హద్దు దాటారు

హద్దు దాటారు– దీపావళికి బాణాసంచా పేలుళ్లు
– ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం
– డబ్ల్యూహెచ్‌ఓ లిమిట్‌ దాటి 30 రెట్లు అధికం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని గాలి కాలుష్య భూతం వదలటం లేదు. ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తెరగటం లేదు. దీపావళి పండుగ సందర్భంగా అన్ని రకాల బాణాసంచాను కాల్చటంపై నిషేధం ఉన్నా.. అవేమీ లెక్క చేయకుండా బ్యాన్‌ను ధిక్కరిస్తూ వాటిని కాల్చారు. ఇటు యంత్రాంగం కూడా కోర్టు ఆదేశాలను పటిష్టంగా అమలు చేయటంలో విఫలమైంది. ఫలితంగా ఆదివారం రాత్రి ఢిల్లీలో గాలి కాలుష్యం పడగ విప్పింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన పరిమితి కంటే 30 రెట్లు కాలుష్యం పెరిగింది. సోమవారం ఉదయం నాటికి ఇది మరీ దారుణంగా ఉన్నది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో డబ్ల్యూహెచ్‌ఓ లిమిట్‌కు 66 రెట్ల గాలి కాలుష్యం నమోదైంది. ఆ తర్వాత ఇది క్రమంగా దిగి వచ్చింది.
ఇక కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ప్రకారం.. సోమవారం ఉదయం పది గంటల నాటికి ఢిల్లీలో మొత్తం గాలి నాణ్యత ”చాలా పేలవం”గా ఉన్నది. దీపావళి తర్వాతే నగరం కాలుష్య పెరుగుదలను చూసింది. కేంద్ర ప్రభుత్వ గాలి నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం(నేడు), బుధవారాల్లో గాలి నాణ్యత ”తీవ్రం”గా ఉండే అవకాశం కనిపిస్తున్నది.

Spread the love