Tuesday, June 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ బాటలోనే కాంగ్రెస్‌

బీజేపీ బాటలోనే కాంగ్రెస్‌

- Advertisement -

అందుకే హైదరాబాద్‌‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు..ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
సీఎం రేవంత్‌‌రెడ్డికి నియంతలే స్ఫూర్తా?
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించం : నిరసన ప్రదర్శనలో వామపక్ష‍ నేతల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బాటలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌నడుస్తోందని పలువురు వామపక్ష‍ నేతలు విమర్శించారు. అందుకే అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌‌నకు సాగిలబడుతున్న మోడీ తరహాలోనే సీఎం రేవంత్‌ ‌రెడ్డి… హైదరాబాద్‌‌లోని రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్‌ ‌పేరు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సోమవారం హైదరాబాద్‌‌ బషీర్‌‌బాగ్‌‌లోని బాబూ జగ్జీవన్‌‌రామ్ విగ్రహం నుంచి లోయర్‌ ‌ట్యాంక్‌‌బండ్‌లోని అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు ఆయా పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘హైదరాబాద్‌ ‌రోడ్డుకు ట్రంప్‌ ‌పేరు పెట్టడం సిగ్గు సిగ్గు, యుద్ధోన్మాది ట్రంప్‌ ‌పేరును వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయం డౌన్‌, డౌన్‌…’ అంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్‌ ‌విగ్రహం వద్ద సీపీఐ(ఎం) హైదరాబాద్‌ ‌జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌, న్యూడెమోక్రసీ నేతలు మహేశ్‌, ఎస్‌ఎల్‌ ‌పద్మ, సుధాకర్‌ అధ్యక్ష‍తన జరిగిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ మాట్లాడారు. ప్రపంచ యుద్ధోన్మాది ట్రంప్‌ ‌పేరును హైదరాబాద్‌ ‌రోడ్డుకు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఎందుకు ఆయన పేరు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ప్రపంచ దేశాలపై యుద్ధాలు చేస్తున్నందుకా? మన దేశంపై ఆర్థిక ఆంక్ష‍లు విధించినందుకా? అనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటికే దేశ ప్రధాని ట్రంప్‌‌నకు సాగిలపడి వ్యవహరిస్తున్నారనీ, ఇది దేశ సార్వభౌమాధికారానికి విఘాతమని తెలిపారు. దీనిపై నిరసనలు వ్యక్తమవుతుంటే..అదే తోవలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా పోవటం ఆందోళనకరమన్నారు. ఈ దేశ అలీన విధానానికి భిన్నంగా మోడీ వ్యవహరిస్తుంటే..దానికి భిన్నంగా ఉండాల్సిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ..రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నదని విమర్శించారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి ప్రజల మీద యుద్ధాలను రుద్దుతున్నదని తెలిపారు. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశం మీద ట్రంప్ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు మోడీ సహకారం తోడవటంతో దేశం నష్టపోతున్నదని వాపోయారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ బీజేపీ , ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలుండటం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపట్ల కాంగ్రెస్ జాతీయ నాయకత్వం స్పందించి, జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ మాట్లాడుతూ…ట్రంప్ పేరు పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మనదేశం మీద ట్రంప్ ఆంక్షల వల్ల ప్రజలపై ధరల భారాలు పడ్డాయని తెలిపారు. ఇందుకు కారకుడైన ట్రంప్ పేరు హైదరాబాద్‌లోని రోడ్డుకు పెట్టడం దుర్మార్గమన్నారు. సీపీఐ(ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేష్‌, సీపీఐ(ఎంఎల్‌) ఎన్‌‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్థన్‌, ఎస్‌‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురారి, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకులు మట్టయ్య మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి, ఎండీ అబ్బాస్‌, బండారు రవికుమార్‌, సీనియర్‌ ‌నాయకులు డీజీ నర్సింహారావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, ఎ వెంకటేశ్‌, సీపీఐ నాయకులు కమతం యాదగిరి, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్‌, ఎస్‌‌యుసీఐ నాయకులు భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -