Thursday, August 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎవరు పిరికివాళ్లు?

ఎవరు పిరికివాళ్లు?

- Advertisement -

ఆగస్టు11న రాజ్యసభలో ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ “కమ్యూనిస్టులు పిరికివాళ్లు” అని చేసిన వ్యాఖ్య అసహేతుకమైనది. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను పరిశీలించి “పిరికితనం” అనే పదాన్ని భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో అనేకమంది కమ్యూనిస్టులు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు, జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడిన చరిత్ర కమ్యూనిస్టుల ధైర్య సాహసాలకు ప్రతీక. కార్మికులు, రైతులు, కూలీల హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్మిస్తూ నిత్యం కేసులు, అరెస్టులు, జైళ్లు నేటికీ ఎదుర్కొంటున్న వాస్తవాలను విస్మరించడం అంటే చరిత్రను ఎంపిక చేసుకుని చదవడమే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’లో కమ్యూనిస్టులు భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ ఉద్యమంలో నాలుగు వేల మంది అమరులయ్యారు. సుమారు పదిలక్షల ఎకరాల భూమి పేద లకు పంచారు. ఈ చారిత్రక అంశాలను విస్మరించడం చరిత్ర పట్ల నిర్మలమ్మ అసంపూర్ణ అవగాహనను స్పష్టం చేస్తుంది.

అసలు పిరికివాళ్లెవరో భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను తిరగేస్తే తెలిసిపోతుంది కదా…బ్రిటిష్ జైళ్లలో ఉన్నప్పుడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని కొనసాగించిన స్వతంత్ర సమరయోధులున్న జైళ్లలోనే, బ్రిటిష్ ప్రభుత్వానికి విడుదల, ఉపశమనం కోరుతూ క్షమాభిక్ష పిటిషన్లు సమర్పించిన వారూ ఉన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ అండమాన్ సెల్యులార్ జైలులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పలు పిటిషన్లు సమర్పించిన విషయం చారిత్రక రికార్డుల్లో నమోదై ఉంది. 1913 నవంబర్ 14న ఆయన సమర్పించిన పిటిషన్‌లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన పరిస్థితిపై సానుకూలంగా స్పందించాలని కోరారు. మరోవైపు, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఆరెస్సెస్‌ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్‌’లో త్రివర్ణ పతాకంపై అభ్యంతరాలు వ్యక్తమైన చరిత్ర కూడా నిక్షిప్తమై ఉంది. ఒకరి చర్యను “రాజకీయ వ్యూహం”గా అర్థం చేసుకుని, మరొకరి పోరాటాన్ని “పిరికితనం”గా కొట్టిపారేస్తే అది చరిత్రను ఒకే ప్రమాణంతో చదవడం అవుతుందా?
కమ్యూనిజం కేవలం కొంతమంది వ్యక్తుల రాజకీయ అభిప్రాయం కాదు, అది సమాజాన్ని వర్గ సంబంధాల కోణంలో విశ్లేషిస్తూ, దోపిడీ-అసమానతలకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించే ఆచరణాత్మక సిద్ధాంతం.

కాబట్టి కమ్యూ నిస్టుల పోరాటం ఎప్పుడూ వ్యక్తిగతంగా, వ్యక్తులపై రాగ ద్వేషాలతో ఉండదు, మొత్తం వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ఉంటుంది. సమాజంలో సంపదను సృష్టించేది ఎవరు? ఉత్పత్తి చేసేది ఎవరు? ఆ సంపదపై నియంత్రణ ఎవరిది? శ్రమ చేసేవారికి దాని ఫలితంలో ఎంత భాగం దక్కుతోంది? భూమి ఎవరి చేతుల్లో ఉంది? కార్మికుడి శ్రమతో సృష్టించిన విలువలో అతనికి దక్కేదెంత? ఈ ప్రశ్నలే మార్క్సిజం కేంద్రబిందువు. వ్యక్తులపై విమర్శ కాదు, వ్యవస్థలోని అసమానతలను గుర్తించి వాటిని మార్చే ప్రయత్నమే కమ్యూనిస్టు రాజకీయాల లక్ష్యం. అటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్న వ్యవస్థకు ప్రతినిధులుగా ఉన్న కొంతమందికి అసౌకర్యం, ఇబ్బంది కలగడం సహజమే. ఆ అసహనంలో నుంచే పిరికివాళ్లు వంటి అతిశయోక్తులు అప్పుడప్పుడు వస్తుంటాయి. కమ్యూనిస్టులను తిట్టడం అంటే ప్రశ్నను ఎదుర్కోలేక ప్రశ్నించే వ్యక్తిని అవమానించడమే. అందుకే చరిత్రను తిడుతూ ఓడించలేరు. ప్రశ్నలను మౌనంతో ఆపలేరు. సమాధానం చెప్పలేని ప్రశ్నలే చివరికి ఉద్యమాలుగా మారుతాయి.

విజయ్‌ పుట్టపాగ, 8008028237

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -