దంచినమ్మకు బుక్కిందే కూలి

కొందరు యజమాని మెప్పు కోసం మస్తు పని చేస్తరు. చేయాల్సిందే కాని ఎక్కువ చేస్తరు. కొందరు నిదానంగ తమ పని తాము చేసికుంట పోతరు. ఎక్కువ పని చేసినట్టు కనపడేవాల్లను ‘ఎగిరెగిరి దంచినా గంతే కూలి, నిదానంగ దంచినా గంతే కూలి’ అంటరు. ఇక్కడ దంచుడు అంటే వడ్లు రోకటి కుండెనల పోసి దంచుడు అన్నట్టు. వడ్లు దంచేప్పుడు రెండు చేతులతో ఒక వరుసగా రోకలిని కుందనలో వేయాలి. కాని కొందరు వాళ్లు సైతం ఎగురుకుంట శ్రమపోసుకుంట వడ్లు దంచుతరు. పూర్వకాలంలో వడ్లు బియ్యంగా మార్చడమే దంచడం. అట్లనే కొందరు యజమానులు వడ్లు దంచే కూలీలకు పైసలు కూడా ఇవ్వరు. వెట్టి చేయించుకుంటరు. ఈ క్రమంలోనే ‘దంచినమ్మకు బుక్కిందే కూలి’ అంటరు. ఆమె వడ్లు దంచుతూ ఇన్ని నోట్లెపోసుకుంటదన్నట్టు. బత్తాయి కాయలు మావిడికాయలు తెంపబోయేకాడ, పల్లికాయలు తెంపేకాడ కూలీలు కామన్‌గ నోట్లెవేసికుంటరు. ఎవరు ఏమనరు. పైగా రైతులు ‘పంట పండాలె గని తింటె తరుగుతయా’ అంటరు. వ్యవసాయ పనుల కాడ కులీలకు ఆ మాత్రం తినే స్వేచ్ఛ వుంటది. పేదరికం, ఆకలి విపరీతంగ ఉన్నకాలంలో పుట్టిన సామెతలు ఇవి. అన్నం దొరకని కాలంలనే ఆకలి కాకుంట మందులు ఇస్తా అన్నదట. కొందరు అప్పుడే ‘నాకింత బువ్వ ఎయ్యి నీకు ఆకలి గాకుంట మందులిస్త’ అన్నరట. ఆకలి గాకుండ మందుతిన్నంక ఈయనకు బువ్వ ఎందుకు ఏసుడు అన్నదే ప్రశ్న. కొందరు పని చేస్తనే కన్వడుతరు కాని ఏ మాత్రం పైసలు కనపడవు. కొన్ని వృత్తులు అట్లనే ఉంటయి. పేరు ప్రఖ్యాతులు ఉంటయిగానీ ‘ఇంట్ల కుండలు కొట్లాడుతయి’ అంటరు. ఈ సందర్భంలోనే ‘దమ్మిడీ ఆదాయం లేదు గానీ క్షణం తీరిక లేదు’ అంటరు. ఇసొంటి వాల్లు ఎప్పుడు పని చేస్తనే వుంటరు గాని పని ఎదగదు. ఎట్లనంటే వీల్ల పని ‘సంకల బిడ్డను ఎత్తుకుని బిడ్డ కోసం ఊరంత లెంకినట్లు’ ఉంటది. పిల్ల సంగలనే వుంటది బిడ్డా బిడ్డా ఎక్కడ అంటే ఎట్లుంటది గట్లుంటది గట్లన్నట్టు. అదీ సామెతల సంగతి.
– అన్నవరం దేవేందర్‌
9440763479

Spread the love