అమెరికా,ఇజ్రాయిల్ ప్రారంభించిన ఏకపక్ష దాడులు, దానికి ఇరాన్ ప్రతిఘటనకు రెండు నెలలు గడచిపోయాయి. ఏప్రిల్ ఏడు నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.తొలుత హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఒక్కటే దిగ్బంధిస్తే తరువాత అమెరికా మరోవైపునుంచి నౌకలను మలేస్తున్నది.ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అరవై రోజులకు మించి అధ్యక్షుడి ఉత్తరువులతో ఏదేశం మీద కూడా సైనిక చర్య జరిపేందుకు వీల్లేదు. దీంతో చట్టంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని మరో నెల రోజుల పాటు ఇరాన్ మీద దాడులను పొడిగిస్తూ ఏప్రిల్30న ట్రంప్ ఉత్తరువులు జారీ చేశాడు.కాల్పుల విరమణ వ్యవధిలో మరిన్ని బలగాలను సమీకరించేందుకు వినియోగించుకుంటున్నట్లు ఇరాన్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ మీద మరోసారి దాడులకు తెగబడితే తీవ్రమైన హానికర పర్యవసానాలు ఉంటాయని, ఇది ఏమాత్రం సమర్ధనీయం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాను హెచ్చరిం చాడు. ట్రంప్‌తో గంటన్నర పాటు ఫోన్‌లో మాట్లాడిన అనేక అంశాల్లో ఇదో హెచ్చరిక. భూతల దాడులకు దిగాలని చేస్తున్న ప్రయత్నాల గురించి తమనేత ట్రంప్‌ను హెచ్చరించినట్లు పుతిన్ విదేశాంగవిధాన సలహాదారు చెప్పాడు. పుతిన్‌తో సంభాషణ తరువాత తాము మంచిగా మాట్లాడుకున్నామని, తనకు పుతిన్ ఎప్పటి నుంచో తెలుసని ట్రంప్ చెప్పుకున్నాడు. ఇరాన్ యురేనియంను అవసరమైతే తమ ఆధీనంలో ఉంచుకుంటామని పుతిన్ చెప్పగా ఉక్రెయిన్‌లో పోరును ముగించాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పాడట.
మరింతగా ఊబిలోకి దిగవద్దంటూ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన స్నేహపూర్వక హెచ్చరిక మీద మండిపడిన ట్రంప్ మరోసారి తన అసహనం, దురుసుతనాన్ని ప్రదర్శించాడు. బీటలు వారిన మీదేశం సంగతి ముందు చూసుకోండి,ఇరాన్ అణుముప్పును తొలగించేందుకు చూస్తున్నవారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నివారించటంలో జర్మనీ పూర్తి అసమర్ధంగా వ్యవహరించిందంటూ ఎదురుదాడి చేశాడు.తమకు మద్దతుగా దాడుల్లో పాల్గొనాలన్న ట్రంప్ వినతిని తమ యుద్ధం కాదంటూ నాటో దేశాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. పిర్రగిల్లి జోలపాడినట్లుగా ఇరాన్ దౌత్యపరంగా ఎంతో తెలివిగా వ్యవహ రించిందని, అమెరి కాను అవమానిం చిందని జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ వాషింగ్టన్ గాలి తీశాడు.అఫ్ కోర్స్ ట్రంప్ వదరుబోతు తనంతో పోల్చితే ఇది చాలా తక్కువే. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు నవ్వినందుకు అన్నట్లుగా ఇరాన్ చేతిలో పొందుతున్న పరాభవానికి సిగ్గుపడాల్సిన ట్రంప్ స్నేహపూర్వక సలహా మీద మండిపడటం అనుచితం.
పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన సంక్షోభం ప్రారంభమై రెండు నెలలు దాటింది. ఇరాన్ మీద తాము సైనిక చర్యను ప్రారంభించామే తప్ప దాన్ని యుద్ధంగా తాను పిలవటం లేదని ఏప్రిల్ ఒకటవ తేదీన చేసిన ప్రసంగంలో ట్రంప్ యావత్ అమెరికాను వెర్రి వెంగళప్పలను చేశాడు. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం మరొక దేశం మీద యుద్ధం చేయాలంటే అక్కడి పార్లమెంటు ఆమోదం అవసరం.దానితో నిమిత్తం లేకుండానే ట్రంప్ గతేడాది, ఇప్పుడు కూడా దాడులకు ఆదేశించాడు.రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఎంత పరిహాస ప్రాయంగా మార్చోరో ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.అధ్యక్షుడి మిలిటరీ చర్య ఉత్తరువుల వ్యవధి అరవై రోజుల్లో ముగుస్తుంది. తరువాత దాడులను నిలిపివేయాల్సి ఉంటుంది. అయితే మరో నెల రోజుల పాటు పొడిగించేందుకు రాజ్యాంగంలో వీలు వుండటంతో ఆ మేరకు మరో 30రోజులు దాడులను పొడిగించేందుకు ఏప్రిల్ 30న ఉత్తరువుల మీద సంతకం చేస్తూ మరోసారి అదే చెప్పాడు.దీన్ని బట్టి ఇరాన్ మీద మరోసారి తెగబడేందుకు అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే పుతిన్ గట్టి హెచ్చరిక చేసినట్లు భావించాల్సి వస్తోంది.
ఇరాన్‌పై వాషింగ్టన్ చెలగాటం మనతో సహా అనేక దేశాలకు ప్రాణ సంకటంగా మారింది. మే ఒకటవ తేదీ నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు రూ.2,078 నుంచి రూ.3071కి పెంచాయి. ముందుగా ఊహించినట్లుగా ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత ఈ బండను మోపారు. దేశ చరిత్రలో ఇదొక రికార్డు, దీన్ని నరేంద్రమోడీకే అంకితం ఇవ్వాలి.పెంచింది వాణిజ్య సిలిండర్ ధరేగా అని ఎవరైనా అతితెలివి ప్రదర్శించవచ్చు. గృహం, వాణిజ్య సిలిండర్ పేరు ఏదైతేనేం, భారాన్ని భరించేది జనమే. ధరల పెంపుదల లేదు అంటూ రోజూ ఊదరగొడుతున్నవారు ఇప్పటికే పవర్ పెట్రోలు, పారిశ్రామిక అవసరాల డీజిల్,గృహ, వాణిజ్య వినియోగగ్యాస్ ధరలను పెంచారు.నష్టాలు వస్తున్న మార్కెటింగ్ కంపెనీలను ఆదుకొనేందుకు పన్నెండు సంవత్సరాలుగా జనం జేబులను కొల్లగొడుతున్నది. అదనపు ఎక్సయిజ్ డ్యూటీని కేంద్రం తగ్గించుకుంది, దీంతో వినియోగదారులకు ఒరిగేదేమీ లేదు.ఈ మొత్తంలో రాష్ట్రాలకు వాటా లేదు గనుక మౌనంగా ఉన్నాయి.ఇప్పటికీ సెస్‌ల రూపంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుకు రూ.7.50, డీజిలు మీద రూ.6, అదనంగా కస్టమ్స్,మొత్తం డ్యూటీల మీద పదిశాతం చొప్పున సంక్షేమ సర్‌ఛార్జీ వసూలు చేసుకుంటున్నది. జన సంక్షేమానికి జనం నుంచే వసూలు చేస్తూ తామేదో ఒరగబెడుతున్నట్లు ఫోజు అదనం !
ఉక్రోషదాడుల ఉత్తరువు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



