దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది. యువత విజ్ఞానం, శ్రమ, శాస్త్రీయ దృక్పథంతో ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మార్కెట్ శక్తులు రూపొందించిన వినిమయ సంస్కృతి వలలో యువత చిక్కుకుంటే సమాజం తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నేటి వ్యవస్థ యువతను పౌరులుగా మాత్రమే కాకుండా నిరంతరం వినియోగదారులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. మొబైల్ ప్రకటనలు, సోషల్ మీడియా, వినోదం, ఆన్‌లైన్ మార్కెట్, డిజిటల్ సేవలు యువత సమయం, దృష్టి, డబ్బును ఆకర్షిస్తున్నాయి. ఇది వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, లాభాల కోసం మార్కెట్ వ్యవస్థ రూపొందించిన సామాజిక, ఆర్థిక వ్యూహం. వినిమయ సంస్కృతి అంటే వస్తువులు కొనడం మాత్రమే కాదు. మనిషి ఆలోచనలు, సంబంధాలు, కలలు, అభిరుచులు, భవిష్యత్తును కూడా మార్కెట్‌కు అప్పగించే పరిస్థితి. ప్రకటనలు కొత్త అవసరాలను సృష్టిస్తూ, ఖరీదైన వస్తువులు, బ్రాండ్లు, విలాస జీవితాన్ని విజయానికి చిహ్నాలుగా చూపిస్తున్నాయి. సోషల్ మీడియా నిరంతర పోలికలు, లైక్స్, ఫాలోవర్లు, వైరల్ కావాలనే ఒత్తిడిని పెంచుతూ సమయాన్ని వృథా చేయడంతో పాటు మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. డ్రగ్స్, మద్యం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ వంటి వ్యసనాలు యువత జీవితాలను, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయి.
సినిమా, ఓటీటీ, సీరియల్స్, వినోద పరిశ్రమల్లో లాభాల కోసం విలాస జీవితం, అధిక వినియోగం, హింస, మూఢనమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. క్రీడలు కూడా వ్యాపారీకరణకు గురై కార్పొరేట్ లాభాల సాధనంగా మారుతున్నాయి. కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతను సక్రమంగా వినియోగించకపోతే తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, డేటా నియంత్రణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.మీడియా ప్రజలకు సమాచారం అందించాల్సిన సాధనం అయినప్పటికీ సంచలనాలు, ప్రకటనలు, వినోదం కోసం అసలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టే పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్య, వైద్యం వంటి సమస్యలపై ప్రజల దృష్టి తగ్గుతోంది. అవకాశవాద రాజకీయాలు కూడా యువతను డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతీయ విభజనల ద్వారా ప్రభావితం చేస్తున్నాయి. రుణ సంస్కృతి వస్తువులపై వ్యామోహాన్ని పెంచి, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, అప్పుల ద్వారా యువతను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోంది. నిరుద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం యువతలో భవిష్యత్తుపై ఆందోళన పెంచుతున్నాయి. విద్య కూడా వ్యక్తిత్వ వికాసం కంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారుతోంది. మరోవైపు ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, బ్రాండ్ల ప్రభావం యువత ఆహారపు అలవాట్లను మార్చి ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.
త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బెట్టింగ్, జూదం, ప్రమాదకరమైన ట్రేడింగ్, మోసపూరిత పథకాలు, సైబర్ నేరాలు వంటి వాటివైపు కొందరు ఆకర్షితులవుతున్నారు. వినిమయ సంస్కృతితో పాటు మతోన్మాదం, మనువాద భావజాలం కూడా యువతను శాస్త్రీయ దృక్పథం నుంచి దూరం చేస్తున్నాయి. మతం, కులం, జాతి పేరుతో విభజిస్తూ నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్య, వైద్యం, ఆకలి వంటి అసలు సమస్యలను మరచిపోయేలా చేస్తున్నాయి. ఖరీదైన ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులు, విలాస జీవితం, త్వరగా ధనవంతులు కావాలనే ఆకాంక్షలు యువతను వాస్తవ జీవిత సమస్యల నుంచి దూరం చేస్తున్నాయి. అయితే పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా లేదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం, పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా, రైతులు, మహిళలు, కార్మికులు, పర్యావరణం, ప్రజా విద్య, వైద్యం కోసం జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇది యువతలో సామాజిక చైతన్యం ఇంకా సజీవంగా ఉందని చూపుతోంది. చరిత్రలో ప్రతి గొప్ప మార్పులో యువత కీలక పాత్ర పోషించింది.
సమాజాన్ని మార్చేది వినియోగం కాదు.. చైతన్యం. భవిష్యత్తును నిర్మించేది విలాస జీవితం కాదు.. ప్రజల కోసం చేసే పోరాటం. నేటి యువత తమ శక్తిని డ్రగ్స్, బెట్టింగ్, వ్యసనాల వైపు కాకుండా జ్ఞానం, శ్రమ, సృజనాత్మకత వైపు మళ్లించాలి. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సోషల్ మీడియాను వ్యసనంగా మార్చుకోకుండా విజ్ఞానం, సమాచారం, సామాజిక చైతన్యం కోసం వినియోగించాలి. మతోన్మాదం, కుల వివక్షలకు బదులుగా మానవత్వం, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించాలి. అవకాశవాద రాజకీయాలకు బదులుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే శక్తిగా యువత ఎదగాలి. సమాజం, చరిత్ర, ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్య, వైద్యం, సామాజిక అసమానతలు వంటి సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి. విద్యార్థి, యువజన, కార్మిక, రైతు ఉద్యమాలతో కలిసి సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల కోసం గొంతెత్తాలి. సమాజాన్ని మార్చే శక్తి యువత చేతుల్లోనే ఉందన్న సత్యాన్ని గుర్తించాలి.
షేక్ బషీరుద్దీన్, 9704816603



