మక్కాను లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణను తోసిపుచ్చిన హౌతీలు
సౌదీ ఎఫ్-15పై దాడి చేశామని వెల్లడి
రియాద్ : పవిత్ర మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి ప్రయత్నించారంటూ హౌతీలపై సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బుధవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను హౌతీలు తోసిపుచ్చుతూ ఇది వినడానికే తీవ్ర అసహ్యం కలిగించే పెద్ద అబద్ధమని మండిపడింది. సౌదీ ఆరోపణను ‘పాతపడిన అబద్ధంగా’ అభివర్ణించింది. హౌతీల డ్రోన్‌ను విజయవంతంగా కూల్చివేశామని సౌదీ అంతకుముందు తెలిపింది. కాగా మక్కా, మదీనా ప్రాంతాలపై దాడులు చేయాలన్న హౌతీల యోచనను ముస్లిం దేశాల కూటమి (ఓఐసీ) తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలాలు, మసీదులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం ఉగ్రవాదమేనని తెలిపింది. పౌరులను బెదిరిస్తూ, ప్రార్థనా స్థలాలు, మసీదుల పవిత్రతకు భంగం కలిగిస్తూ దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టడమే అవుతుందని హెచ్చరించింది. హౌతీల రాజకీయ బ్యూరో సభ్యుడు హిజమ్ అల్-అసాద్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్ పెడుతూ నేరచరిత్ర కలిగిన అల్ సాద్ పాలన అల్లే ఇలాంటి కట్టుకథలను, చెప్పే అబద్ధాలను ఎవరూ నమ్మబోరని తెలిపారు. సౌదీ చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలే తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. సౌదీకి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానంపై దాడి చేశామని తెలిపారు. కాగా మక్కాపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ పవిత్ర నగర చరిత్రలోనే తొలిసారిగా సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ప్రమాదం తొలగిపోయే వరకూ సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని, కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
జడ్డా, తైఫ్ గవర్నరేట్లలో కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ అయ్యాయి. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే వాటిని ఎత్తివేశారు.


