Tuesday, April 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'రోజారాణి'ది పోరాడేతత్వం

‘రోజారాణి’ది పోరాడేతత్వం

- Advertisement -

దాని కోసమే ఆమె ఎక్కువ టైం కేటాయించారు : బీవీ రాఘవులు
కార్మికోద్యమానికి తీరని లోటు : డాక్టర్‌ కె హేమలత
అసమానతలు లేని సమాజం కోసం పనిచేసింది : జాన్‌వెస్లీ
అవినీతిపరులకు భయపడని ధీరత్వం ఆమెది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సీఐటీయూ ఆధ్వర్యంలో రోజారాణి సంతాప సభలో ఘననివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘రోజా రాణి తన వ్యక్తిగత జీవితావసరాల కంటే.. పోరాటాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించింది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు..దాని ఆధారంగా పది రూకలు ఎలా వెనుకేసుకోవాలి?అని ఆలోచించటం సహజమైంది. కానీ.. రోజా దానికి దూరంగా..నిటారుగా నిలబడింది. అవినీతి పరులకు కొరకరాని కొయ్యగా నిలిచింది. ఫలితంగా విధినిర్వహణలో పలు ఆటంకాలను ఎదుర్కొన్నది. అయినా రాజీపడలేదు. నికార్సు గా నిలబడింది. అందుకే ఆమె పురోగామి శక్తులకు ఆప్తురాలైంది. ఆదర్శవనితగా అందరి మనుసుల్లో చెరగని ముద్ర వేసింది’ అని పలువురు వక్తలు కొనియాడారు.
కార్మికోద్యమ నాయకురాలు సీహెచ్‌ రోజారాణి సంస్మరణ సభను సీఐటీయూ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు కె హేమలత, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాధం, ఎస్‌ వీరయ్య, ఎస్‌ పుణ్యవతి, ఎం సాయిబాబు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, తెలంగాణ, ఏపీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్‌, ఏవీ నాగేశ్వర్‌రావు, రాజ్య సభ మాజీ సభ్యులు పి మధు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ ఏపీ అధ్యక్షులు సీహెచ్‌ నర్సింగరావు, ప్రొఫెసర్‌ విద్యుల్లత తదితరులు రోజారాణి చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు.
బీవీ రాఘవులు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలోనూ, కార్మిక సంఘంలోనూ రోజా చురుకైన కార్యకర్తగా పనిచేశారని గుర్తు చేశారు. వ్యక్తిగత జీవితం కోసం కాకుండా సమాజం కోసం ఎక్కువ సమయం కేటాయిం చారని చెప్పారు. ఆమె వృత్తిలో తనదైన ముద్ర వేసుకున్నారని, ఇది తన వ్యక్తిత్వానికే కాకుండా రోజా లక్ష్యానికి విలువను పెంచిందని తెలిపారు. ఆమెది ఉదాత్తమైన లక్షణమని కొనియాడారు. రోజారాణి ఆలోచనలను ముందుకు తీసుకుపోవటమే ఆమెకు నిజమైన నివాళి అని చెప్పారు.

హేమలత మాట్లాడుతూ సీఐటీయూ నాయకురాలు నూర్జాహాన్‌ మరణం తర్వాత రోజారాణి మరణం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంపాయీస్‌ యూనియన్‌ను ఏర్పాటులో ఆమె కృషి మరవలేనిదని గుర్తు చేశారు. రోజాకు చిన్న వయస్సు నుంచే ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం ఉందని తెలిపారు. వృత్తి ఏదైనా నమ్మిన లక్ష్యం కోసం తనదైన పద్దతిలో పని చేశారని, ఇది ఆదర్శనీయమని చెప్పారు.
జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా..ప్రజల సమస్యల పట్ల స్పందించే గుణం ఉండటం హర్షించదగిం దన్నారు. ఆమె సమాజం మారాలని మనసారా కోరుకున్నారని చెప్పారు. స్త్రీ, పురుష అసమానతలు, కుల వ్యత్యాసాలు, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు పోవాలని తపించారనీ, అందుకనుగుణంగా తనకు చేతనైన పద్దతిలో పనిచేశారని గుర్తు చేశారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రోజా వృత్తిపరమైన సేవలను సమర్దవంతంగా అందించారని గుర్తు చేశారు. ప్రజలకు మేలు జరిగే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునేవారని తెలిపారు. ఆ సమయంలో ఎదురైన ఆటంకాలకు వెరవకుండా నిటారుగా నిలబడ్డారని కొనియాడారు. కార్మికోద్యమాన్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ నడిపించటం ఆమెకు ఆమే సాటని చెప్పారు.

బి వెంకట్‌ మాట్లాడుతూ రోజాది అరుదైన వ్యక్తిత్వమన్నారు. ఆమె గొప్ప మానవా తావాదని చెప్పారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా స్పందించే గుణం ఆమె సొంతమ న్నారు.రోజా మరణంతో తోబుట్టువును కోల్పాయననే బాధ వెంటాడుతున్నదని చెప్పారు.
సాయిబాబు మాట్లాడుతూ ఉద్యోగం, సంఘం, కుటుంబం మూడింటిని సమన్వయం చేస్తూ పని చేయటం ఆమె చైతన్యానికి నిదర్శనమన్నారు. ఏ సమయంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిన వ్యక్తి అని వివరించారు. కార్మికోద్యమానికి ఆమె లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు.
ప్రొఫెసర్‌ విద్యుల్లత మాట్లాడుతూ రోజారాణి సేవాదృక్పధం ఎంత చెప్పినా తక్కువేనన్నారు. మా అందరికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. విద్యార్థులకు, సహోద్యోగులకు ఆమె వృత్తిలో గొప్ప శ్రామికురాలని చెప్పారు. రోజా చెరగని ఆత్మ విశ్వాసం, చెరగని చిరునవ్వు అందరికీ ఆదర్శమన్నారు.
ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ కార్మికోద్య మంలో రోజారాణిది విలక్షణమైన పాత్రని చెప్పారు.కర్తవ్య నిర్వహణలో అలుపు లేకుండా ఆమె పని చేసేదని గుర్తు చేశారు. పలు ఆలోచనలు కలిగిన మనుషులకు సైతం ఆమె ఆదర్శమని కొనియాడారు.

జూలకంటి మాట్లాడుతూ మంచి వ్యక్తులు మధ్యలో చనిపోతే భరించలేని బాధ ఉంటుందన్నారు. రోజాకు ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలనే తపన ఉండేదన్నారు. పలు సార్లు వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో రోజా భర్త, సీఐటీయూ నేత జె వెంకటేశ్‌తో పాటు కుమార్తె డాక్టర్‌ ఆకాంక్ష, అల్లుడు డాక్టర్‌ హిమంత్‌, డాక్టర్‌ ఎం శ్రీనివాస్‌, డాక్టర్‌ వీరమ్మ, ప్రొఫెసర్‌ రఫత్‌రజియా, సంగారెడ్డి నర్సింగ్‌కాలేజి ప్రిన్స్‌పాల్‌ సుశీల, ప్రొఫెసర్‌ సంశాద్‌, సీహెచ్‌ నర్సింగరావు, పీఎస్‌ఎన్‌ మూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్‌ వెంకట్రాములు, సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, టీయూసీఐ కార్యదర్శి ఎస్‌ఎల్‌ పద్మ, ఏఐటీయూసీ అధ్యక్షులు వీఎస్‌ బోస్‌, హెచ్‌ఎంస్‌ కార్యదర్శి రెబ్బరామారావు, ఐఎన్‌టీయూసీ నాయకులు చంద్రశేఖర్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షలు భూపాల్‌, గాంధీ నర్సింగ్‌ కాలేజి ప్రిన్స్‌పాల్‌ హన్సీ, రాధేశ్యాం, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ నాయకులు వెంకట్రా మయ్య, ఐలు ప్రధాన కార్యదర్శి పార్దసారధి, పెన్సనర్ల సంఘం నాయకులు కృష్ణమూర్తి, సీఐటీయూ ఆఫీసు బేరర్సు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -