపంచ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలన్నా, కార్మికరాజ్యం రావాలన్నా సామ్రాజ్యవాదం నశించిపోవాలని నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతి నెలకొనేలా ప్రతిఒక్కరూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. యుద్ధ ప్రభావం మన దేశ ప్రజలపై తీవ్రంగా పడుతున్న తీరును వివరించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.993 పెంచడం వల్ల దాని ప్రభావం అన్నింటిపైనా పడుతుందని చెప్పారు. యుద్ధం ఆగకపోతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్‌కు అండగా నిలబడేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేబర్‌కోడ్‌లు కార్మికవర్గ పోరాటాలను ఆపలేవని స్పష్టం చేశారు. కార్మికులను అణచివేసేకొద్దీ పోరాటాలు తీవ్రమ వుతాయనీ, యూనియన్లు లేకున్నా నోయిడా ప్రాంతంలో వేలాది కార్మికులు రోడ్లెక్కి పోరాటాలు చేయడం దానికి ప్రత్యక్ష ఉదహరణ అని చెప్పారు. చట్టాలున్నా, లేకున్నా అన్యాయం, అణచివేత కొనసాగుతుంటే చూస్తూ ఊరుకోకుండా తిరగబడే తత్వం కార్మికవర్గానిదని తెలిపారు.ఈ మేడే దినోత్సవంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి, టి సాగర్, జి నాగయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జి రాములు, డీజీ నర్సింహారావు, వెంకట్రాములు, బాబూ రావు, అరుణజ్యోతి, శ్రీరామ్ నాయక్, ఎమ్‌వీ.రమణ, ఆశయ్య, పద్మశ్రీ, ఎం శ్రీనివాస్, శోభన్, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పి జంగారెడ్డి, ధర్మానాయక్, ప్రసాద్, కోట రమేశ్, ఎ వెంకటేశ్, రాములు, తదితరులు పాల్గొన్నారు.



