ఫాం ఆయిల్ గెలలు.. కనీస మద్దతు ధర కోసం కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు..

– తెలంగాణ – ఆంధ్ర వ్యవసాయ మంత్రులతో సమావేశం ఏర్పాటు..
– ఆయిల్ ఫాం క్షేత్రాల్లో విద్యుత్ లైన్ లు పునరుద్దరణ కోసం విద్యుత్ – ఆయిల్ ఫెడ్ అధికారులతో కార్యాచరణ..
– అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటు..
– విలేకర్లు సమావేశంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచ వ్యాప్తంగా రైతులకు దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఏకైక పంట పామాయిల్ సాగు అని, కావున ఇతర పంటలు పండించే రైతులు సైతం పంట మార్పిడితో ఆయిల్ ఫాం సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫాం సాగును వచ్చే ఐదేళ్ళలో అయిల్ఫైడ్ 5 లక్షల ఎకరాల్లో సాగు విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసుకుందని, కానీ 10 లక్షల సాగును విస్తరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ని శుక్రవారం మంత్రి తుమ్మల సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 15 లోగా పవర్ ప్లాంట్ను ప్రారంభించాలని చెప్పారు.
అనంతరం ఆయిల్ ఫాం పరిశ్రమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో ఆయిల్ వినియోగం 100 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. కేవలం 3.6 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ ను మాత్రమే ఉత్పత్తి చేసుకుంటున్నామని, ఇంకా 27 శాతం క్రూడాయిల్ ఉత్పత్తికి అనుగుణంగా ఆయిల్ ఫాం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో  ఆయిల్ ఫాం  సాగు విస్తరణకు డిమాండ్ ఉంటుందని వివరించారు. దేశ వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో నే ఆయిల్ పామ్ సాగు అవుతుందని, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షలు, తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో పంట సాగుతున్నట్లు తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో సాగును విస్తరించే అవకాశం లేదని, తెలంగాణలో హైద్రాబాద్ మినహా మిగతా 30 జిల్లాలో ఆయిల్ ఫాం సాగుకు భూములు అనుకూలంగా ఉన్నట్లు వివరించారు. ఒక్కో ఎకరాకు ప్రభుత్వం రూ.50 వేల వరకు రాయితీ అందిస్తుందని, అంతర వంటలకు రాయితీ పధకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో లాభదాయకం లేదని ఆయిల్ ఫాం తోటలను తొలిగించే పరిస్థితులు ఉన్నాయని, అప్పుడు టన్ను గెలలు ధర కేవలం రూ.7 వేలు మాత్రమే ఉందని, నూనె దిగుమతి సుంకం విధించటం వల్ల రూ.12 వేలకు చేరిందని, కరోనా సమయంలో ఏకంగా రూ. 23 వేలు డిమాండ్ వచ్చిందని అన్నారు. కనీస మద్దతు ధర రూ.15 వేలు ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.
ఈ ధర తగ్గితే లోటును కేంద్రమే భర్తీ చేసేలా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కనీస మద్దతు ధర రూ.15 వేలు ఉంటే సాగు చేసేందుకు ఇతర రైతులు సిద్ధంగా ఉన్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆయిల్ ఫాం హబ్ గా ఉండేలా విస్తరణ లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. విద్యుత్ సమస్యలు,కూలీల కొరత లేకుండా పొట్టి రకం అధిక దిగుబడులు ఇచ్చే నూతన వంగడాలను రైతులకు పంపిణీ చేయనున్నామని అన్నారు. పాత రకం మొక్కల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థిక బలోపేతం చేసే దిశగా అంతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, గతంలో కోకో ధర రూ.200 లు ఉంటే ఇప్పుడు రూ. 1000 లు దాటిందని,అంతర పంటల సాగులో పొట్టి రకం వంగడాలు ఉపయుక్తంగా ఉంటుందని, అందుకే వాటికి ఆయిల్ఫెడ్ ప్రాధాన్యతనిస్తుంది అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల రాయితీ పథకాలు రైతులకు అందించేలా దృష్టి సారిస్తున్నామని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ఉద్యాన, వ్యవసాయ శాఖలను సమన్వయం చేసుకుని కేంద్రంపై వత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నూనె దిగుబడులు పై కేంద్రం పన్నును ఎత్తివేయడం వల్ల గెలలు ధర పడిపోయిందని, సుంకం విధించే లా కేంద్రానికి సూచనలు చేశామని, ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న టన్ను గెలలు ధర రూ.16 వేలకు పైగా పెరుగుతుందని అన్నారు. అడవులు అంతరించి పోవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఆయిల్ ఫాం సాగు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఫ్యాక్టరీ ల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని, దీనితో పాటు తోటల్లో విద్యుత్ లైన్లు సక్రమంగా లేక రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, సిఫ్టింగ్ చార్జీలు లేకుండా రైతుల సొంత ఖర్చులతో లైన్లు మార్చుకునేలా విద్యుత్ శాఖతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ .. ఉద్యాన పంటలు సాగులో తెలంగాణ లోనే అశ్వారావుపేట నియోజక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఇంకా అనేక ఉద్యాన పంటలు సాగు చేయడానికి ఆయిల్ ఫెడ్ తో సహా వ్యవసాయ శాఖ దృష్టి సారించాలని ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి, ఆయిల్ఫెడ్ ఎం.డి ఎస్.యాస్మిన్ బాషా ను కోరారు.
ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి, ఆయిల్ఫెడ్ ఎం.డి ఎస్.యాస్మిన్ బాషా మాట్లాడుతూ .. ఉద్యాన పంటలు అధికంగా పండే ఈ ప్రాంతంలో ఉద్యాన కళాశాల ఏర్పాటు కు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం అని, అన్ని సామాజిక వర్గాల రైతులకు ఆయిల్ ఫాం మొక్కలు, రాయితీలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి, పీ అండ్ పీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, అయిల్ఫెడ్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు ఆలపాటి రామ చంద్ర ప్రసాద్, ఆయిల్ ఫెడ్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజనల్ మేనేజర్ లు ఆకుల బాలక్రిష్ణ, భారతి, అశ్వారావుపేట, అప్పారావు పేట  పరిశ్రమల మేనేజర్ లు మంద నాగబాబు, జి.కళ్యాణ్ గౌడ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు రమణ, సూర్య నారాయణ లు పాల్గొన్నారు.
Spread the love