రాష్ట్ర ప్రజలు సీఎం పేరెత్తడానికే ఇష్టపడట్లేేదు
తెలంగాణపై మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంత మంది వ్యక్తులు తమకు సరైన గుర్తింపు రావడం లేదని కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం అయిన తర్వాత కూడా యాక్టర్లు, యాంకర్ల నుంచి తెలంగాణ ప్రజల వరకు తన పేరెత్తడానికి ఇష్టపడటం లేదన్న ఆక్రోషంతోనే ప్రతిరోజు మాజీ సీఎంపై అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబి కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు దాటినా కనీసం ప్రస్తావించడం లేదన్నారు. జేమ్స్ బాండ్ల మాదిరి బాండ్ పేపర్లు రాసి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ సమస్యను 60 ఏండ్లల్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా తరాలకు తరాలనే అంగవైకల్యానికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రారంభించి మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌ను నల్లగొండనుంచి తరిమి కొట్టామన్నారు. జిల్లా రైతాంగం నీళ్ల కోసం వందల బోర్లు వేసి అష్టకష్టాలు పడే పరిస్థితి నుంచి పంట పొలాలకు సాగునీరు అందించేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
దేశానికే తలమానికంగా నిలబడే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని చరిత్రలో నిలిచిపోయేలా రూ.1,800 కోట్లతో అత్యద్భుతమైన పుణ్యక్షేత్రంగా తయారు చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువు కాటకాలతో ఇబ్బంది పడ్డ నల్లగొండ లాంటి జిల్లా అత్యధిక వరి ధాన్యం పండించే స్థాయికి వెళ్లిందంటే బీఆర్‌ఎస్ పరిపాలన ఫలితమేనన్నారు. అప్పు చేసిండు అని చెప్పే కాంగ్రెస్ నేతలు రెండేండ్లలో రేవంత్ రెడ్డి రూ.3.7 లక్షల కోట్ల అప్పు తీసుకువచ్చి ఇప్పటిదాకా ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టులకు, కమిషన్లకే ఖర్చు పెట్టారని మండిపడ్డారు. 2023 సాధారణ ఎన్నికలతో పోల్చితే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలం పెరిగిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో వచ్చిన స్కైరూట్ కంపెనీకి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు కమల్ హాసన్ ను మించిన నటులున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
స్వీయ గుర్తింపు కోసమే కేసీఆర్‌పై విమర్శలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



