యలమందమ్మపూలకోడి

యలమందమ్మ తన ఇంటి ముందు వేపచెట్టు క్రింద కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంది. ఆ వేపచెట్టు తన పెనిమిటి బతికున్నప్పుడు 30 ఏళ్ల క్రితం నాటింది. అది ఇప్పుడు మహావక్షమై ఎన్నో పక్షులకు ఆవాసమయ్యింది. అది అన్ని కాలాలలో చక్కని నీడనిస్తుంది. ఆమె భర్త వీరాస్వామి ప్రైవేట్‌ మేనేజ్మెంట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చనిపోయే నాటికి యలమందమ్మ వయసు 30 సంవత్సరాలు. భర్త మరణంతో కుటుంబభారమంతా ఆమె పై పడింది. కుటుంబం గడవడం కష్టమై తాను ఆరోజుల్లో చదివిన ఫోర్త్‌ ఫారం (ఇప్పుడు 9వ తరగతి) జ్ఞానంతో ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. అదే ఇప్పుడామెకు ప్రధాన జీవనాధారం అయ్యింది. ఊరంతా యలమందమ్మ హస్తవాసి మంచిదని ట్యూషన్‌ కు పంపేవారు. అలా ఆమె దగ్గర ట్యూషన్‌ చదివిన వారు ఆ తర్వాత మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎప్పుడూ 200 మంది పిల్లలకు తగ్గకుండా ఆమె దగ్గరకు ట్యూషన్‌ కు వెళ్తుండేవారు. భర్త ఉన్నప్పుడు సంపాదించిన ఎకరం పొలాన్ని ఆమె కౌలుకిచ్చింది. ట్యూషన్‌ డబ్బులు, కౌలు డబ్బుల్తో తన ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తెను పోషించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది. ఆ క్రమంలో 3 లక్షలు దాకా అప్పులయ్యాయి. కొడుకులు, కూతురు పెళ్ళిళ్ళైన తర్వాత వేర్వేరు ఊళ్ళల్లో కాపురాలుంటున్నారు. పెద్ద కొడుకు హరికృష్ణ పట్టణంలోని తాలూకా ఆఫీసులో గుమ్మస్తా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రాజేష్‌కు డిగ్రీ అయినా ఉద్యోగమెంతకీ రాక ఖాళీగా ఉంటే పెళ్లి చేస్తేనైనా ఏదో ఒక పనిలో స్థిరపడి బాధ్యతగా ఉంటాడని పెళ్లి చేసింది. అయినా రాజేష్‌ ఏ పనిలో నిలకడగా స్థిరపడలేదు. భార్య నవనీతం మిషన్‌ కుట్టి కుటుంబాన్ని పోషించేది. తన ఊరులో తెలిసిన వారి మధ్య మిషన్‌ వర్క్‌ బాగా సాగుతుందనే వంకతో రాజేష్‌ ను ఇల్లరికం తీసుకుని వెళ్ళింది. రాజేష్‌ ఏ పనీ చేయక ఖాళీగా ఉండటం వల్ల అత్తింటి వారందరికీ అలుసై పోయాడు. కూతురు హేమలతను ఓ గవర్నమెంట్‌ టీచర్‌కు ఇచ్చి పెళ్ళి చేసింది యలమందమ్మ. ప్రభుత్వోద్యోగిగా సంపాదన బాగున్నా ప్రతి పండుగకు అత్తారింటి కానుకలు, బహుమతులు ఆశిస్తూ యలమందమ్మ పై ఆర్థిక భారం వేసేవాడు అల్లుడు. కూతురు హేమలత కూడా తన భర్త కు తగ్గట్టే భర్త అడగనివి కూడా కావాలని తల్లిని అడిగేది. యల్లమందమ్మ మౌనం గా కూతురు అడిగినవన్నీ ఇచ్చేది.
ఏడు పదుల వయసులో ఆ మట్టి మిద్దెలో ఆమొక్కతే ఉంటుంది. నాల్రోజులు ఎడతెరిపి లేకుండా వాన కురిస్తే మిద్దె కారేది. అప్పుడామె గోనెపట్ట దోనె కప్పుకుని అంత జోరు వర్షంలో పల్లె కెళ్ళి సామేల్ను పిల్చుకొచ్చేది. సామేలు నిచ్చనేసుకుని మిద్దెక్కి పైన గూనకు అడ్డుపడ్డ మట్టిని తొలగించి మిద్దె మీద నీళ్ళు నిలబడకుండా మిద్దె పై మొలిచిన గడ్డిని పీకేవాడు. మిద్దె కారుతున్న చోట బంకమట్టి ముద్దను అతికించి పెట్టేవాడు. ఒక్కోసారి వర్షం ఎక్కువ స్థాయిలో ఉంటే మట్టి కరిగి మళ్ళీ కారడం మొదలయ్యేది. ఇల్లు వరదనీరుతో నిండకుండా కారేచోట గిన్నెలు, తపేలాలు పెట్టి అవి నిండగానే ఆమె నీళ్ళు బయట పారబోసేది.
సామేలు ”ఎందుకు పంతులమ్మ గారు మీరింకెన్నాళ్ళీ పాడుబడ్డ మట్టి మిద్దె లో ఉంటారు. మీ కొడుకులతో చెప్పి డాబా ఇల్లు కట్టించుకోవచ్చుగా” అనేవాడు.
దానికామె ”నేను అదే చెప్పాను సామేలు. ఎలాగూ నా తర్వాత వాళ్ళకు చెందాల్సిన ఆస్తే కదా. ఓ డాబా ఇల్లు కట్టుకోండ్రా అంటే వాళ్లు తర్వాత చూద్దాం లేమ్మా అని ఊరుకున్నారు. నేనైతే సొంత ఊరు మీద మమకారంతో ఊరొదలి వెళ్ళడం లేదు. కానీ.. ఈ కాలంవాళ్ళు పట్నం జీవితానికి అలవాటుపడి గ్రామాల్లో ఉండేందుకిష్టపడడం లేదు” అంటూ నిట్టూర్చింది.
కాలం మారే కొద్దీ పల్లెటూరి పిల్లలు పట్టణాలలో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ కు అలవాటు పడి యలమందమ్మ దగ్గరకు చాలా మంది ట్యూషన్‌కు రావడం మానేసారు. ఆమెకు జీవనం గడవడం చాలా కష్టంగానే ఉంది. ఆ రోజు ఆమె శేషగిరి కొట్టుకు సరుకులకు వెళ్ళింది. అక్కడ వడ్డీ వ్యాపారి కోటిరెడ్డి కనిపించి ”ఏం పంతులమ్మ గారు. నా బాకీ డబ్బు ఎప్పటికి తీరుస్తారు? ఎలా తీరుస్తారు. ఇప్పుడు ట్యూషన్‌ కూడా మూతపడేలా ఉందంట కదా. ఇన్నాళ్లు నా డబ్బులు ఎలాగోలా వస్తాయనే ధీమా ఉండేది. ఇప్పుడు అసలు వసూలౌతాయా? అనే సందేహం కలుగుతుంది. ఎందుకండీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. తీసుకున్నప్పుడు తిరిగి కట్టాలనే ఇంగితం ఉండాలి కదాండీ..” అనింకా ఏదో అనబోతుంటే అప్పుడే అక్కడికొచ్చి అంతా విన్న ఉదరు కిరణ్‌ ”ఏరు! కోటిరెడ్డి మాటలు జాగ్రత్తగా రానీరు..! ఆమెవరో తెలిసి కూడా బుద్ధి లేకుండా మాట్లాడతావేం? నీకు రావాల్సిన డబ్బులు నేనిస్తాను. దయచేసి పంతులమ్మ గారిని అడగకు” అని ఆవేశంగా అన్నాడు. ఉదరు కిరణ్‌ ఒకప్పుడు యలమందమ్మ దగ్గర చదువుకున్నాడు. ప్రస్తుతం బెంగుళూర్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆమె ఉదరుకిరణ్‌ను వారిస్తూ ”వద్దు. నీకెందుకు శ్రమ? నేనే బాకీ తీర్చుకుంటాలే నాయనా” అంది. దానికి ఉదరు కిరణ్‌ ”ఏం టీచర్‌ గారు? నేను మీ దగ్గర చదువుకునే ఇంతవాడినయ్యను కదా! నాకు మీ ఋణం తీర్చుకునే అర్హత లేదంటారా?” అని అడిగాడు.
దానికామె ”అది కాదు నాయనా! నా అవసరాలకు బాకీ చేసింది నేను. ఆ బాకీ నేను తీరిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు డబ్బిచ్చి నన్ను బిక్షగత్తెను చేయకు” అంది.
దానికెంతో బాధపడిన ఉదరు కిరణ్‌ ”అలాగే నండీ” అంటూ తలాడించాడు. ఉదరు కిరణ్‌ కోటిరెడ్డిని పక్కకు తీసుకెళ్ళి అతనితో ”చూసావా? టీచర్‌ గారు ఎంత అభిమానవంతురాలో. ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఇచ్చినప్పుడు డబ్బు తీసుకో. నీ వడ్డీ వ్యాపారమేదో గుట్టుగా చేసుకో. ఆమెను ఇబ్బంది పెట్టావంటే ఈ ఊళ్ళో నువ్వింక వ్యాపారం చేసుకోలేవు జాగ్రత్త. ఈ ఊళ్ళో నేనే కాదు, ఆమె శిష్యులు చాలామందే ఉన్నారు. ఆమెకేమైనా అయితే ఎవరూ చూస్తూ ఊరుకోం” అని అన్నాడు. దాంతో బెదిరి పోయిన కోటిరెడ్డి వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ”క్షమించండి పంతులమ్మ గారు. ఆ డబ్బు మీకు కుదిరినప్పుడు ఇవ్వండి. ఏం తొందరలేదు.” అన్నాడు. ”అలాగే నాయనా! ఋణశేషం అట్టే ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఇస్తాను” అందామె. కోటిరెడ్డి ఆమెకు నమస్కరించి వెళ్లాడు.
***
కొట్టు దగ్గర జరిగిన గొడవను ఆమె మరువలేకుంది. బాకీ తీరుస్తాననే మాటైతే అంది కానీ తీర్చే మార్గమేదో పాలుపోలేదు. ఆ ట్యూషన్‌ కూడా పది మంది పిల్లలతోనే నడుస్తుంది. ట్యూషన్‌ మీద బాకీ తీర్చడం కల్ల. చాలా సేపు ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చినామె పట్నంలో ఉండే పెద్ద కొడుకు హరికృష్ణ దగ్గరకు బయలు దేరి వెళ్ళింది. ఉత్తరం పత్రం లేకుండా ఉరుములా ఊడిపడ్డ తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు హరికృష్ణ. కోడలు సౌజన్య అయితే ఏకంగా షాక్‌ కు లోనయ్యింది.
భర్తను వంటగదిలోకి పిలిచి ”ఏంటంట మీ అమ్మ చెప్పాపెట్టకుండా వచ్చేసింది. కొంపదీసి పర్మినెంట్‌ గా ఇక్కడే ఉండిపోదుగా! ఆవిడకి సపర్యలు చేయడానికి నాకైతే ఓపిక లేదు బాబు” అంది.
”అబ్బే అమ్మ అందుకొచ్చుండదులే.. పిల్లలు గుర్తుకొచ్చుంటార్లే. రెండ్రోజులుండి తానే వెళ్తుంది. పర్మినెంట్‌ గా ఉంటానంటే నేను మాత్రం ఒప్పుకుంటానా ఏంటి? మనకు మాత్రం కుదరొద్దూ?” అన్నాడు హరికృష్ణ భార్యకు నచ్చజెప్తూ ..
