కార్పొరేట్‌ విద్యాసంస్థల పుస్తకాల దందా

Corporate educational institutes book collection– విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రయివేటు స్కూళ్లు
– సొంత పాఠ్య పుస్తకాలే వాడుతున్న యాజమాన్యాలు
– ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
– జీవో నెంబర్‌ 1ని అమలు చేయని విద్యాశాఖ
– ఎస్‌సీఈఆర్టీ సిలబస్‌ను పట్టించుకోని వైనం
– సేల్‌ బుక్‌ ప్రింటర్ల పాఠ్యపుస్తకాలను కొనకుండా ఇష్టారాజ్యం
– పట్టించుకోని రాష్ట్ర సర్కార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలనే కొని వాడాలని జీవో నెంబర్‌ ఒకటి చెప్తున్నది. కానీ ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేట్‌ యాజమాన్యాలు యధేచ్చగా బేఖాతర్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలంటూ జీవో నెంబర్‌ ఒకటి చెప్తున్నది. సొంతంగా సిలబస్‌ను తయారు చేసుకుని ముద్రించిన పుస్తకాలనే ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విక్రయిస్తున్నాయి. అధిక ధరలకు అమ్ముతుండడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతున్నది. బహిరంగ మార్కెట్‌లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు పాఠ్యపుస్తకాల ధరలున్నాయి.కానీ ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో రూ.నాలుగు వేల నుంచి రూ.15 వేల వరకు అమ్ముతున్నాయి. ఈ ధరలను ఎవరు నిర్ణయాస్తారో తెలియదు.ఒక్కో యాజ మాన్యంలో ఒక్కో తరగతి పుస్తకాల ధరలు ఒక్కో రకంగా ఉంటాయి. తక్కువ ధరకు దొరకాల్సిన పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్‌సీఈఆర్టీ ముద్రించిన పుస్తకాలను కొనుగోలు చేయడం లేదు.నిబంధనలను యధేచ్చగా తుంగలో తొక్కుతున్నా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జీవో నెంబర్‌ ఒకటి ప్రకారం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను వినియోగించకపోతే గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడం లేదు. దీంతో ప్రయివేటు,కార్పొరేట్‌ పాఠశాలల యాజ మాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నాయి. పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, ష్యూ, బెల్టు, టై, బ్యాగులు వంటి వాటిని తమ వద్దే కొనాలంటూ తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. చదువు పేరుతో అన్ని రకాలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి.
హైదరాబాద్‌ డీఈవో ఆదేశాలతో కొంత ఊరట
ప్రయివేటు,కార్పొరేట్‌ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారాలు, ష్యూ, బెల్టు వంటి వాటిని విక్రయించడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్‌ డీఈవో ఆర్‌ రోహిణి సర్క్యులర్‌ జారీ చేశారు.రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన సిలబస్‌ పుస్తకాలనే చదవాలని ఆదేశించారు.లాభాపేక్ష లేకుండా ప్రయివేటు స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారా లు విక్రయించాలని సూచించారు. ఈ ఆదేశాల వల్ల విద్యార్థులు,తల్లిదండ్రులకు కొంత ఊరట లభించింది.ఇష్టారాజ్యంగా పాఠ్యపుస్తకాలు, యూని ఫారాలు అమ్ముతున్న కొన్ని ప్రయివేటు యాజ మాన్యాలు విక్రయించకుండా ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకు అమ్మాల్సి వచ్చింది. అయితే అన్ని ప్రయివేటు పాఠశాలలు ఈ ఆదేశాలను పాటించ డం లేదు.పాఠ్యపుస్తకాలు,నోట్‌ పుస్తకాలు, యూని ఫారాలు,స్టేషనరీ వంటి వాటిని వ్యాపారం చేస్తు న్నాయి.దీన్ని ప్రభుత్వం అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలను సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేసి ఎక్కువ ధరలకు విక్రయించే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Spread the love