ఇంటి ఆవరణలో నాటిన మొక్క కాలక్రమంలో చెట్టుగా మారుతుంది. ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా అలాగే కుటుంబానికి ఆధారాలుగా ఎదుగుతారు. కొడుకు వంశాన్ని కొనసాగిస్తాడని అంటారు. కానీ కూతురు కుటుంబానికి ఒక కొత్త హృదయాన్ని తీసుకొస్తుంది. ఆమె పుట్టుకతో ఇంటి వాతావరణంలో ప్రేమ, ఆప్యాయత, మమకారం మరింత లోతుగా పాతుకుపోతాయి.
అయితే, ఈ మానవీయ అనుబంధాల మధ్య మన సమాజం ఒక విచిత్రమైన భావనను తరతరాలుగా మోస్తోంది. పుట్టిన నాటి నుంచే కూతురిని ‘పరాయి ఇంటి అమ్మాయి’గా పిలవడం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆమె బాల్యంలోనే భవిష్యత్తు విడిపోవడాన్ని గుర్తుచేసే మాటలు వినిపిస్తాయి. కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రం అంత సులభం కాదు. నిజంగా కూతురు ఎప్పుడైనా పరాయి అవుతుందా? తండ్రిని తొలిసారి ‘నాన్న’ అని పిలిచిన స్వరం పరాయిదా? తల్లి ఒడిలో నిద్రించిన జోలపాటలు పరాయివా? ఇంటి గోడలపై మిగిలిన ఆమె చిన్ననాటి గుర్తులు పరాయివా? ఆమె నవ్వులతో మారుమోగిన ఆ ఇంటికి ఆమె ఎప్పుడైనా పరాయి కాగలదా?
జీవితం ఒక దశలో ఆమె మరో ఇంటికి వెళ్తుంది. అది సమాజం సృష్టించిన మార్పు. కానీ ఆ మార్పు తల్లిదండ్రుల హృదయాల్లోని అనుబంధాన్ని ఎప్పటికీ మార్చదు. అందుకే కూతురి పెళ్లి రోజున తండ్రి కళ్లలో కనిపించే తడి బలహీనత కాదు, అది ప్రేమకు ఉన్న అత్యంత సహజమైన వ్యక్తీకరణ. నేడు మహిళల హక్కులు, సమాన అవకాశాలు, సాధికారత గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది సమాజానికి అవసరమైన మార్పు. అయితే చట్టాలతో పాటు మన ఆలోచనా విధానం కూడా మారాలి. కూతురిని జాలికి పాత్రగా కాదు, గౌరవానికి అర్హురాలిగా చూడాలి. రక్షణ పేరుతో పరిమితులు విధించడం కాదు, స్వేచ్ఛతో ఎదిగే అవకాశాలు కల్పించాలి. ఆమె జీవిత నిర్ణయాలను ఇతరులు తీసుకోవడం కాదు, తన భవిష్యత్తును తానే నిర్మించుకునే హక్కును గౌరవించాలి.
సమాజ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా, కుటుంబం కేవలం రక్తసంబంధాల సమూహం కాదు, విలువలను నిర్మించే తొలి పాఠశాల. అక్కడే సమానత్వం నేర్చుకుంటేనే సమాజంలోనూ సమానత్వం బలపడుతుంది. కూతురు, కొడుకు అనే తేడా లేకుండా అవకాశాలు, ఆస్తి, విద్య, గౌరవం అన్నింటిలో సమాన దృష్టి అవసరం. ‘పరాయి ధనం’ అనే మాటలో ప్రేమ లేదు, పాత సామాజిక భావన మాత్రమే ఉంది. మనుషులు ఆస్తులు కాదు. బంధాలకు యాజమాన్యం ఉండదు. కూతురు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లవచ్చు. కానీ తల్లిదండ్రుల గుండెల్లో ఆమె స్థానం ఎప్పటికీ మారదు. ఒక కుటుంబం కూతురిని ఎంత గౌరవిస్తుందో, ఒక సమాజం మహిళలను ఎంత సమానంగా చూస్తుందో, అదే ఆ సమాజ నాగరికతకు అసలు ప్రమాణం. కూతురు ఇంటి గుమ్మం దాటవచ్చు. కానీ ఆమె తల్లిదండ్రుల గుండె గుమ్మం ఎప్పటికీ దాటదు. అదే అనుబంధం. అదే మానవత్వం. అదే కుటుంబం అనే వ్యవస్థకు ఉన్న నిజమైన అందం.
మామిండ్ల రమేష్ రాజా,7893230218
ఇంటి గుమ్మం దాటినా..గుండె గుమ్మం దాటదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



