నీలికళ్లు

ఆసుపత్రిలో అవుట్‌ పెషెంట్స్‌ హడావిడి తగ్గింది. ఒకసారి సిసి కెమేరాలో చూశాడు డాక్టర్‌ మూర్తి. ఇంకా ఇద్దరు వున్నారు. లంచ్‌ టైం కూడా దాటిపోయింది. ఇలా సమయం మీరిపోవడం ఎక్కువ సార్లే జరుగుతుంది. ‘ఈ ఇద్దరినీ చూడటం అయిపోతే…. అన్ని రూమ్సు లోకి ఒక రౌండ్‌ వేసి, లంచ్‌కి వెళ్లొచ్చు’ అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రం ఆరున్నరకు ఓపి.
అనుకున్నట్లుగానే వారిని పంపివేసి, ఒక గది తరువాత మరొకటి చూసుకుంటూ… చివరి గదిలోకి వచ్చాడు. అతని వెంట డ్యూటీ సిస్టర్‌ ఉంది. బెడ్‌కి కట్టి ఉన్న కేస్‌ షీట్‌ తీసుకుని చూడసాగాడు. ఇంతలో కాంపౌండర్‌ హడావుడిగా లోపలికి వచ్చాడు.
”సార్‌! కొత్త పేషంట్‌… తీసుకోమంటారా?” అంటూ..
”కేస్‌ ఏంటి” అడిగాడు.
”ఏమో సార్‌ మనిషి రొప్పుతోంది, నీరసంగా కూడా ఉన్నట్టుంది…..” బదులిచ్చాడు.
ఇతను కొత్తగా, ఈ మధ్యలోనే చేరాడు. అనుభవం తక్కువ.
”ఒకసారి జానీని వెళ్లి చూసి చెప్పమను” పురమాయించాడు మూర్తి.
కొన్నిసార్లు పోలీసు కేసు అయ్యే సందర్భాలు ఉంటాయి. పేషెంట్స్‌ని కాపాడటం కోసమని రిస్క్‌ తీసుకుంటే, పోలీస్‌ స్టేషన్‌ వెంట తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. జానీ మూడు నాలుగేళ్ల నుంచి ఇదే హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. అతనయితే వివరాలు తెలుసుకోగలడు. కావలసిన ఏర్పాట్లు చూసుకోగలడు.
”అలాగే సార్‌…” అతను వెళ్లిపోయాడు.
” సార్‌! పోలీసులకు రిపోర్ట్‌ చేసే కేసు కాదు. వాళ్లు మన వద్దకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళే… ఎమర్జెన్సీ రూమ్‌లో బెడ్‌ ఎలాట్‌ చేయమని రిసెప్షన్‌లో చెప్పాను” అంటూ జానీ వచ్చాడు.
”గుడ్‌, గుడ్‌, అలాగే కానీ.. అర్జెన్సీ ఉందా?” ఓ పేషెంట్‌ కేస్‌ షీట్‌ చూస్తూ అడిగాడు.
”ఫరవాలేదు సార్‌. కానీ… పేషంట్‌ పక్కన ఉన్న పెద్దావిడ హడావిడి చేస్తోంది” అంటుండగానే అరవై ఏళ్ల పెద్దావిడ రూంలోకి వేగంగా వచ్చింది. అక్కడే ఉన్న సిస్టర్‌, ఆమెను పేషెంట్‌ గదిలోకి రానిచ్చినందుకు డాక్టరు కోప్పడతారేమో అని భయపడుతూ… ఆమెని ఓ చేతితో పట్టుకొని వెనక్కి లాగుతోంది.
”అయ్యా… ఆ అమ్మి నా బిడ్డె. మిడిగుడ్లు వేసుకుని ఎట్లనో సూస్తంది. సిన్న సప్పుడు ఒస్తే ఓపదు, గింత ఎలుతురు ఓపదు. ఒకటే వళ్ళు నొప్పులంటాంది. పొద్దట్నుంచి కాలు సేయి కూడా బిగసకపోతున్నాయంట…” సిస్టర్‌ చేతిని విదిలించుకోడానికి ప్రయత్నిస్తూ, గబ గబా చెప్పింది.
ఆ లక్షణాలన్నీ వింటూనే మూర్తికి దాదాపు అర్ధమై పోయింది కేస్‌ గురించి. ఈవిడని కూడా చూసినట్లే అనిపిస్తోంది. అయినా ప్రతి రోజూ వచ్చే పేషెంట్లలో ఎందరినని గుర్తు పెట్టుకుంటాడు. అప్పటికీ అతనికి జ్ఞాపకశక్తి కాస్త ఎక్కువే.
చేతిలో ఉన్న కేస్‌ షీట్‌ని వదిలేసి ”వస్తున్నా అమ్మా!.. టెన్షన్‌ పడకు…” సముదాయిస్తూ సిస్టర్‌కు కొన్ని సూచనలు ఇచ్చి గదిలో నుండి బయటికి వచ్చాడు. ఎమర్జెన్సీ రూమ్‌ వైపుకు నడిచాడు.
డాక్టరుతో పాటు నడుస్తూనే ఆమె ఆదుర్దా నిండిన గొంతుతో మాట్లాడుతూనే ఉంది… అతను ఆమె చెప్పేది వింటూనే గదిలోకి వచ్చి నేరుగా పేషెంట్‌ వద్దకు వెళ్ళాడు.
ఆమె చేతినందుకొని పల్స్‌ చూస్తూ ”నీ పేరేమిటమ్మా?” అని అడిగాడు.
”సాయిత్రి… డాట్రు గారూ” గొంతు బలహీనంగా ఉంది, కానీ స్పష్టంగా ఉంది. పేరు వింటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న నీలి కళ్ళు, స్వచ్చంగా…. కానీ ఇప్పుడు ఆ కళ్ళలో చూపు, గాలి తాకిడికి అల్లాడుతున్న కొవ్వొత్తి మంటలా కదులుతోంది.
”ఇంతకు ముందు కూడా వచ్చినట్లున్నావ్‌… ఏమైంది?” అన్నాడు.
సావిత్రి బదులిచ్చే లోగానే ఆమె తల్లి ”రంగబాబూ, డాట్రు గారొచ్చారు.” అంటూ పెద్దగా కేకేసింది. అప్పటివరకూ రిసెప్షన్‌ రూంలో టీవీ ముందు కూచున్న రంగబాబు అది వింటూనే గబగబా గదిలోకి వచ్చాడు.
”నా అల్లుడు బాబూ..” ఆమె చెప్పింది.
అతన్ని చూస్తూనే గుర్తు పట్టాడు మూర్తి. ఓ పల్లెటూర్లో వైద్యం చేస్తుంటాడు అతను. కొంతకాలం కిందట అతను ఒకసారి మూర్తిని కలిశాడు కూడా. ఆ సందర్భంలోనే అతనంటే అయిష్టం కూడా ఏర్పడింది. అయిష్టం కలిగించిన వాళ్ళని, కోపం తెప్పించిన వాళ్ళనీ త్వరగా గుర్తిస్తుంది మనస్సు. అలా అని వాళ్ళతో శతృత్వం ఉండనక్కరలేదు.
అవసరమైన టెస్టులు మాత్రమే చేయించడం, అవసరమైన మందులు మాత్రమే రాసే పద్ధతి వల్ల, మిగిలిన ఆసుపత్రులతో అయ్యే ఖర్చుతో పోలిస్తే మూర్తి దగ్గర అయ్యే ట్రీట్మెంట్‌ ఖర్చు చెప్పుకోదగినంత తక్కువ.
భార్య ఆ స్థితిలో ఉంటే అతను అంత నింపాదిగా ఉండటం మూర్తికి కాస్త ఆశ్చర్య మనిపించింది. పైగా కాస్త వైద్యం కూడా తెలిసినవాడేనాయే!… అతని వైపు చూశాడు. అతని కళ్ళలో నిర్లక్ష్యం సింహాసనం వేసుకుని మరీ కూచుంది. ఇతనిలో ‘ఏదో తేడా ఉంది’ అనుకుంటుండగానే, వీరు క్రితం సారి ఎందుకు వచ్చారో మూర్తికి గుర్తు వచ్చింది.
రెండు నెలల కింద…. సాయంత్రంఏడూ, ఎనిమిది మధ్యలో…. ఇప్పుడొచ్చిన ముగ్గురే అప్పుడూ వచ్చారు.
ఆ రోజు కూడా ఓపీ తక్కువగా ఉంది. తన టేబుల్‌ పై ఉన్న ‘ది లాన్సెట్‌’ మేగజైన్‌ లో పేజీలు తిరగేస్తున్నాడు. మూర్తి.
తలుపు వద్ద చప్పుడైంది. నెమ్మదిగా తలుపు తెరచుకొని వస్తున్న వాళ్ళను చూస్తూనే, ”ఏమైందమ్మా……. అంటూ పేషెంట్‌ కూచోడానికి స్టూల్‌ ముందుకు జరిపాడు.
”ఇది నా కూతురయ్యా, సాయిత్రి. మాపటేల దీన్ని కుక్క కరిచింది….. పక్కన ఉన్న అమ్మాయిని స్టూలు మీద కూచోబెడుతూ చెప్పింది పెద్దావిడ.
”అవునా…. ఎక్కడా?…” అంటూ సావిత్రి వైపు చూశాడు.
నిండా పాతికేళ్ళుండవు. బక్క పలచటి మనిషి. చిన్న వయసుకే పెళ్లి చేశారు కాబోలు, బాధ్యతల బరువులు మొఖంలోనే కనపడుతున్నాయి. కానీ వాటికంటే.. ఆమెలో కొట్టొచ్చినట్టు కనపడేవి మెరిసే వెడల్పాటి కళ్ళు. నీలి కళ్ళు… స్వచ్ఛమైన తెలుపు మధ్యలో మిలమిలా మెరుస్తున్నాయి. ఆమె అమాయకత్వాన్ని చెప్పడానికి ఆ కళ్లను చూపిస్తే చాలు, మరేం రుజువులవసరం లేదు. అలసట నిండిన ఆ కళ్ళల్లో, గడ్డిపోచల మధ్యలో నిలువెత్తు మొక్కలా బతుకు పట్ల అశ… బయటికి తొంగి చూస్తోంది.
గాయం చూశాడు. బాగా లోతుగా దిగిన కుక్క కరిచిన గాట్లు…
కాంపౌండర్ని పిలిచి.. గాయాన్ని క్లీన్‌ చేయమని చెపుతూ…
”ఇంట్లో పెరిగే కుక్కేనా?..” అడిగాడు.
”మాకు కుక్క లేదు డాట్రు గారూ !” సావిత్రి బదులిచ్చింది.
”మీ ఇంట్లో అనే కాదు, ఎవరింటిలోనైనా… అంటే….. అదేనమ్మా… పెంపుడు కుక్కా? ఊర కుక్కా? .. అని” నవ్వుతూన్న మూర్తి వైపు, సావిత్రి అయోమయంగా చూసింది.
”పోనీ.. కరిచిన కుక్క ఎలా ఉంది? పిచ్చికుక్క మాదిరిగా ఉందా?”
”సరిగా సూడలేదు ..”
”పోనీ.. దాన్నేమన్నా అన్నావా? అనుకోకుండా కాలు తగలడమో.. తోక తొక్కడమో….”
మామూలు కుక్కలు వాటి జోలికి పోతేనే కరుస్తాయి. కానీ… పిచ్చికుక్క అయితే రెచ్చగొట్టకుండానే కనపడ్డ వారినల్లా కరుస్తుంది. జంతువుల్ని కూడా. తద్వారా వాటికి కూడా రేబీస్‌ సోకుతుంది. అదే పాలు ఇచ్చే పశువులయితే, పాలు కాగబెట్టుకొని వాడే అలవాటు వల్ల రేబీస్‌ వచ్చే ప్రమాదం తప్పిపోతుంది.
”గడ్డి తెద్దావని, గడ్డివాము దగ్గరకు వోయినా… మోపు ఎత్తుకొనొస్తుంటే.. అంతే… ఎక్కడ్నించి ఉరికొచ్చిందో? కాలట్టుకుంది” రంగబాబు వైపు భయంగా చూస్తూ… మాటల కోసం పదాలు పేర్చుకుంటోంది.
”పిచ్చి కుక్క గాదు. మంచి కుక్కే” అన్నాడు రంగబాబు జోక్యం చేసుకుంటూ.
”ఇంట్లో పది మోపులు తెచ్చి వెట్టించుకోయే అంటే యినదు… ఇంటికి అంత దూరంలో గడ్డి వాములెట్టుకుంటే ఇప్పుడు జూడు ఏవయిందో?” సావిత్రి తల్లి గట్టిగానే గొణుగుతోంది.
”యహే… ఆగండి… ఒకటే గోల..” అని రంగబాబు కసురుకుని డాక్టరుతో ఏదో చెప్పబోయాడు.
”కరిచినప్పుడు నువ్‌ అక్కడే ఉన్నావా?”
లేనన్నట్టు తలుపాడు అతను.
”కుక్క కరిచింది ఆమెని, వివరాలు నీకెలా తెలుస్తాయి? ఆమెని చెప్పనివ్వు. కుక్క కరిస్తే చేసే ఫస్ట్‌ ఎయిడ్‌ నీకు తెలియదా… అలాగే తీసుకొచ్చినవ్‌…. నువ్వు కాసేపు బయట ఉండు” మూర్తి గట్టిగా అన్నాడు.
అతను విసుక్కుంటూ వెళ్లిపోయాడు.
మొత్తం వివరాలు విన్నాడు. ”అమ్మా… కుక్క పిచ్చిదో మంచిదో తెలియకపోతే అంచనా వేయడం కష్టం. అది పిచ్చికుక్క అయితే మాత్రం మరీ ప్రమాదం. ఇప్పటికి ఇంజెక్షన్‌ చేస్తాను. తరువాత ఏం చేయాలో మీ ఆయనకు చెప్తాను” అని చెప్పి ప్రాథమిక చికిత్స చేసి పంపి, రంగబాబుని లోపలికి రమ్మని కబురు చేశాడు.
లోపలికి వచ్చిన అతన్ని చూస్తూ గోడకున్న గడియారం వైపు చూశాడు మూర్తి. ఎనిమిదిన్నర దాటింది. ప్రభుత్వాసుపత్రిలో డాక్టరు అందుబాటులో ఉండకపోవచ్చు అనుకుని…
”చూడు రంగబాబూ… నీకు తెలుసు కదా….” అనడానికి అన్నాడు కానీ మూర్తికే నమ్మకం లేదు.
‘కుక్క కరిచిందని తెలిశాక కూడా, కనీస ప్రాథమిక చికిత్స లేకుండా భార్యను తీసుకొచ్చాడు…. మరి ఊళ్లో ప్రాక్టీస్‌ ఎలా చేస్తున్నాడో… చేస్తే ఎంతమందిని ఆగం చేస్తున్నాడో” అనుకుంటూ… కొనసాగించాడు.
”కుక్క కరిస్తే మునుపటిలా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు వైద్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఒక ఇంజక్షన్‌ చేస్తాను కదా.. మళ్లీ మూడు రోజులకు ఒకటి, ఏడు రోజులకు ఒకటి, పద్నాలుగు రోజులకు ఒకటి చేయాలి. సావిత్రిని చూస్తే ఇమ్యూనిటీ తక్కువనిపిస్తోంది… కాబట్టి ఇరవై ఎనిమిది రోజులకు కూడా ఒక బూస్టర్‌ డోస్‌…. మొత్తం ఐదు ఇంజక్షన్లు చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం ఏమీ ఉండదు. ఇక్కడైతే ఖరీదు చేయాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వాసుపత్రిలో అయితే ఇంజెక్షన్స్‌ ఉచితంగా చేస్తారు.” అని వివరంగా చెప్పాడు.
”కుక్క మంచిదా? పిచ్చిదా? అనేదాని మీదా, అది శరీరంపై కరిచిన చోటు మీదా… ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. కుక్క మంచిది కాకపోతే రేబీస్‌ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకైనా మంచిది ఆ కుక్కను ట్రేస్‌ చేయండి. ఇంతకీ రేబీస్‌ అంటే తెలుసా.. ఇది ఒక వైరస్‌. రేబీస్‌ ఉన్న జంతువు యొక్క లాలాజలంలో ఉంటుంది. అక్కడ్నుండి అది మనలను కరిచినపుడు గాయం ద్వారా నరాల గుండా మనలోకి ప్రవేశిస్తుంది. తద్వారా మెదడులోకి చేరుతుంది. అక్కడికి చేరిన తరువాత వైరస్‌ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుంది. ఆ దశలో వచ్చే దాన్నే రేబిస్‌ అంటాం. గొంతు కండరాల అతి తీవ్ర సంకోచ వ్యాకోచాల కారణంగా హైడ్రో ఫోబియాతో పాటు, చాలా విపరీత లక్షణాలు వస్తాయి. దానికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు. పేషెంట్‌ చనిపోవడమే….. ఏమైనా వాక్సిన్‌ని, నిర్ణీత సమయం ప్రకారం తీసుకుంటేనే ప్రాణం నిలబడుతుంది” హెచ్చరించాడు.
ఆరెంపీ గా చేస్తున్నాడు కదా తెలిస్తే మంచిదని సాధ్యమైనంత వివరంగా చెప్పాడు.
డాక్టరు చెప్పిందానికి పెద్దగా ఆలోచించకుండానే స్పందించాడు…
”ఇప్పటిది మీరు చేయండి. తరువాతవి నేను నేను గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో చేయిస్తాను” అని రంగబాబు వెళ్లిపోయాడు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడిలా వచ్చారు.
జరిగిన విషయం అర్థమైంది మూర్తికి. రంగబాబు నిర్లక్ష్యంపై కోపం వస్తోంది… తెలిసి తెలిసీ ఒక ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టాడు. వస్తున్న కోపాన్ని అణచిపెట్టుకుని రంగబాబు వైపు చూశాడు.
”ఏం కాదు చెప్తున్నాగా… ఏడవకు” భార్యను, అత్తను గదమాయిస్తున్నాడు అతను. తల్లి కూతురి వైపు చూస్తోంది. సావిత్రి మూర్తి వైపు బేలగా చూస్తోంది.
ఆమె నీలికళ్ళు గదిలో పడుతున్న ఆ తక్కువ వెలుతురును కూడా భరించలేనట్టు వణుకుతున్నాయి.
”ఇంతకీ ఏమైంది? ఏవో రిమ్మలో… సొమ్మలో వచ్చినట్లున్నారు. అంతే గదా… డాక్టర్‌?” తాపీగా అంటున్నాడు రంగబాబు. మూర్తికి మండిపోయింది.
”సావిత్రికి అయిదు డోసులు ఇంజెక్షన్లు చేయించాలని చెప్పానా నీకు?” మూర్తి గట్టిగా అన్నాడు రంగబాబువైపు చూస్తూ.
”అ… అన్నారూ..”
”ఒకటి ఇక్కడ చేయించావు. మిగిలిన నాలుగు డోసులు తరువాత చేయిస్తానని అన్నావుగా… చేయించలేదా?”
”ఎందుకు చేయించలేదూ… చేయించానుగా! ఏమే.. ఆసుపత్రికి తీసుకుపోలేదా?” అంటూనే సమాధానం కోసం ఆగకుండా ”చేయించాను” ఇంకా నా పూచీ ఏమీ లేదనట్టు అన్నాడు.
”నాలుగు సార్లెప్పుడూ… ఒక్కసారే కదా వోయింది?” సావిత్రి, ఆమె తల్లి ఒకేసారి అన్నారు.
”హా.. మీరు మర్చిపోయుంటారు.. తీసుకెళ్లాను.” … అతని గొంతులో గట్టిదనం లేదు.
”ఇప్పుడయి సేయనందుకేనా యీ జబ్బొచ్చింది?” సావిత్రి తల్లి అడిగింది.
ఇక గుప్పిట మూయడం వల్ల లాభం లేదని అర్థమైంది మూర్తికి.
”అవుననిపిస్తోందమ్మా! కుక్క కరిస్తే రేబిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఇంకో మూడు ఇంజక్షన్లు చేస్తే ప్రమాదం తప్పి, ప్రాణాల మీదికి రాకపోయేది” నిస్సహాయంగా అన్నాడు.
”అంటే… నే.. సచ్చి పోతానా బాబూ?” సావిత్రి స్పష్టంగా అంది.
మనం చేయగలిగే చిన్నపనైనా కొన్ని సార్లు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఖచ్చితంగా చనిపోతారని తెలిసిన తరువాత కూడా… ఆ విషయాన్ని ఆ వ్యక్తికే చెప్పాల్సి రావడం అందులో ఒకటి.
అయినా ఎవరో బలవంతంగా తిప్పుతున్నట్టు తలాడించాడు మూర్తి.
అసందిగ్ధత తల ఊపడంలో ఉన్నా, అసలు విషయం మాత్రం సావిత్రికి అర్థమైంది. ఆమె తల్లికి కూడా. కూతురి స్థితికి ఆమె కళ్ళు నీటి కుండలవుతున్నాయి.
కానీ….. సావిత్రి కళ్ళు పొడి బారుతూ… ఎరుపుకి మారుతున్నాయి.
రంగబాబు వైపు చూపు నిలబెట్టి చూసింది.
అతను రెండడుగులు వెనక్కి వేసి డోర్‌ వైపు చూస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు.
”ఒరేరు..” గట్టిగా అంది సావిత్రి.
నరకాసురుడిని చంపేముందు సత్యభామ వేసిన కేక అలాగే ఉండి ఉంటుంది. ఆ గొంతులో కాఠిన్యానికి మూర్తి కూడా ఉలిక్కిపడ్డాడు.
”ఒరేరు నిన్నేరా…” భర్త వైపు చేయి చూపుతూ మళ్ళీ గట్టిగా పిలిచింది.
ఎన్నడూ తనవైపు కనీసం సూటిగా చూడటానికి భయపడే భార్య… ఒక్క పూర్తి వాక్యం అయినా ఎదురు మాట్లాడలేని అతివ…
నమ్మలేనట్లు చూస్తూ ఏదో అనడానికి నోరు తెరిచాడు రంగబాబు.
”ఏరు, నోర్ముయ్యరా కుక్కా… ఇట్టా రా …”.
సావిత్రిని ఎప్పుడూ అలా చూడని రంగబాబు చటుక్కున నోరు మూసుకొని ఆమె బెడ్‌ కి కాస్త దూరంలో నిలబడ్డాడు.
రంగబాబుకి లోపల లోపల భయంగా ఉంది. ‘అందరూ చస్తే దెయ్యం అవుతారంటారు. చూడబోతే ఇది బతికి ఉండగానే దెయ్యం అయిందా….’ అతని నోరు తడారి పోయింది.
