Thursday, September 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవీర తెలంగాణ సాయుధ పోరాటం మహోన్నతమైనది

వీర తెలంగాణ సాయుధ పోరాటం మహోన్నతమైనది

- Advertisement -

రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర చారిత్రాత్మకం
హిందూ, ముస్లిం పోరాటంగా రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ

బీజేపీ హయాంలో మహిళలకు రక్షణ లేదు : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల స్ఫూర్తి యాత్ర

నవతెలంగాణ-మోతె/ముదిగొండ
భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. నైజాం నవాబును గడగడలాడించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో మహోత్తరమైనదని, ముఖ్యంగా ఈ పోరాటంలో మహిళల పాత్ర చారిత్రాత్మకమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ వీర వనితల పోరాట స్ఫూర్తి యాత్ర బుధవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కొనసాగింది. చిట్యాల ఐలమ్మ స్వగ్రామమైన పాలకుర్తిలో ప్రారంభించిన యాత్ర.. సూర్యాపేట జిల్లా మోతె మండలానికి బుధవారం ఉదయం చేరుకుంది. అక్కడ జరిగిన సభలో వీరవనితలను పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఇండ్ల మల్సూరు స్మారక స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధి సాయుధ పోరాట పురిటి గడ్డ గోకినేపల్లి గ్రామానికి చేరుకుంది. తొలిత గ్రామ సమీపాన మధిర డివిజన్ ఐద్వా ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట వీరనారీమణులు చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వేషధారణతో, కోలాట బృందం, బతుకమ్మ పూలతో తెలంగాణ వీర వనితల స్ఫూర్తి యాత్ర జాత బృందానికి స్వాగతం పలికారు. అనంతరం అమరవీరుల స్థూపాల వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులు మచ్చా వీరయ్య, రావెళ్ళ సత్యం, యరమనేని వెంకటనరసయ్య స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధిర డివిజన్ ఐద్వా కార్యదర్శి పయ్యావుల ప్రభావతి తాను గీసిన ఆర్ట్ మెమొంటోను యాత్ర బృందానికి బహుకరించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో మల్లు లక్ష్మి మాట్లాడారు. నిజాం నవాబు, భూస్వామ్యుల దోపిడీకి వ్యతిరేకంగా ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. ఈ పోరాటంలో వేలాదిమంది ప్రజలు ప్రాణాలు త్యాగాలు చేశారని తెలిపారు. అనేక గ్రామాలు వెట్టి నుంచి విముక్తి చేసిన ఫలితంగా లక్షలాది ఎకరాలు పేదలకు పంపిణీ చేశారన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ధైర్య సాహసాలతో ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేశారని గుర్తు చేశారు. దళ సభ్యులుగా, కొరియర్లుగా, దళ కమండర్లుగా పని చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని చెప్పారు. అలాంటి సాయుధ పోరాట చరిత్రను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం దారుణమన్నారు. సాయుధ పోరాటంలో ముస్లింలు కూడా ప్రాణత్యాగం చేశారన్నారు.

మత భావజాలాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా వ్యాపింప చేస్తున్నారని అన్నారు. 12 ఏండ్ల బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ, భద్రత లేదని అన్నారు. నీట్ పేపర్ లీకేజీపై ఉద్యమించిన విద్యార్థుల పోరాటానికి తలవంచిన మోడీ.. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని పిలుపునిచ్చారు. మహిళా హక్కుల కోసం ఉద్యమించేది ఐద్వా మాత్రమేనని, మహిళలు ఐద్వాకు అండగా నిలిచి, ప్రజా వ్యతిరేక విధానాలపై జరుగుతున్న పోరాటాల్లో సంఘటితంగా, సమైక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆశాలత, బుగ్గవీటి సరళ, కోశాధికారి మాచర్ల భారతి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు మోహన్ని షా బేగం,శీలం కరుణ, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మద్దెల జ్యోతి, ఖమ్మం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మెరుగు రమణ, బండి పద్మ, మధిర డివిజన్ అధ్యక్షకార్యదర్శులు జొన్నలగడ్డ సునీత, పయ్యావుల ప్రభావతి, వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్, సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, ముదిగొండ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -