ఖమ్మం కాంగ్రెస్‌ టిక్కెట్‌కు పోటాపోటీ

Contest for Khammam Congress ticket– రాష్ట్రంలోనే హాట్‌ సీటుగా మారిన లోక్‌సభ స్థానం
– అన్ని అసెంబ్లీ సీట్లూ ‘హస్త’గతమవటమే కారణం
– 15 మందికి పైగా దరఖాస్తు చేసినట్టు సమాచారం
– పోటీపడుతున్న ఇద్దరు మంత్రుల కుటుంబీకులు
– ప్రముఖ కాంగ్రెస్‌ నేతలు సైతం ఇక్కడి నుంచే ఆసక్తి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ లోక్‌సభ టిక్కెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు 306 దరఖాస్తులు వచ్చినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అన్నింటికంటే ఖమ్మం స్థానానికే అత్యధిక దరఖాస్తులు అందినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి మొత్తం 15 మందికి పైగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. వీరిలో ముగ్గురు మంత్రుల్లో తుమ్మల నాగేశ్వరరావు మినహా మిగిలిన ఇద్దరు అమాత్యుల కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ కాంగ్రెస్‌ నేతలూ ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం (సీపీఐ) ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్‌, దాని మద్దతుదారులు విజయం సాధించడమే ఈ తీవ్ర పోటీకి కారణం. అంతేకాదు దీని పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులంతా భారీ మెజార్టీ సాధించారు. గరిష్టంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి 56,650, కనిష్టంగా మట్టా రాగమయి 19,440 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం మీద ఈ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌, దాని మద్దతుదారులు సాధించిన మెజార్టీలు 2.50 లక్షల వరకు ఉండటంతో ఆశావహులు ఈ స్థానం నుంచి పోటీ చేసి సునాయా సంగా గెలుపొందాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.
ఇద్దరు మంత్రుల కుటుంబీకుల్లో టిక్కెట్‌ పోటీ..?
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి భారీగా ఆశావహులున్నా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల్లో ఇద్దరి కుటుంబీకుల్లో ఎవరికి టిక్కెట్‌ అనేదానిపై ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మందీమార్బలంతో కార్ల ర్యాలీగా హైదరాబాద్‌ తరలివెళ్లి ఆమె శనివారం దరఖాస్తు సమర్పించారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి తరపున ఎలాంటి హడావుడి లేకుండా ఆయన మద్దతుదారులు దరఖాస్తు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్‌ కూడా దరఖాస్తు చేయాలని భావించినా చివరి నిమిషంలో వారు విరమించుకున్నట్టు తెలుస్తున్నది. వీరితో పాటు రాయల నాగేశ్వరరావు, రేణుకాచౌదరి, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌, వి. హనుమంతరావు పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, ఒక దశలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలనే డిమాండ్‌లు వినిపించాయి. సోనియాగాంధీ పోటీ చేయని పక్షంలోనే తాము బరిలో ఉంటామని పలువురు ప్రకటించారు.
డబ్బు.. పొత్తుల ఆధారంగానే టిక్కెట్‌కు చాన్స్‌
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌కు ఎంత అనుకూల పరిస్థితులు ఉన్నా డబ్బు, పార్టీల పొత్తులు కూడా కీలకంగా మారునున్నాయి. ఎందుకంటే ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, ప్రస్తుత ఎంపీ నామ నాగేశ్వరరావు పోటీలో ఉంటారని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. ఈ దృష్ట్యా ఆయనకు దీటుగా డబ్బులు వెచ్చించగల నాయకుడికే టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో నామ 1.60 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపులో టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో వీటిలో ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది కూడా కీలకం. ఈ పార్టీలే కాక ఇండియా కూటమిలో ఉన్న దృష్ట్యా సీపీఐ(ఎం) పొత్తు కూడా ప్రధానంగా మారే అవకాశం ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసుకునే అభ్యర్థుల ఎంపిక ఉండే చాన్స్‌ ఉంది. కాబట్టి అభ్యర్థులెందరు ఉన్నా అధిష్టానం మాత్రం భారీ విజయమే లక్ష్యంగా ఖమ్మం అభ్యర్థిని ప్రకటిస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే పోటీకి పలువురు ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్న దృష్ట్యా కాంగ్రెస్‌లో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకతను తోసిపుచ్చలేమని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Spread the love