రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటక ముందే ఎండవేడిమి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. దాంతో చాలా మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. సాధారణంగా ఈ కాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. కేవలం నీళ్లు మ్రాతమే తాగితే దాహం తీరినట్టు అనిపించదు. అందుకే రకరకాల పండ్లతో జ్యూసులు చేసుకొని తాగుతుంటారు. అయితే సీజన్‌లో దొరికే వాటితో జ్యూస్‌లు చేసుకొని తాగితే ఒంటికి ఎంతో మంచిది. అలాంటి జ్యూస్‌ల గురించి ఈరోజు తెలుసుకుందాం…
మ్యాంగో లస్సీ
కావాల్సిన పదార్థాలు: పెరుగు – రెండు కప్పులు, మ్యాంగో ప్యూరీ – ఒకటిన్నర కప్పులు, పంచదార – రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ – కొన్ని.
తయారీ విధానం: బాగా పండిన మామిడిపండ్లను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకుని మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఒకటిన్నర కప్పులు ఉండేలా చూసుకోవాలి. మిక్సీజార్‌లోకి మ్యాంగో ప్యూరీ, పంచదార, యాలకుల పొడి, నాలుగు ఐస్‌క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులోకి చిక్కటి, తాజా గడ్డ పెరుగు వేసుకుని మరోసారి మెత్తగా, క్రీమీ టెక్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాస్‌లోకి పోసుకుని డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ రెడీ.
మస్క్ మిలన్ జ్యూస్
కావాల్సిన పదార్థాలు : కర్బూజ పండ్లు – రెండు, సబ్జా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, సగ్గుబియ్యం – అర కప్పు, పాలు – లీటర్, కస్టర్డ్ పౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర – ఏడెనిమిది టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ తరుగు – కొద్దిగా .
తయారీ విధానం: ముందుగా తాజా కర్బూజ పండ్లు తీసుకున్ని రెండు ముక్కలుగా కట్ చేసి గింజలను తొలగించుకోవాలి. తర్వాత చెంచాతో కర్బూజ ముక్కల్లో ఉండే గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో నుంచి మూడ్నాలుగు టేబుల్ స్పూన్ల గుజ్జును మరో చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కనుంచాలి. అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో పక్కకు తీసినది కాకుండా మిగతా కర్బూజ గుజ్జు మొత్తాన్ని వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న కర్బూజ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఆలోపు సబ్జా గింజలను కొన్ని నీళ్లుపోసి10 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మరో గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్‌లో నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. వాటర్ వేడెక్కి బబుల్స్ వస్తున్నప్పుడు అందులో కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే క్రమంలో వాటర్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం 80 శాతం ఉడికాక అందులో లీటర్ పాలు పోసుకుని ఒకసారి బాగా కలిపి మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మరో చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకుని అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే దాని ప్లేస్‌లో కార్న్‌ఫ్లోర్ లేదా మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం-పాల మిశ్రమం వేడెక్కి మరుగుతున్నప్పుడు అందులో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ నీళ్లను పోసి వెంటనే బాగా కలపాలి. తినే తీపిని బట్టి కొద్దిగా పంచదార కూడా వేసుకుని మూడ్నాలుగు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ మిశ్రమం చక్కగా ఉడికి క్రీమిగా, చిక్కగా మారిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కిందకు దింపు పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని ముందుగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచిన కర్బూజ జ్యూస్‌లో వేసుకోవాలి. అందులోనే నానబెట్టిన సబ్జాగింజలు, పక్కకు తీసిన కర్బూజ గుజ్జు, సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ తరుగు వేసుకుని బాగా కలపాలి. దీన్ని సర్వింగ్ గ్లాసులలో పోసుకుని వెంటనే అయినా సర్వ్ చేయొచ్చు. లేదా ఇంకాస్త చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో ఒకట్రెండు గంటల పాటు ఉంచి అయినా సర్వ్ చేసుకోవచ్చు.
సోంపు షర్బత్
కావాల్సిన పదార్థాలు : సోంపు గింజలు – కప్పు (250 గ్రాములు), నీళ్లు – మూడు కప్పులు, పటిక బెల్లం – అర కిలో, యాలకుల గింజల పొడి – అర టీ స్పూన్, నిమ్మ ఉప్పు – చిటికెడు
తయారీ విధానం : సోంపు గింజలను ఓ గిన్నెలోకి తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ముప్పావు లీటర్ నీళ్లు పోసి రాత్రి మొత్తం నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన సోంపు గింజలను నీటితో సహా మిక్సీ జార్‌లోకి వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన సోంపు మిశ్రమాన్ని తెల్లటి కాటన్ క్లాత్‌లో వేసి గట్టిగా పిండాలి. ఇలా చేయడం వల్ల సోంపు రసం సెపరేట్ అవుతుంది. సోంపు మిశ్రమం నుంచి రసం తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వడకట్టిన రసాన్ని పోసుకోవాలి. ఇందులో పటిక బెల్లం ముక్కలు వేసి మధ్యమధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. పటిక బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు పైన తేట లాంటిది వస్తుంది. దానిని గరిటెతో తీసేసుకోవాలి. సోంపు రసం ఉడికి చిక్కగా మారుతున్నప్పుడు యాలకుల పొడి వేసుకుని బాగా కలపాలి. రసం మరిగి లేత తీగ పాకం వచ్చినప్పుడు నిమ్మ ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఓ గాజు జార్‌లో స్టోర్ చేసుకుంటే సోంపు స్క్వాష్ రెడీ. ఇది రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. సోంపు షర్భత్ ఎలా తయారు చేసుకోవాలంటే ఓ గాజు గ్లాసులోకి రెండు టేబుల్ స్పూన్ల సోంపు స్క్వాష్ తీసుకోవాలి. అందులోకి టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, పావు లీటర్ చల్లటి నీళ్లు, కొన్ని ఐస్‌క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సోంపు షరబత్ రెడీ.
లెమన్ పంచ్
కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు – రెండు, ఉప్పు – పావు చెంచా, పచ్చిమిర్చి – రెండు, పంచదార – మూడు టేబుల్‌స్పూన్లు, పుదీనా ఆకులు – కొన్ని, ఐస్‌క్యూబ్స్ – తగినన్ని, చల్లటి నీళ్లు – 300 ఎం.ఎల్.
తయారీ విధానం: నిమ్మకాయలను సగానికి కోసి రసం పిండి పక్కన ఉంచాలి. పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా, రౌండ్‌గా కట్ చేసి పక్కన ఉంచాలి. పుదీనా ఆకులను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వెడల్పు మూత కలిగిన గాజు బాటిల్‌లోకి నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, పంచదార, మూడు ఐస్‌క్యూబ్స్, చల్లటి నీళ్లు పోసి ఓ రెండు నిమిషాల పాటు ఆపకుండా షేక్ చేయాలి. ఓ గాజు గ్లాస్‌లోకి మరో మూడు ఐస్‌క్యూబ్స్ వేసి మిక్స్ చేసుకున్న లెమన్ మిశ్రమాన్ని పోసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోయే లెమన్ పంచ్ రెడీ.



