ఆప్‌ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుట్ర

– ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ ఎంపీలకు, ఎమ్మల్యేలకు ఎర
న్యూఢిల్లీ: ఢల్లీీ, పంజాబ్‌లలో ఆమాద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి ‘ఆపరేషన్‌ తమరా’ ను అమలు చేస్తోందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరవ్‌భరద్వాజ్‌ ఆరోపించారు. బిజెపిలో చేరితే 20 నుంచి 25 కోట్లు డబ్బు, మరిన్ని పదవులు ఎరగా వేసిందని ఆయన గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనికి లొంగిపోయిన జలంధర్‌ ఆప్‌ ఎంపి సుశీల్‌, జలంధర్‌ ఎమ్మెల్యే శీతల్‌ అంగురల్‌ బిజెపిలోకి బుధవారం ఫిరాయించారని అన్నారు. ఆప్‌ను నాశనం చేయాలన్న లక్ష్యంతోనే బిజెపి ఇటువంటి నీతిబాహ్యమైన చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
అమెరికా వ్యాఖ్యలు అవాంఛనీయం
ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ అరెస్టుపై అమెరికా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దేశ ఎన్నికల, న్యాయ వ్యవస్థలపై, అవి అనుసరించే ప్రక్రియలపై బయటివారు చేసే వ్యాఖ్యలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. భారత్‌కు సర్వ స్వతంత్రమైన, క్రియాశీలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలు వున్నాయని, వాటిని ఏ రీతిలోనైనా, ఎవరైనా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినా వాటిని పరిరక్షించుకోవడానికి సిద్ధంగా వుంటామని స్పష్టం చేసింది.
భువనేశ్వర్‌లో ఆప్‌ దీక్షలు
కేజ్రివాల్‌ అరెస్టును నిరసిస్తూ గురువారం భువనేశ్వర్‌లో ఆప్‌ కార్యకర్తలు నిరాహార దీక్ష పాటించారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఏడు గంటల పాటు జరిగింది.
ఇడి ఏం కోరితే అది ఇస్తాం : అమిత్‌ పాలేకర్‌
ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా శాఖ అధ్యక్షుడు అమిత్‌ పాలేకర్‌ను ఇడి అధికారులు ప్రశ్నించారు. ఇడి ఆఫీసు నుండి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ, ‘దర్యాప్తు ఏం జరుగుతోందనేది వెల్లడించలేను, కానీ దర్యాప్తులో నేను కూడా పాల్గొన్నాను. వారేం ప్రశ్నలు అడిగారో దానికి సమాధానం చెప్పాను. ఈ కేసుకు సంబంధించిన డేటా అడిగారు, అందచేస్తానని చెప్పాను.” అని తెలిపారు. వారు వారి విధి నిర్వహిస్తున్నారు, నేను పౌరుడిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని అన్నారు.
నా భర్తను వేధిస్తున్నారు : సునీత కేజ్రివాల్‌
మద్యం విధానం కేసులో అరెస్టు చేసిన తన భర్తను ఇడి అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అరవింద్‌ కేజ్రివాల్‌ సతీమణి సునీతా కేజ్రివాల్‌ చెప్పారు. తన భర్త ఆరోగ్యం బాగా లేదని, షుగర్‌ లెవెల్స్‌ ఒడిదుడుకులకు గురవుతున్నాయని తెలిపారు. ప్రతి రోజూ రెండు పరీక్షలు చేయడానికి అనుమతించారని, డాక్టర్ల సలహా ప్రకారం ఇంటి భోజనానికి కూడా అనుమతించారని చెప్పారు. అరవింద్‌ చాలా ధైర్యవంతుడని, దేశభక్తిపరుడని, ఆయన పట్టుదల, దీక్ష కూడా చాలా బలంగా వుంటాయని ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలన ఇక ఎన్నాళ్లో సాగదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. గురువారంతో ఇడి కస్టడీ ముగియనుండడంతో కేజ్రివాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చారు. అక్కడకు వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. తన శరీరం జైల్లో వున్నా, తన ఆత్మ మాత్రం ఢిల్లీ ప్రజలతోనే వుంటుందని కేజ్రివాల్‌ వ్యాఖ్యానించారు. ”మీ కళ్లు మూసుకోండి, మీ పక్కనే నేను వున్నట్లు అనిపిస్తుంది.” అని అన్నారు. తన భర్త ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియో సందేశాన్ని సునీత ప్రజలకు చదివి వినిపించారు. ఆప్‌ను అణగదొక్కాలని చూస్తున్నారని ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు. అమెరికా, జర్మనీ ప్రభుత్వాల నుండి వచ్చిన వ్యాఖ్యలతో కేంద్రం బెదిరిపోతోందని, భారత్‌లో ప్రజాస్వామ్యం గురించి, కేజ్రివాల్‌ పారదర్శక విచారణ గురించి వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అరవింద్‌ కేజ్రివాల్‌, సౌరభ్‌ భరద్వాజ్‌లు చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై ఇడి లేదా బిజెపిల నుండి ఎలాంటి ప్రతిస్పందనలు ఎదురు కాలేదు.

Spread the love