సింగరేణి విచ్ఛిన్నానికి కుట్ర

Conspiracy to break up Singareni– బొగ్గు గనులపై బీజేపీ-బీఆర్‌ఎస్‌ తీరు అభివృద్ధికి ఆటంకం
– నాడు సింగరేణి ప్రయివేటీకరణ బిల్లుపై బీఆర్‌ఎస్‌ సంతకం
– నేడు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా విమర్శలు
– వేలం లేకుండా గనులను నేరుగా సింగరేణికి అప్పగించాలి
– పరిరక్షణకు అఖిలపక్ష నేతలతో కలిసి ముందుకు: ఉపముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బొగ్గు గనులను ప్రయివేటీకరించి రాష్ట్రాభివృద్ధికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ విఘాతం కలిగిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తే వేలం లేకుండా గనులను సింగరేణికి అప్పగించాలని కోరారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సన్నిహితుల కోసం.. 2021 కోల్‌బ్లాక్‌ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా చేశారని విమర్శించారు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని బొగ్గు బ్లాక్‌లనూ ఆ సంస్థకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో గురువారం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని శుక్రవారం కలిసి విన్నవిస్తామన్నారు. తెలంగాణలో అతిముఖ్యమైన ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి భవిష్యత్‌లోనూ కొనసాగాలంటే కొత్త గనుల ఏర్పాటు తప్పనిసరి అన్నారు. ఈ గనులను వేలంపాట ద్వారా కాకుండా నేరుగా సంస్థకు కేటాయించాలని కోరారు. ఈ విషయంలో అఖిలపక్ష నేతలు ప్రధానమంత్రిని కలిసేందుకు కిషన్‌రెడ్డి ఏర్పాటు చేయాలన్నారు. తమ ప్రాంత గనులను తమకు ఇవ్వాలని అడిగేందుకు ఎలాంటి భేషజాలూ లేవన్నారు.
ఆ రెండు గనులను సింగరేణికి అప్పగించాలి
ఇటీవల వేలంలో పెట్టిన సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్‌కాస్టు గనులను సింగరేణికి అప్పగించాలని భట్టి డిమాండ్‌ చేశారు. 2015లో మైన్స్‌ అండ్‌ మినరల్‌ యాక్ట్‌ చేసినప్పుడు మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దానికి భిన్నంగా వేలం పాటలు నిర్వహించొద్దనడం ‘దొంగే దొంగ’ అని అరిచినట్టుగా ఉందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఎంఎండీఆర్‌ యాక్ట్‌ ప్రకారం వేలం నిలుపుదలకు ప్రయత్నిస్తామన్నారు. 42వేల మంది ప్రత్యక్షంగా, 22వేల మంది పరోక్షంగా..మరో 50వేల మంది సంస్థ ఆధారంగా ఉపాధి పొందుతున్నారని వివరించారు. అటువంటి సింగరేణి సంస్థను కాపాడాలని యూనియన్లు లేఖ ఇచ్చాయని తెలిపారు. కిషన్‌రెడ్డి, మోడీ రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్ణీత గడువులో కోయగూడెం, సత్తుపల్లి ఓసీల వేలం పూర్తి చేయలేదు కాబట్టి నాటి 5శాతానికి ఇంకో 0.5 శాతం ఇస్తాం.. వాటిని సింగరేణికే ఇవ్వాలని అడుగుతామన్నారు.
బీఆర్‌ఎస్‌ హయాంలోనే సింగరేణి విధ్వంసం
బీఆర్‌ఎస్‌ హయాంలోనే సింగరేణి విధ్వంసం జరిగిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మైన్స్‌ అండ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు తమకు సన్నిహితమైన అరంబిందో, ఆరో, అవంతిక, ప్రతీమ వంటి సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారని ఆరోపించారు. వేలంలో పాల్గొనేందుకు కేసీఆర్‌ అనుమతివ్వకపోవడం వల్లే సత్తుపల్లి, కోయగూడెం ఓసీలు సింగరేణికి దక్కలేదని ఆరోపించారు. ఈ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్స్‌ రూపంలో లబ్ది చేకూరిందన్నారు. సింగరేణి సంస్థ, ఆస్తులు, కొత్తగనులను కాపాడుకోవడం కోసం తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వ బొగ్గు గనుల శాఖమంత్రిని కలిశామని, ప్రస్తుత మంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. అవసరమైతే ప్రధానినీ కలిసేందుకు సిద్ధమన్నారు.
సింగరేణి సంసిద్ధంగా లేకుంటేనే వేలం వేయాలి: మంత్రి తుమ్మల
సింగరేణి సంసిద్ధత వ్యక్తం చేయకపోతేనే బొగ్గు గనులను వేలం వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2016లో ఒడిషా ప్రభుత్వ నైన్‌ఏ కంపెనీకి అప్పగించినట్టుగానే సింగరేణికి గనులను అప్పగించాలన్నారు. సింగరేణిని విచ్ఛిన్నం చేయాలనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నా యన్నారు.
ఉద్యోగులను తగ్గించిన కేసీఆర్‌ : కూనంనేని
తెలంగాణ రాక ముందు లక్ష మందికి పైగా సంస్థలో ఉద్యోగులు ఉంటే.. రాష్ట్రం వచ్చాక 42వేలకు కేసీఆర్‌ తగ్గించారని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఆనాడు మైనింగ్‌ బిల్లును సమర్థించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణి పరిరక్షణకు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్‌నాయక్‌ పాల్గొన్నారు.

Spread the love