Tuesday, June 23, 2026
E-PAPER
Homeజాతీయంగడ్డుకాలంలో పారిశ్రామికం

గడ్డుకాలంలో పారిశ్రామికం

- Advertisement -


కీలక రంగాల ఉత్పత్తి 0.5 శాతమే
డిమాండ్‌ లేమితో ఏడు నెలల కనిష్టానికి

న్యూఢిల్లీ : భారత పారిశ్రామిక రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన ఎనిమిది కీలక మౌలిక రంగాలు తీవ్ర డిమాండ్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా మే 2026లో కీలక రంగాల వృద్ధి రేటు ఏకంగా 0.5 శాతానికి మందగించి.. ఏడు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. గత కొంతకాలంగా వినియోగం తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాల్లో మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో 40.27 శాతం వాటా కలిగిన ఈ రంగాలు ఏప్రిల్‌‌లో 1.8 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. గతేడాది మేలో 1.2 శాతం వృద్ధిని కనబర్చాయి.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన అంతరాయాలు ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే.. దేశీయంగా డిమాండ్ లేకపోవడం పారిశ్రామిక రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోన్నాయి. ఈ పరిణామాలతో మొత్తం ఎనిమిది రంగాలలో ఐదు రంగాలు క్షీణతను ఎదుర్కోగా.. కేవలం మూడు రంగాలు మాత్రమే సానుకూలంగా నమోదయ్యాయి.

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన మే నెలలో ముఖ్యంగా బొగ్గు, పెట్రోలియం వంటి కీలక రంగాలు కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది. మే నెలలో బొగ్గు ఉత్పత్తి ఏకంగా 9.3 శాతం మేర క్షీణించి పది నెలల కనిష్టానికి పడిపోయింది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి ఏకంగా మైనస్‌ 8.7 శాతానికి పడిపోయి గత 42 నెలల్లోనే అత్యల్ప స్థాయి‌ని చవి చూసింది. దీనికి తోడు ముడి చమురు, సహజ వాయువు, ఎరువుల ఉత్పత్తిలో కూడా తగ్గుదల చోటు చేసుకుంది. ముడి చమురు ఉత్పత్తి 4.6 శాతం, సహజ వాయువు ఉత్పత్తి 4.9 శాతం, ఎరువుల ఉత్పత్తి 0.9 శాతం మేర తగ్గుదలను నమోదు చేశాయి.
రంగం వృద్ధి (మైనస్‌‌లో శాతాల్లో)
పెట్రోలియం రిఫైనరీ -8.7
బొగ్గు -9.3
ముడి చమురు -4.6
సహజ వాయువు -4.9
ఎరువుల ఉత్పత్తి -0.9

ఈ పరిణామాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ విశ్లేషిస్తూ.. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గడం, చమురు దిగుమతులు పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. సరఫరా గొలుసుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా సహజ వాయువు ఉత్పత్తి కూడా తగ్గిందన్నారు.
విద్యుత్ ఉత్పత్తి 8.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 8.4 శాతం మరియు ఉక్కు ఉత్పత్తి 5 శాతం వృద్ధితో కొంత మద్దతును అందించాయి. మొత్తం ఎనిమిది రంగాలలో ఐదు రంగాలు క్షీణతను ఎదుర్కోగా.. కేవలం ఈ మూడు రంగాలు మాత్రమే పెరుగుదలను కనబర్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లోని ఏప్రిల్-మే కాలంలో కీలక రంగాల ఉత్పత్తి సూచీ 1.1 శాతం వృద్ధితో సరిపెట్టుకుంది. ఇది గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధితో సమానంగా ఉండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -