– పోడుదారుల అరెస్టుకు ఫారెస్టు అధికారులు యత్నం
– ప్రతిఘటించిన పార్టీ శ్రేణులు
– ఘటనపై పోలీసులకు తెలంగాణ గిరిజన సంఘం ఫిర్యాదు
– ఎమ్మెల్యే, ఎస్‌ఐ అదేశాలతో వెనక్కు తగ్గిన అటవీ అధికారులు
నవతెలంగాణ-కారేపల్లి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంపై బుధవారం ఫారెస్టు అధికారులు దాడికి యత్నించారు. ఈ నెల 5వ తేదీ రాత్రి మాణిక్యారం, ఊటవాగు సమీపంలోని పోడు ప్లాంటేషన్‌ను కొందరు ధ్వంసం చేశారు. దానిపై ఆరుగురు పోడు సాగుదారులపై ఫారెస్టు అధికారులు కేసులు పెట్టారు. కేసుల విషయమై కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్వో సిద్దార్ధరెడ్డితో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్య వీరభద్రం ఆధ్వర్యంలో పోడుదారులు చర్చించారు. అటవీ సమస్యలపై రెండు రోజుల్లో ఫారెస్టు హైలెవల్ కమిటీ పర్యటన ఉందని, పర్యటన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఫారెస్టు, పోలీసు అధికారులను సీపీఐ(ఎం) నాయ కులు కోరారు. ఇదే సమయంలో ఆదివాసీ గిరిజన సంఘం సమావేశం సీపీఐ(ఎం) ఆఫీస్‌లో జరుగుతుండగా కొందరు గిరిజనులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సీపీఐ (ఎం) నాయకులు.. పోలీసులతో చర్చలు నడుస్తుండగానే ఎఫ్‌ఆర్వో సిద్దార్దరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది ఫారెస్టు శాఖ అధికారులు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోడుదారులను అరెస్టు చేసేందుకు యత్నించారు. సీపీఐ(ఎం) నాయకులు వారిని అడ్డుకోవటంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) కార్యాలయానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించినా ఫారెస్టు శాఖ అధికారులు మాట్లాడకుండా గొడవకు దిగే ప్రయత్నం చేశారు.
సీపీఐ(ఎం) కార్యాలయంపై దాడికి ఖండన
ప్రజాసమస్యల పరిష్కార వేదికైన సీపీఐ(ఎం) కార్యాలయంపై కారేపల్లి ఎఫ్‌ఆర్వో సిద్దార్ధరెడ్డి అత్యుత్సాహంతో దాడికి ప్రయత్నించారని, అతన్ని సస్పెండ్ చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. పోడు సమస్యపై చర్చలు నడుస్తుండగానే పోడుదారులను అరెస్టు చేసే సాకుతో పార్టీ కార్యాలయంపై దాడికి దిగడం దారుణమన్నారు. కొత్త ప్రభుత్వంను బదనాం చేసే పనుల్లో భాగంగానే ఎఫ్‌ఆర్వో చర్యలు ఉన్నాయని ఆరోపించారు. సీపీఐ(ఎం) ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాప్(టోనీ), మల్లెల నాగేశ్వరరావు, గుగులోత్ భీముడు, దారావత భద్రునాయక్, గడ్డం వెంకటేశ్వర్లు, తొగరు శ్రీను సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావు, కే.నరేంద్ర, తలారి దేవప్రకాశ్, ముక్కా సీతారాములు, కే.ఉమావతి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వజ్జా రామారావు, దుగ్గి కృష్ణ, బీఆర్‌ఎస్ నాయకులు ఎస్‌కె. గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద మోహరించిన ఫారెస్టు శాఖ ఫోర్స్
పోడుదారుల అరెస్టుకు సీపీఐ(ఎం) కార్యాలయంపై దాడికి యత్నించిన విషయం స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ ఫారెస్టు రేంజ్ అధికారితో మాట్లాడారు. అయినా ఫారెస్టు శాఖ అధికారులు వెనక్కు తగ్గకుండా కార్యాలయం వద్దే కాపుకాశారు. రెండు గంటల పాటు సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక సమయంలో ఆందోళన జరుగుతుండగానే ఎఫ్‌ఆర్వో సిద్దార్ధరెడ్డి తన సిబ్బందిని పురమాయించడంతో అరెస్టుకు దూసుకొచ్చారు. దాంతో సీపీఐ(ఎం) నాయకులు అడ్డుపడి అధికారులతో వాగ్వివాదానికి దిగి నిలువరించారు. సీపీఐ(ఎం) కార్యాలయంపై దాడి చేసి భయాందోళనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కారేపల్లి ఎస్‌ఐ పుష్పాల రామారావుకు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతున్న తరుణంలో ఎస్‌ఐ పుష్పాల రామారావు జోక్యం చేసుకొని ఇరు గ్రూపులను నిలువరించారు. ఈ లోపు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఉన్నతాధికారులతో మాట్లాడటం, అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫారెస్టు అధికారులు వెనక్కు తగ్గారు.