రింగ్ రోడ్డు పేరిట దగా రోడ్డు..

– అనుచరులకు దోచిపెట్టేందుకే ప్లాన్ 3
– ఉపసమహరించుకోకుంటే యుద్ధమే
– నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
– ప్రజాభిప్రాయ సేకరణ ఏది?
– చట్టంలోని నిబంధనలు కనిపించడం లేదా? సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి సలీం సూటి  ప్రశ్న 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ రింగ్ రోడ్డు భూ బాధితుల కు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో  నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాల వారు  కలెక్టర్ కార్యాల యంలో  కలెక్టర్ నారాయణ రెడ్డి కలుసుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి  ప్రభుత్వం తోనూ ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి   మీడియా తో మాట్లాడారు. ఇది రింగ్ రోడ్ కాదు దొంగ రోడ్ అని తమ అనుచరులకు దోచి పెట్టడానికి మంత్రి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. దాదాపు 3000  కుటుంబాలను తాము కష్టపడి చమటోడ్చి సంపా దించుకున్న ప్లాట్లు, ఇండ్లు, నష్ట పోతున్నా పట్టించు కోకుండా అధికారం ఉందనే అహంకారం తో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితుల గోడు పట్టించుకోవట్లేదని, అందరికి ఆమోద యోగ్యమైన  ప్లాన్ 1,2, వదిలేసి  తమ అనుచరుల లబ్ధి కోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని  ఆరోపించారు.  తక్షణం ప్లాన్ 3 ఉప సంహారించుకోవాలని, లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామని హెచ్చరించారు. ప్లాన్ మార్చుకునేందుకు పక్షం రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరిం చు కోకుంటే ఎంతమంది బాధితులున్నారో వారందరి తో కలిసి పాద యాత్ర చేస్తామని, ఆతర్వాత ఉత్త ర్వులు రద్దు చేసేవరకు దశల వారీ గా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి. సలీం మాట్లాడుతూ.. ఏదైనా రోడ్డు, ప్రాజెక్టు, ఇతరనిర్మాణాలు ఏవైనా చేపట్టేటప్పుడు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలి. ఇవి జరిపి పునరావాసం కల్పించిన తర్వాతే ప్రభుత్వం భూమిని తీసుకోవాలని పేర్కొన్నారు. కానీ అలా కాకుండానే, చట్టంలోని నిబంధనలు గాలికి వదిలేసి కబ్జాదారులు భూమిని కబ్జా చేసినట్లు రాత్రికి రాత్రే ప్లాట్లలో రాళ్లను పాతరని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని  పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటావని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆప్షన్ 1 ఎంచుకోవాలని  డిమాండ్ చేశారు. ఆప్షన్ 3 ద్వారా 27 80 ప్లాట్లు, సుమారు 200 మంది ఇండ్లు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ప్రజలకు నష్టం చేకూర్చే పని తలపెట్టవద్దని అన్నారు. ఇప్పటికైనా పాలకవర్గం, జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని లాభనష్టాలను బేరీజు వేసుకొని ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,కాంచనపల్లి రవీందర్ రావు,జమాల్ ఖాద్రి,కౌన్సిలర్ మారగోని గణేష్,మెరుగు గోపి,షంశుద్దీన్, గంజి రాజేందర్,వజ్జే శ్రీనివాస్,దొడ్డి రమేష్, సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love