Saturday, May 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిడీలిమిటేషన్ బిల్లు - రాజ్యాంగ విరుద్ధం

డీలిమిటేషన్ బిల్లు – రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏదో ఒక రూపంలో రాజ్యాంగంపైన, రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై దాడి చేస్తూనే ఉంది. తన భావజాలానికి అనుకూలంగా మార్చుకునే కుట్రలు చేస్తూనే ఉంది. జీఎస్టీ చట్టం, ప్రణాళిక సంఘం రద్దు, నూతన విద్యా విధాన చట్టం, విద్యుత్‌ చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, 370 ఆర్టికల్‌, పెద్దనోట్ల రద్దు ఇలా అనేక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేక చర్యలు తీసుకుంది. తాజాగా డిలిమిటేషన్‌ కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి మహిళా రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని దొంగదెబ్బ తీయాలని చూసింది. 2026 ఏప్రిల్‌ 16న కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు (డిలిమిటేషన్‌ బిల్లు) దేశ చరిత్రలో ఒక రాజకీయ మలుపును సృష్టించింది. ఏప్రిల్‌ 17న జరిగిన ఓటింగ్‌లో 528 మంది సభ్యులు హాజరయ్యారు. వారిలో 298 మంది బిల్లుకు మద్దతుగా ఓటువేయగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (352) సాధించలేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఇది ప్రధాని మోడీ నేతఅత్వంలోని ప్రభుత్వానికి పన్నెండేళ్లలో తొలి పార్లమెంటరీ ఓటమిగా నిలిచింది. ఈ బిల్లు కేవలం సీట్ల పెంపు లేదా జనాభా ఆధారిత పునర్విభజన మాత్రమే కాదు, ఇది రాజ్యాంగ<< ఆర్టికల్స్‌ 81, 82, 170, 368లను నేరుగా ఉల్లంఘించి, ఫెడరలిజం, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే ప్రాథమిక నిర్మాణ సూత్రాలపై దాడిచేసింది.

డిలిమిటేషన్‌-రాజ్యాంగపరమైన నేపథ్యం
డిలిమిటేషన్‌ అనేది జనాభా మార్పులకు అనుగుణంగా లోక్‌ సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దులను పునర్నిర్ణయించే ప్రక్రియ. రాజ్యాంగ ఆర్టికల్‌ 81 (లోక్‌సభ సీట్ల సంఖ్య), ఆర్టికల్‌ 82 (ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్‌ సభ సీట్ల పునర్విభజన), ఆర్టికల్‌ 170 (రాష్ట్ర శాసనసభల సీట్ల పునర్విభజన)లు దీనికి మూలస్తంభాలు. ఆర్టికల్‌ 82 ప్రకారం ”ప్రతి జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత” సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజన చేయాలి.1976లో 42వ సవరణ ద్వారా 1971 జనాభా ఆధారంగా సీట్లు స్తంభింపజేయబడ్డాయి. ఎందుకంటే అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. దీంతో జనాభా నియంత్రణకు మంచి కృషి చేసిన రాష్ట్రాలలో జన సంఖ్య గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సరిగా అమలు చేయని రాష్ట్రాలలో జన సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది డిలిమిటేషన్‌ ప్రక్రియను క్లిష్టం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆనాటి వాజపేయి ప్రభుత్వం 2001లో 84వ సవరణ ద్వారా ఈ డిలిమిటేషన్‌ స్తంభనను 2026 వరకు పొడిగించారు. ఆర్టికల్‌ 82 ప్రకారం, 2026 తర్వాత మొదటి జనాభా లెక్కల ప్రచురణ తర్వాతే పునర్విభజన గురించి విస్తృతంగా చర్చించిన తర్వాత డిలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాలి. ఈ నిబంధన జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా రూపొందించబడింది. ఇది రాజ్యాంగ ఆశయంలో అంతర్భాగం.

2026 డిలిమిటేషన్‌ బిల్లు-ప్రధాన లక్ష్యాలు
ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలు: 1)లోక్‌సభ సీట్లు 543 నుండి 850కి పెంచడం. 2)2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన. 3) రాజ్యాంగ సవరణ, డిలిమిటేషన్‌ బిల్లు, యూనియన్‌ టెరిటరీల చట్టం, మూడింటినీ అనుసంధానం చేయడం. 4)డిలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును నియంత్రించడం.
ఇది రాజ్యాంగపరంగా సమస్యాత్మకం ఎందుకంటే, ఆర్టికల్‌ 82 ప్రకారం తాజా జనాభా లెక్కలు (2026 తర్వాతి సెన్సస్‌) ఆధా రంగానే చేయాలి. 2011 డేటా ఉపయోగం రాజ్యాంగం నిర్దేశించిన కాలపరిమితిని నేరుగా ఉల్లంఘించడమే కాకుండా, జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు చారిత్రక రక్షణ కవచంగా ఉన్న 84వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘించడం.
రాజ్యాంగ విరుద్ధతకు ప్రధాన కారణాలు: ఆర్టికల్స్‌ 81,82,170 ప్రత్యక్ష ఉల్లంఘన. బిల్లు 2011 జనాభా (పాత, స్తంభింపజేసిన డేటా) ఆధారంగా పునర్విభజన చేయాలని ప్రతిపాద ించింది. కానీ 84వ రాజ్యాంగ సవరణ (2001) స్పష్టంగా ఫ్రీజ్‌ను 2026 వరకుప ొడిగించింది. 2026లో సెన్సస్‌ జరిగి, డేటా ప్రచురితమైన తర్వాతే నియోజక వర్గాలను మార్చే అధికారం సర్కారుకు ఉంటుంది. టి.ఎన్‌. రఘునాథ్‌ వర్సెస్ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2021) లాంటి డిలిమిటేషన్‌ కేసుల్లో, కోర్టు ”రాజ్యాంగం నిర్దేశించిన కాల పరిమితిని తప్పనిసరిగా పాటించాలి” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏకపక్ష నిర్ణయం కాలపరిమితికి భిన్నంగా ఉంటే అది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ మూర్తులు ఎత్తిచూపారు. 2. ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతానికి విఘాతం (కేశవా నంద భారతి కేసు, 1973) కేశవానంద భారతి తీర్పు (1973) ప్రకారం, రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలైన ఫెడరలిజం, సమానత్వం, న్యాయ సమీక్ష, ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య సమానత్వం వీటిని ఏ సవరణ ద్వారానూ రద్దు చేయలేము.

ఫెడరలిజాన్ని దెబ్బతీసే బిల్లు
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించాయి. 1971లో దక్షిణాది రాష్ట్రాల జనాభా భారత జనాభాలో 22 శాతంగా ఉండగా, 2011 నాటికి 20.1 శాతానికి తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడంతో వారి వాటా పెరిగింది. ఈ బిల్లు ప్రకారం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు కేటాయిస్తే, దక్షిణాది రాష్ట్రాల వాటా 20.1 శాతం నుండి 18 శాతానికి తగ్గనుంది. ఇది ”విజయానికి శిక్ష”గా మారడమే కాదు, ఇది సమాఖ్య (ఫెడరల్‌) సమతుల్యతను నేరుగా ధ్వంసం చేస్తుంది. ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1994) తీర్పులో సుప్రీంకోర్టు ఫెడరలిజం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ భాగమని నిర్ధారించింది. ఏ సవరణైనా ఫెడరల్‌ సూత్రాన్ని బలహీనపరిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. 3.సమానత్వం (ఆర్టికల్‌ 14) ఉల్లంఘన – విలువలో అసమానత: భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యం వలన రాష్ట్రాల విస్తీర్ణంలో, జన సంఖ్యలో తేడాలున్నాయి. ఇది సహజమైన వైవిధ్యం. ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు అనుకూలమైన నిర్ణయాలు చేసి, భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలను గుర్తించకుండా చిన్న రాష్ట్రాల అభిప్రాయాలకు విలువనివ్వని పక్షంలో అది సమానత్వం భావనకు వ్యతిరేకం అవుతుంది. తాము ఇతర రాష్ట్రాల పౌరులతో సమానం కాదేమో, వారి అభిప్రాయాలు మాపై రుద్దుతున్నారనే భావానికి లోనై క్రమంగా సమైక్యతకు దూరమై, అసంతృప్తి పెరిగి అనైక్యత బీజాలు పడతాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని ఈ సవరణ దెబ్బతీస్తుంది. 4.మౌఖిక హామీలు వర్సెస్‌ చట్టపరమైన రక్షణలు: హోంమంత్రి అమిత్‌ షా మౌఖికంగా ”దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గవు” అని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలు బిల్లు నిబంధనల్లో ఎక్కడా లేవు. సెక్షన్‌ 8 డిలిమిటేషన్‌ బిల్లు ప్రకారం, కమిషన్‌ 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు కేటాయించాలని ఉంది. మౌఖిక హామీలకు చట్టపరమైన విలువ లేదు. ఇది రాజ్యాంగ విశ్వసనీయతను, న్యాయ ప్రక్రియను దెబ్బతీస్తుంది.

అప్రజాస్వామిక లక్షణాలు
ఎన్నికల ప్రక్రియకు ముందు బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘించడమే. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ బిల్లును ప్రవేశపెట్టడం తీవ్రమైన రాజకీయ ఆరోపణలకు దారితీసింది. సాధారణంగా ప్రత్యేక సమావేశాలు విపత్తులు, సంక్షోభాలు, వార్షికోత్సవాల సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో దేశవ్యాప్త నియోజకవర్గాల మ్యాపును మార్చే బిల్లును ప్రవేశపెట్టడం అప్రజాస్వామికమైన చర్యగా పరిగణించబడింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రధాన మంత్రి దూరదర్శన్‌లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీలతో గాని, ఎన్డీయే భాగస్వాములతోగాని చర్చించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోలేదు. ఇది అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణి తప్ప మరేం కాదు. ఇప్పటికే ఉమ్మడి జాబితాలోని విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌ వంటి అంశాలపై కేంద్రమే చట్టాలు చేసి రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం, ఆ చట్టాలు అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇవ్వకుండా వేధించడం వంటి అనేక అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నది. ఈ సవరణ ఆ కోవలో మరింత అప్రజాస్వామికమైనది.

మహిళా రిజర్వేషన్‌ ముసుగులో రాజ్యాంగానికి తూట్లు
2023లో 108వ సవరణ ఏకగ్రీవంగా పాసై మహిళకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ చట్టం రూపం తీసుకుంది, కానీ అమలు కాలేదు. ఆ చట్టం ప్రకారం, మహిళలకు 33శాతం సీట్లు రిజర్వ్‌ చేయాలంటే తొలుత డిలిమిటేషన్‌ పూర్తి కావాలి. ఈ బిల్లు ఆ రిజర్వేషన్ను ఒక ముసుగుగా ఉపయోగించి, నియోజకవర్గాల మ్యాప్ను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించింది. 2023 మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందే సమయంలోనే ప్రతిపక్షాలు, వామపక్షాలు 2024 పార్లమెంటు ఎన్నికల్లోనే అమలు చేయాలని వాదించాయి. అప్పుడు అమలు చేయకుండా, ఇప్పుడు హడావుడిగా మహిళా రిజర్వేషన్‌ అంశాన్ని ముందుకు తీసుకురావడంలో అంతర్యం ఏమిటి? చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్లను మళ్ళీ బిల్లులో చేర్చి ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని యాగి చేయడం దేనికోసం? నిజంగా బిజెపికి మహిళా రిజర్వేషన్ల అమలు పట్ల చిత్తశుద్ధి ఉంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లోనే అమలు చేసేది. ఇప్పుడు డీలిమిటేషన్‌ బిల్లుకు లింకు పెట్టడం ద్వారా ప్రతిపక్షాల మీద నేపం మోపి మహిళా రిజర్వేషన్లకు మోకాలు అడ్డుపెట్టాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది.

కమిషన్‌కు అసాధారణ అధికారాలు
డిలిమిటేషన్‌ కమిషన్‌ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ నిర్ణయాలను ఆర్టికల్‌ 329 ప్రకారం కోర్టులో సవాల్‌ చేయలేరు. ఈ బిల్లులో కమిషన్‌ నిర్ణయాలకు ఎటువంటి అప్పీలు లేదు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేవలం ”సలహా” ఇచ్చే హక్కు మాత్రమే ఉంది. తుది నిర్ణయం కేంద్ర నియమించిన కమిషన్‌ చేతిలో ఉంటుంది. ఇది ఫెడరలిజానికి వ్యతిరేకంగా ఏకీకృత అధికారాన్ని పెంచుతుంది. కమిషన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది. డీలిమిటేషన్‌ పేరుతో 131 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ మిషన్‌ కమిషన్‌ పేరుతో అధికారాలన్నీ బీజేపీ ప్రభుత్వం తన చేతిలో కేంద్రీకరించుకొని తన ఇష్టం వచ్చిన రీతిలో పార్లమెంటు సీట్లు పునర్విభజన చేయాలని కుట్ర చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి, ఫెడరల్‌ స్ఫూర్తికి హానికరమైనది. ఇలాంటి సవరణలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. ఇప్పటివరకు ఏ రాజ్యాంగ సవరణను అయినా సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనపై కూడా పై బెంచ్‌కి అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. కానీ 131 వ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ కమిషన్‌ కు విచక్షణా రహితమైన అధికారాలు కట్టబెట్టి, వాటిపై కోర్టుకు కూడా వెళ్లే హక్కు లేకుండా చేయడం అంటే అది నియంతృత్వానికి దారులు వేయడమే.
వైఫల్యమెందుకు సంభవించింది?
2011 డేటా, 2026 నుండి ఫ్రీజ్‌ ముగియకముందే సవరణ ప్రయత్నం, ఇది రాజ్యాంగ ప్రక్రియకు అవమానం.దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అసెంబ్లీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒక సమాఖ్యలో, ఇలాంటి సున్నితమైన సవరణకు రాష్ట్రాల సమ్మతి అనివార్యం. విపక్షాలు, సంఘాలైన డిఎంకె, కాంగ్రెస్‌, తృణముల్‌, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌ దళ్‌, ఆర్జేడీ, ఎన్‌సిపి, ఆప్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌, ఎఐఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. స్టాలిన్‌ నేతృత్వంలో దక్షిణాదిలో పెద్ద ఎత్తున నిరసనలు, సామాజిక మాధ్యమ ఉద్యమాలు, తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు ఇవి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీనికితోడు న్యాయస్థానం అప్రమత్తంగా ఉండడం, రాజ్యాంగ కాలపరిమితి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, సవాలు చేస్తే నిలబడేది కాదనే భయం ప్రభుత్వానికి ఉండి ఉండవచ్చు.

2026 డిలిమిటేషన్‌ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది, అప్రజాస్వామికమైనది. ఇది ఆర్టికల్స్‌ 81, 82, 170, 368ను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమే కాదు, ప్రాథమిక నిర్మాణ సూత్రాలైన ఫెడరలిజం, సమానత్వం, ప్రాతినిధ్య సమానత్వం, ద్విసభా విధానాన్ని నేరుగా దెబ్బతీసింది. ఎన్నికల మధ్యలో ఎన్నికల మ్యాప్‌ మార్చాలనే ప్రయత్నం, రాష్ట్రాల అభిప్రాయాలను విస్మరించడం, పాత జనాభా డేటాను ఉపయోగించి భవిష్యత్తు ప్రాతినిధ్యాన్ని నిర్ణయించడం వంటివి ప్రజాస్వామ్య విలువలకు విఘాతం.
భవిష్యత్తులో డిలిమిటేషన్‌ తప్పనిసరిగా 2026 తర్వాత తొలి సెన్సస్‌ (బహుశా 2031) ప్రచురణ తర్వాతనే చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు ఆర్థిక సూచికలు, ప్రాంతీయ అసమతుల్యతలను, సాంస్కృతిక వైవిధ్యాలను సమతుల్యత సూత్రం రూపొందించాలి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు, నిపుణులతో సంప్రదించి శ్వేత పత్రం రూపొందించాలి. డిలిమిటేషన్‌ ఎప్పటికప్పుడు జాతీయ రాజకీయ సమ్మతితో న్యాయమైన డీలిమిటేషన్‌ సూత్రాలు రూపొందించాలి..
ప్రధాని మోడీ పభుత్వానికి ఈ ఓటమి ఒక గుణపాఠం కావాలి. అయితే మోడీ ప్రభుత్వం గుణపాఠాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని భావించలేం. ప్రజాస్వామ్యంలో బలవంతం మార్గం కాదు, సమ్మతి మార్గం. దక్షిణాది నేతలు, ప్రతిపక్షాలు, సివిల్‌ సొసైటీ కలిసి ఈ బిల్లును అడ్డుకోవడం భారత ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉందనడానికి నిదర్శనం. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా, సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించి, విభిన్న స్వరాలను విని, న్యాయమైన డిలిమిటేషన్‌ సూత్రాలను రూపొందించాలి. భారతదేశపు బలం దాని వైవిధ్యంలోనే ఉంది, ఆ వైవిధ్యాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుని విధి.

ఎం.డి. అబ్బాస్
9490098032

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -