Monday, April 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండబుల్‌ గేమ్‌

డబుల్‌ గేమ్‌

- Advertisement -

శాంతి చర్చలంటూ అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు
లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటించినా.. ఆగని ఇజ్రాయిల్‌ దాడులు
దిగ్బంధనాలు, బెదిరింపులతో చర్చలు అసాధ్యం : అమెరికాతో ఒప్పందంపై ఇరాన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్‌ :
అమెరికా, ఇజ్రాయిల్‌ డబుల్‌గేమ్‌ ఆడుతున్నా యనే చర్చ నడుస్తోంది. ఓ వైపు శాంతి చర్చలంటూ దౌత్యం నడుపుతూ.. మరోవైపు అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకల్ని మెహరింపజేస్తోంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటించినా…ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో జనావాసాలపై విరుచుకుపడుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో శాంతిచర్చలపై అనిశ్చితి నెలకొన్నదని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక కామెంట్స్‌ చేశారు. అమెరికా విధిస్తున్న ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. శనివారం పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో పెజెష్కియాన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శాంతిచర్చలపై ఇరాన్‌ వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్‌ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన పాక్‌ ప్రధానితో చెప్పినట్లు ‘ప్రెస్‌ టీవీ’ నివేదిం చింది. ఏప్రిల్‌ 13 నుంచి ఇరాన్‌ ఓడరేవులను అమెరికా నౌకా దళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్‌ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరిం చడం అసాధ్యమని పేజెష్కియాన్‌ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షల ను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఏకాభిప్రాయం కుదిరినా..
ఇరాన్‌- అమెరికా మధ్య చాలా అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినా, కొన్ని విషయాలు మాత్రం ఒప్పందానికి అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. ముఖ్యం గా 20 ఏండ్ల పాటు యురేని యం శుద్ధిని నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్‌ను ఇరాన్‌ అంగీకరించాల్సిందేనని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. ఇదే అంశం పై విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధా లను తయారు చేయకూడదన్నదే తమ ఏకైక లక్ష్యమని ట్రంప్‌ వెల్లడించారు.

ఒమన్‌ నుంచి పాకిస్తాన్‌కు ఇరాన్‌ విదేశాంగమంత్రి
ఇస్లామాబాద్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్‌ వర్క్‌ను పాకిస్తాన్‌కు అందించామని తెలి పారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గ మని ఆయన చెప్పారు. అయితే, శాంతిచర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయ న చెప్పుకొచ్చారు. ఒమన్‌ లో జరిపిన దౌత్య పర మైన కార్యక్రమాల అనంతరం ఆదివారం సాయంత్రం ఇస్లామాబాద్‌కు తిరిగి వచ్చారని ఇరాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ (ఐఆర్‌ఐబీ) తెలిపింది. ఒమన్‌లో ఒకరోజు పర్య టన అనంతరం అరాఘ్చి రెండు రోజుల్లో పాకిస్తాన్‌ రాజధానిలో అరాఘ్చి పర్యటించడం ఇది రెండోసారి. పాకిస్తాన్‌లో తన సంక్షిప్త పర్యటనను ముగించు కుని ఆయన మాస్కోకు వెళ్తారని భావిస్తున్నారు. ఒమన్‌ నుంచి ఇస్లామాబాద్‌ శివార్లలోని పాకిస్తాన్‌ నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. రష్యాకు బయలుదేరే ముందు..ఇక్కడకు వచ్చినట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రతినిధుల ఇస్లామాబాద్‌ పర్యటనను రద్దు చేసినప్పటికీ, అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలను కొనసాగించే దౌత్య ప్రయత్నాలలో భాగంగానే అరఘ్చీ పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారని ప్రచారం జరుగుతోంది.

పాక్‌ పర్యటన రద్దు తర్వాత ఇరాన్‌ ప్రతిపాదనలు చేరాయి : ట్రంప్‌
ఇరాన్‌ తమకు కొత్త శాంతి ప్రతిపాదన పంపిందని, అయితే అది మరింత మెరుగ్గా ఉండాల్సిందని, అందుకే దానిని తిరస్కరిం చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ‘వారు మాకు ఓ పత్రాన్ని ఇచ్చారు. అయితే అది మరింత మెరుగ్గా ఉండా ల్సింది. ఆసక్తికరమైన విషయమేమంటే నేను అమెరికా ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌ పర్యటనను ర ద్దు చేసిన వెంటనే…పది నిమిషాలకే అమెరికా తాజాగా మరో పత్రం పంపింది. అది బాగుంది’ అని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ తిరిగి వస్తూ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో విలేకరులకు తెలిపారు. అయితే తాజా ప్రతిపాదనలో ఏముందో ఆయన వివరించలేదు. ‘వారు చాలా ప్రతిపాద నలను ముందుకు తెచ్చారు’ అని మాత్రం అన్నారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న తన షరతును ట్రంప్‌ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇరాన్‌ తమను టెలిఫోన్‌లో సంప్రదించవచ్చునని, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మాట్లాడవచ్చునని ట్రంప్‌ చెప్పారు.

మందుపాతరల కోసం గాలిస్తున్నాం
హార్ముజ్‌ జలసంధి నుంచి మందుపాతరలను తొలగించే పనిలో అమెరికా నౌకాదళం నిమగమైందని ట్రంప్‌ తెలిపారు. అయితే మందుపాతరలను తొలగించేందుకు ఆరు నెలల సమయం పట్టవచ్చునని పెంటగాన్‌ అధికారులు ప్రతినిధిసభ సభ్యులకు తెలియజేశారు. మందుపాతరల తొలగింపుకు ఎంత సమయం పడుతుందో సైన్యం అంచనా వేయబోదని రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ చెప్పారు. ‘అయితే మా సామర్ధ్యంపై విశ్వాసం ఉంది. సరైన సమయంలోనే మందుపాతరలను తొలగిస్తాం’ అని తెలిపారు.

గల్ఫ్‌ సరఫరాలకు తీవ్ర అంతరాయం.. సగానికి పైగా పడిపోయిన ముడి చమురు ఉత్పత్తి
గల్ఫ్‌ చమురు ఉత్పత్తిలో ఎదురవుతున్న అంతరాయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు తలెత్తడానికి ముందు ఉత్పత్తి అయి న ముడి చమురుతో పోలిస్తే రోజుకు సుమారు 14.5 మిలియన్‌ బ్యారల్స్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే ఘర్ష ణకు ముందు జరిగిన ఉత్పత్తిలో 57 శాతం పడిపో యిందన్న మాట. ముడి చమురు ఉత్పత్తి, రవాణాలో గల్ఫ్‌ ప్రాంతానికి…ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధికి ఉన్న ప్రాధా న్యతను ఈ గణాంకాలు చాటి చెబుతున్నాయి. ప్రపంచ ముడి చమురు రవాణాలో హార్ముజ్‌కు ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. హార్ముజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుంటే కొన్ని నెలల వ్యవధి లోనే పరిస్థితులు చక్కబడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగనప్పుడే ఇది సాధ్యపడుతుందని గుర్తు చేశారు.
పరిస్థితులు మెరుగుపడవచ్చు

రాన్‌ యుద్ధంలో చమురుకు సంబంధించిన మౌలిక సదు పాయాలు పెద్దగా దెబ్బతినలేదు. కార్యకలాపాలకు మాత్రమే అంతరాయం జరిగింది తప్ప నిర్మాణాలకు కాదని నిపుణులు తెలిపారు. అదీకాక సౌదీ అరేబియా, యూఏఈ వంటి ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలకు మిగులు సామర్ధ్యం ఉంది. కాబట్టి సరఫరాలను స్థిరంగా ఉంచేందుకు ఆ నిల్వలను వాడుకోవచ్చు. అనేక సంక్షోభ సమయాలలో ఈ దేశాలు కీలక చమురు ఉత్పత్తి దారులుగా చారిత్రక పాత్రపోషించాయి. తాత్కాలికంగా మూత పడిన చమురు బావులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకు రావచ్చు. చమురు బావులు శాశ్వతంగా మూతపడితే మాత్రం అది సాధ్యం కాదు. ఈ కారణాల వల్లనే ఆశించిన దాని కంటే పరిస్థితులు త్వరితగతిన మెరుగుపడే అవకాశం ఉంది.

అవరోధాలూ ఉన్నాయి
అయితే ఈ విషయంలో అనేక అవరోధాలు కూడా లేకపోలేదు. రవాణా అనేది అతి పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే చమురు నౌకలు కావాల్సినంతగా అందుబాటులో లేవు. గల్ఫ్‌లో ఖాళీ ట్యాంకర్ల సామర్ధ్యం యాభై శాతం పడిపో యిందని అంచనా. దీంతో ఎగుమతులు పరిమితమయ్యాయి. పైప్‌లైన్‌లో రద్దీ, ఇరుకైన ఓడరేవులు, నిల్వ పరిమితుల కారణంగా ముడి చమురు సరఫరాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉత్పత్తికి సంబంధించిన రిజర్వాయర్‌ ఒత్తిడి అంశాలు బావుల ఉత్పత్తిని పరిమితం చేయవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలం పాటు మూతపడిన బావులు తిరిగి పనిచేయాలంటే సాంకేతిక నిపుణుల సహకారం అవసరమవుతుంది.

శాంతిచర్చలు ఫోన్‌లో చేసుకోవచ్చు : ట్రంప్‌
అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్‌లో మాట్లాడుకోవచ్చని ట్రంప్‌ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ”అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్‌ చేయవచ్చు” అని ట్రంప్‌ అన్నారు, అయితే ఆ ఫోన్‌ కాల్‌ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.

హార్ముజ్‌ దిగ్బంధం ఎంతకాలం?
ఏదేమైనా హార్ముజ్‌ దిగ్బంధం ఎంతకాలం కొనసాగుతుందన్నదే కీలకం. జలసంధి దీర్ఘకాలం మూతపడితే పరిస్థితులు కుదుటపడడం కష్టమవుతుంది. మౌలిక సదుపాయాల సంసిద్ధత, సరఫరాలపై ప్రభావం పడుతుంది. ముడి చమురు ఉత్పత్తి మూడు నెలల కాలంలో 70 శాతానికి, ఆరు నెలల కాలంలో సుమారు 88 శాతానికి చేరుకోవచ్చునని అంచనా. ఉత్పత్తి పూర్తి స్థాయిలో పూర్వ స్థితికి రావడానికి మాత్రం చాలా కాలమే పడుతుంది.

ట్రంప్‌తో ఒప్పందానికి ఇరాన్‌ ఎందుకు ‘నో’ చెబుతోంది?
ట్రంప్‌ తో ఒప్పం దం కుదుర్చుకు నేందుకు ఇరాక్‌ నిరాకరిస్తుండడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒత్తిడి, బెదిరింపు, స్వాధీనాల నడుమ ఒప్పందం ఎలా సాధ్యపడుతుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రశ్నించారు. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో జరిపిన టెలి ఫోన్‌ సంభాషణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారని ఇరాన్‌కు చెందిన మెహర్‌ వార్తా సంస్థ తెలిపింది. చర్చలు జరుగుతున్నప్పుడు, కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పుడు.. ఈ రెండు సందర్భా ల్లోనూ అమెరికా ఉల్లంఘన లకు పాల్పడుతూనే ఉన్నదని, నిర్బంధా లకు తెగబడుతోందని పెజెష్కియాన్‌ ఆరోపించారు. ఇరాన్‌ ఓడరేవులపై నిషేధం విధించడమంటే కాల్పుల విరమణ అవగాహనకు తూట్లు పొడవడ మేనని ఆయన మండిపడ్డారు. అమెరికా ప్రవర్తన ఐరాస ఛార్టర్‌కు భిన్నంగా ఉన్నదని విమర్శించారు. ఇరాన్‌, అమెరికా మధ్య వివాదానికి కేంద్ర బిందువు లుగా ఉన్న అంశాలలో టెహ్రాన్‌ అణు కార్యక్రమం ఒకటి. అణు కార్యక్రమాలను ఇరాన్‌ నిలిపివేయాలని అమె రికా పట్టుబడుతోంది. అయితే ఏ ఆంక్షలైనా తాత్కాలి కంగానే ఉండా లని ఇరాన్‌ కోరుతోంది. ఇరాన్‌ శుద్ధి చేసిన 400కిలోల యురేనియంను తనకు అప్పగించాలని అమెరికా కోరుతుండగా ఇరాన్‌ అందుకు ససేమిరా అంటోంది. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసే వరకూ హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామని ఇరాన్‌ తేల్చి చెప్పింది. కాగా ఒప్పందం కుదిరే వరకూ నిర్బంధం కొనసాగు తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య అంతరం పెరుగుతోందే తప్ప తరగడం లేదు. ఆంక్షలను సడలించాలని, 20 బిలియన్‌ డాలర్ల ఆస్తుల స్తంభనను తొలగించాలని కూడా ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా జరిగిన నష్టానికి 270 బిలయన్‌ డాలర్ల పరిహారం అందించాలని కూడా కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -