Thursday, August 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకీవ్‌పై రష్యా భీకర దాడులు

కీవ్‌పై రష్యా భీకర దాడులు

- Advertisement -

పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం
17 మంది మృతి.. 44 మందికి గాయాలు

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం రాత్రి రష్యా సేనలు పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులు జరిపాయి. ఈ దాడులలో కనీసం 17 మంది మరణించగా 44 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు బుధవారం తెలిపారు. ఉక్రెయిన్ రాజధానిపై ఈ ఏడాది జరిగిన భీకర దాడులలో ఇది కూడా ఒకటి. ఈ దాడిలో పాతికకు పైగా బాలిస్టిక్, నౌకా విధ్వంసక క్షిపణులను, వందకు పైగా డ్రోన్లను రష్యా ప్రయోగించింది. రష్యా నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులలో దేనినీ అడ్డుకోలేకపోయామని, గగనతల రక్షణ వ్యవస్థల కొరతే దీనికి కారణమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ వ్యవస్థలు అందుబాటులో ఉంటే ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. భాగస్వామ్య దేశాల నుంచి బాలిస్టిక్ నిరోధక వ్యవస్థల సరఫరాలో జరుగుతున్న జాప్యం కారణంగానే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, విధ్వంసం కూడా భారీగానే జరుగుతోందని వివరించారు.

మంగళవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన దాడులలో కీవ్, దాని పరిసర ప్రాంతాలలో అనేక జనావాస భవనాలు, ఒక రైల్వే స్టేషన్, పలు గిడ్డంగులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అత్యవసర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ దాడులలో ఉక్రెయిన్ వైమానిక దళం 24 బాలిస్టిక్ క్షిపణులు, నాలుగు నౌకా విధ్వంసక క్షిపణులు, 115 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు 98 డ్రోన్లను అడ్డుకున్నాయి. అయితే బాలిస్టిక్ క్షిపణులను నిరోధించలేకపోయాయి. తమ దళాలు లాజిస్టిక్ హబ్‌లు, సరఫరా కేంద్రాలు, ఆయుధ నిల్వ స్థావరాలు, డ్రోన్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిందని రష్యా రక్షణ శాఖ తెలియజేసింది. నల్ల సముద్రం ఓడరేవు నగరమైన ఒడెసా సమీపంలో మూడు సరకు రవాణా నౌకలపై కూడా దాడి చేశామని చెప్పింది. శిథిలాల కింద కొంతమంది చిక్కుబడి ఉండవచ్చునని సహాయ సిబ్బంది అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -