రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ..

– నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు 
– మనగ్రోమోర్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
– గుడుంబా అరికట్టాలని ఎమ్మెల్యే కు మహిళలు వినతి
నవతెలంగాణ – పెద్దవంగర
విత్తనాల కొనుగోలు నుండి, ధాన్యం అమ్మకాల వరకు రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మనగ్రోమోర్ సెంటర్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా సందర్శించారు. ఎరువులు, ఫర్టిలైజర్స్ అమ్మకాల వివరాలు, బిల్ బుక్, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆయా కంపెనీల విత్తనాల ప్యాకెట్ పై గల గడువు తేదీని పరిశీలించి, దుకాణ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్‌లో రైతులు సాగు చేయబోయే పంటలకు నాణ్యమైన విత్తనాలను అందించాలన్నారు. విత్తనాల మొలక శాతం పరిశీలించిన తరువాతే రైతులకు ఇవ్వాలన్నారు. దుకాణ యజమానులు తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరల పట్టిక ఉంచాలని, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని, లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తన డీలర్లు విధిగా షాపు యొక్క పేరు, డోర్‌ నెంబర్‌ కనిపించే విధంగా పెట్టాలన్నారు. విత్తనాలు, ఫర్టిలైజర్స్ విక్రయాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించబోమన్నారు. గ్రామాల్లో ఎవైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఎలక్షన్ కోడ్ అమలు లో ఉండడం వల్ల నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి, సంక్షేమ పనులు చేయలేకపోతున్నామని, కోడ్ ముగియగానే శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. కాగా ఎమ్మెల్యే మనగ్రోమోర్ తనిఖీలో కార్యక్రమంలో సంబంధిత అధికారులు లేకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే వచ్చిన కూడా అధికారులు రాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గుడుంబా అరికట్టాలని ఎమ్మెల్యే కు వినతి..
మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో గుడుంబా ఏరులై పారుతుందని, ఎక్సైజ్ పోలీసులు కనీసం గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని, కూలీ పనులు మానేసి తమ భర్తలు తాగుడు బానిసై, తమను చిత్రహింసలు పెడుతున్నారని స్థానిక మహిళలు ఎమ్మెల్యే ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. గుడుంబా నిర్మూలనకు కృషి చేయాలని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో గుడుంబా అరికట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుంపల కుమారస్వామి, సంకేపల్లి రవీందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఓరిగంటి సతీష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ జానీ, పన్నీరు వేణు, శ్రీరామ్ జగదీష్, జాటోత్ వెంకన్న, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, వినోద్, చిలుక సంపత్, పంతులు నాయక్, రామ్ చరణ్, పవన్, దంతాలపల్లి ఉపేందర్, మనగ్రోమోర్ మేనేజర్ సురేష్, ఫీల్డ్ ఆఫీసర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love