– నలుగురు కానిస్టేబుళ్ల నుంచి ఫోన్‌ట్యాపింగ్‌పై మరింత సమాచారం సేకరిస్తున్న స్పెషల్‌టీం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడైన డీఎస్పీ ప్రణీత్‌రావు బెయిల్‌పై బుధవారం నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనున్నది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రణీత్‌రావు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈయనకు బెయిల్ ఇవ్వరాదనీ, కేసు ఇంకా విచారణ సాగుతున్నదనీ, ఒకవేళ బెయిల్ లభిస్తే ప్రణీత్‌రావు ఆధారాలను తారుమారు చేసే అవకాశమున్నదని పంజాగుట్ట స్పెషల్ టీం తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వీరిద్దరి వాదనలను విన్న న్యాయమూర్తి తన తీర్పును బుధవారానికి వాయిదావేశారు.
ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారులు.. తమ అదుపులో ఉన్న నలుగురు ఎస్‌ఐబీ కానిస్టేబుళ్లను ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై క్షుణ్ణంగా విచారిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు బుజంగరావు, తిరుపతన్నలతో పాటు నగర టాస్క్‌ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్‌రావులు ఇచ్చిన పలు ఆదేశాలను ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి వీరు అమలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
అంతేగాక, గత ఉప ఎన్నికల సందర్భంలో విపక్షాలకు చెందిన వాహనాలను అడ్డుకొని అందులో నుంచి కోట్ల రూపాయల డబ్బులను స్వాధీనం చేసుకోవటంలో ఈ కానిస్టేబుళ్లు పైఅధికారుల ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించారని విచారణలో వెల్లడైనట్టు తెలుస్తున్నది. దీంతో వీరెక్కడెక్కడ, ఎవరెవరి నాయకుల వాహనాలను అడ్డగించి, ఎంతమేర డబ్బులను స్వాధీనపర్చుకున్నారు? ఆ డబ్బులను ఎక్కడికి తరలించారు? అనే కోణంలో స్పెషల్ టీం అధికారులు సీరియస్‌గా ఆరా తీస్తున్నట్టు సమాచారం.
బుధవారంతో తమ కస్టడీలో ఉన్న రాధాకిషన్‌రావు విచారణ గడువు పూర్తవుతుండటంతో ఆయనను కోర్టులో హాజరుపర్చటానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కాగా, మంగళవారం కూడా రాధాకిషన్‌రావును ఈ కేసు దర్యాప్తును నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్‌ను పర్యవేక్షిస్తున్న నగర పశ్చిమ మండలం డీసీపీ విజరుకుమార్ క్షుణ్ణంగా విచారించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కొంత అదనపు సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్‌లకు సంబంధించి ఆయన సేకరించినట్టు తెలుస్తున్నది.