”ఏరా! ఏ రోజైనా నిన్నిబ్బంది పెట్టిననా… తాగి తందనాలాడితే ఎదురు మాటన్ననా?… ఏ ఏళకొచ్చినా వండిపెట్టాను. ఊరంతా తిరిగి వైజ్జమే సేస్తన్నవో, బలాదూరే తిరుగుతున్నవో… పైగా నువ్వు డాక్టర్‌ గిరీ సేస్తన్నావ్‌ గా… గవర్నమెంటాసుపత్రిలో ఉత్తిగనే ఇచ్చే మందిప్పియ్యడానికేమి రోగం…” ఆయాసపడుతూ కాస్సేపు ఆగింది.
”పందిలాగా పక్కలో బొర్లి ఇద్దరు పిల్లల్ని పుట్టించినవ్‌. ఒక్క రూపాయి కొంపకు ఇవ్వకున్నా నా రెక్కలతో పిల్లలను, నిన్ను సాదినా. నువ్‌ సంపాదించినయి నీ బొందకే… నా దగ్గరున్నయి నీ బొందకే గొట్టుకున్నవ్‌. నీ సోకులూ, నీ తాగుడూ, నీ తిరుగుడే గానీ….. నే.. ఓ బట్టడగలే… ఓ నగడగలే.. అసలు నోరు తెరిచి నీ గురించి ఎవ్వరికీ జెప్పలే… కనీసం మా యమ్మకు కూడా చెప్పలే. .నీ నోట్ల పురుగులు వడ.. నీ తనువు నాశనం గాను.. నీ పాపాలే నన్నిట్ల తీస్క పోతున్నరు. నే బోతే నా పిల్లలేమైపోవాలే…..” సావిత్రి నోటి నుండి ఫిరంగి గుండ్లలాగా మాటలు వస్తున్నారు.
ఇన్నాళ్ల నుండి లోపల ఉన్నదంతా లావాలాగా బైటికి ప్రవహిస్తోంది. ఆ సెగ అక్కడున్నవారికి తగులుతోంది. రంగబాబు మొఖం పాలిపోయింది. అతని గుండె కొట్టుకోవడం అతనికే వినపడుతోంది. బయటకు వెళ్లబోయాడు.
”ఒరేరు.. బజార్జెంట తిరిగి తినేటోడా …ఆగు.. ఎటు బోతున్నవ్‌” సావిత్రి గద్దించింది. బయటికి పోతున్న వాడల్లా ఆగిపోయాడు. దించిన తల ఎత్తడం లేదు. రెండు కాళ్ళ మీద టన్నుల బరువున్నట్లు శిలలా…..
అంతే! అణిగి ఉన్న ఆడదాని దగ్గరే మగవాడి దాష్టీకం. అదే ఆడది ఎదిరిస్తే పిల్లిలా మారిపోతాడు. కాకపోతే ఆ పిల్లి లక్షణం, బూడిద పొయ్యిలో ముడుచుకునే కుక్క మాదిరే!-
”డాట్రు గారూ… ఇది నా పిల్లలకు… అంటుకుంటదా?” సావిత్రి వేగంగా ఊపిరి పీల్చుకుంటూ అడిగింది.
”లేదమ్మా లేదు… ఇది అలాంటి అంటు వ్యాధి కాదు. మనిషి నుండి మనిషికి అంటుకోదు….” కాస్త వివరంగా చెప్పబోయాడు మూర్తి.
”అలా అంటుకునేదున్నా బాగుండు. ఈడిని ఇప్పుడే నాశనం జేద్దును.” అని కాసేపు ఆగి…
”నేను ఇంటికెల్లి బోతానయ్యా…” అంటూ చేతులు జోడించింది.
రంగబాబు వైపు అసహ్యంగా చూస్తూ అంది. ”ఇంటికి వోదాం పా …”
ఇంటికి వెళ్ళగానే ”అమ్మా…” అంటూ ఇద్దరు పిల్లలు పరుగెత్తుకొచ్చారు.
ఇంటి వసారాలో వేసిన మంచంపై సావిత్రిని ఆమె తల్లి పడుకోబెట్టింది.
నోటి వెంట చొంగలు కారుతున్న కూతురిని చూస్తుంటే… ఆమెకు గొంతులో నుండి ఏడుపు తన్నుకొచ్చింది. మనవలను చూసి కష్టం మీద బిగపట్టుకుంది.
పిల్లలను ఎందుకైనా మంచిదన్నట్లు.. భారంత దూరంలోనే ఉంచింది సావిత్రి. ఆమెతల్లి మనవళ్లను ఒడిలో పొదుపుకుని నిట్రాడులా బిగిసుకుపోయి కూతురు వైపు చూస్తోంది.
సావిత్రి మాత్రం రెప్ప గొడితే మాయమైపోతారేమో అన్నట్లు పిల్లల వైపే చూడసాగింది. నీలికళ్ళ చల్లని చూపుని అతి కష్టం మీద నిలుపుతోంది. ‘నేను మాయమైనా నా చూపు మిమ్ములను కాపాడుతుంద’న్నట్లు…..
ఈ హడావుడికి చుట్టుపక్కల ఇళ్లవాళ్లు వచ్చారు. పేరు పేరునా వచ్చిన వాళ్ళను పలకరిస్తూ… చూపు పిల్లలపైనుండి పక్కకు తిప్పకుండానే అప్పగింతలు పెట్టసాగింది. అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళూ… గుండెలూ బరువెక్కాయి. పిల్లలు వెక్కివెక్కి ఏడుస్తున్నారు.
కళ్ల నుండి నీళ్ళు గారి రెప్పలపై బరువు తగ్గుతుంది…. మరి గుండెల్లో అంతకంతకూ పెరుగుతున్న బరువు..
అందరి చూపులు సావిత్రి వైపు, సావిత్రి చూపులు తన పిల్లల వైపూ… గంటా…రెండు గంటలూ….. సావిత్రి నీలి కళ్ళల్లో పిల్లలు నిలిచిపోయారు.
– ఆనాడు ఆ సావిత్రి భర్త ప్రాణాల కోసం యముని వెంటపడింది. కానీ ఉదాసీనతతో భర్తే సావిత్రి పాలిట యముడయ్యాడు.
బొందిలో ఉన్నంతసేపే ప్రాణం. అదే బయటికి వస్తే… అదీ గాలే! సావిత్రి ప్రాణం బయటి గాలిలో భాగమయింది. అందరూ ఒక్కసారే గొల్లుమన్నారు.
అప్పుడే… సరిగ్గా అప్పుడే… పెళ్ళు పెళ్ళుమన్న చప్పుడు… దానితో పాటు రంగబాబు నోట్లోనుండి అరుపు ఒక్కసారే కలగలిసిపోయి బయట పడ్డాయి. అందరూ ఆ చప్పుడు వైపు చూశారు. సావిత్రి తల్లి… ఆమె చేతిలో అతడి జుట్టు… పెనుగులాడుతున్నాడు.
అప్పటివరకూ సావిత్రిని ఏదో అద్భుతం కాపాడుతుందని అనుకుందేమో…. కానీ జరిగింది మనసుకు పట్టినాక ఆమెలోని తెగింపు బయటపడింది.
ఆమెతో పాటు అక్కడున్న వారు ఆ తెగింపుని ఆవాహనం చేసుకొని ఆ మృగం వైపుకు కదిలారు. విషయం తెలుసుకున్న మూర్తి గట్టిగా నిట్టూర్చాడు.
‘మొదటి సారి వచ్చినప్పుడే పరిణామాల గురించి నేరుగా సావిత్రికే చెప్పాల్సిందేమో…’ ఆవేశపడుతున్నప్పుడు వెడల్పుగా మారిన ఆమె నీలికళ్ళు, చుట్టూ ఎరుపు రంగూ… అతని కళ్ల ముందు కదలాడాయి.
– బాడిశ హన్మంతరావు, 9908486615 

Spread the love