డబల్‌ ఇంజన్‌ పాలనలో అవినీతి అక్రమాలు

– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌ బహుదూర్‌
నవతెలంగాణ – తిమ్మాజిపేట
డబుల్‌ ఇంజన్‌ పాలనలో అవినీతి అక్రమాలు అధికంగా జరిగాయని, డబుల్‌ ధరలు పెంచి రైతు నడ్డి విరచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని కాంగ్రెస్‌ ఓటేసి నాగర్‌ కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ మల్లురవిని గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీనివాస్‌ బహుదూర్‌ పిలుపునిచ్చారు. తిమ్మాజీపేట మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ధరలు ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పెరగలేదని బీజేపీ ప్రభుత్వం రైతుకు అవసర మయ్యే వ్యవసాయ పరికరాల ధరలు పెంచి రైతును వ్యవసాయానికి దూరం చేసిందని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలకు సెజ్లో పనిచేసే వారికి జీతాలు పెంచకుండా రైతు పండించే వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా ఉపాధి హామీ కూలీలను ఆదుకోకుండా ట్రాక్టర్ల ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై జిఎస్టి భారం మోపుతూ అంబానీ ఆదానీ వంటి కుబేరులకు జీఎస్టీ ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి అవినీతిలో కూరుకు పోయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌ ను చిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో డ్యాముల నిర్మాణాలు జరిగాయని దళితులకు గిరిజనులకు ప్రభుత్వ భూముల పంపిణీ చేయడమే కాకుండా పార్టీలకు కులమతాలకు అతీతంగా ఉచిత ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ద్వారానే అభివద్ధి సాధ్యమని అందరి చూపు కాంగ్రెస్‌ వైపు ఉందని కాంగ్రెస్‌ అంటేనే మల్లురవి అని రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కోసం ఆయన చేసిన సేవలు మరువలేని అన్నారు. పిలిస్తే పలికే మల్లురవిని అధిక మెజార్టీతో గెలిపించాలని అందుకోసం అందరూ ఏకం కావాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దానం బాలరాజు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నేరేళ్లపల్లి మనోహర్‌ తదితరులు ఉన్నారు.

Spread the love