”సరే ఎలాగూ వచ్చిందిగా ఆ పొలం సంగతడుగు. నీకు నీ తమ్ముడుకి ఎవరి అరెకరం వాళ్ళకి రాస్తే మన పార్ట్‌ వరకు మనం అమ్మేసుకుందాం. ఆ తర్వాత మళ్లీ కష్టం” అంది సౌజన్య. ”సరే ఇప్పుడేగా వచ్చింది అడుగుతాలే” అంటూ ఆగిపోయాడు హరికృష్ణ వంటగది వాకిట్లో తల్లిని చూసి.
అంతలోనే తేరుకుని ”ఆ.. అమ్మా ఏంటిలా వచ్చావ్‌? ఏమైనా కావాలా?” అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా వంట గదిలోకెళ్ళి రాగిబిందెలో నీళ్ళు గ్లాస్‌ తో ముంచుకుని తాగి మళ్ళీ హాల్లోకొచ్చి కూర్చుంది.
”ఏంటి? అమ్మ మనం మాట్లాడుకుంది విన్నదంటావా?” అడిగాడు హరికృష్ణ భార్యను.
”ఆమె వాలకం చూస్తే వినినట్లే ఉంది. వినుంటే మరీ మంచిది. మనం అడక్కుండానే పనై పోయినట్టే” అంది సౌజన్య.
”ఏమో .. బాధపడుతుందేమో” అనుకుంటూ తాను కూడా హాలులో తల్లి దగ్గరకెళ్ళి కూర్చున్నాడు హరికృష్ణ.
”అమ్మా ! మేమే నిన్ను ఒకటి అడుగుదామనుకుంటున్నాం ఇంతలో అనుకోకుండా నువ్వే వచ్చావు. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా” అన్నాడు హరికృష్ణ.
”ఏం లేదు పిల్లలని నిన్ను చూడాలనిపించి వచ్చాలేగాని ఏదో అడగాలన్నావు అడుగు” అందామె.
”ఏం లేదమ్మా పిల్లలు కాలేజీ స్టడీస్‌ కు చాలా ఖర్చవుతుంది. కొంత డబ్బు చేతిలో అవసరం. అందుకని మన పొలం అమ్మేస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుందని.. అంటూ తల్లిని చూస్తూ ఆగి.. లేకపోతే ఎవరి వాటా వారికి రాసినా చాలు. రేపు మంచి రేటు పలికిన రోజు అమ్ముకుంటాం” అన్నాడు.
దానికి యలమందమ్మ నవ్వి ”ఇది చెప్పడానికి ఇంత కష్టపడ్డావా? అది ఎలాగూ నా తర్వాత మీదే. ఇప్పుడు అవసరమై అమ్ముతామంటే అమ్ముకోండి. కానీ కుటుంబం కోసం నేను చేసిన అప్పు పీకలు మీదకొచ్చింది. ఆ అప్పు తీర్చి మిగతాదిద్దరూ పంచుకోండి” అంది. అమ్మ ఇంత తొందరగా ఒప్పుకోవడం హరికృష్ణకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
”అలాగేనమ్మా అలాగే చేద్దాం” అన్నాడు హరికృష్ణ.
”ఒకసారి రేపు చిన్నోడు దగ్గరకు కూడా వెళ్ళి విషయం చెప్తాను. అది సరే గానీ నీ దగ్గర డబ్బేమైనా ఉంటే సర్దరాదంట్రా? పొలం అమ్మే డబ్బులో మళ్లీ తీసేసుకొందువు గాని! ఆ కోటిరెడ్డి డబ్బు కోసం బాగా సతాయిస్తున్నాడు” అంది యలమందమ్మ.
”భలేదానివమ్మా ఆ డబ్బే ఉంటే ఇప్పుడు పొలం అమ్మే పనేంటి? అది లేకనే కదా!” అని అబద్దం ఆడాడు హరికృష్ణ వాస్తవానికి ఆ రోజు ఇంట్లో రెండు లక్షల దాకా డబ్బున్నప్పటికీ.
”సరేలే నాయనా! లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే ” అంటూ నిట్టూర్చింది యలమందమ్మ.
***
మర్నాడు ఆ ప్రక్క ఊర్లోని చిన్న కొడుకు రాజేష్‌ దగ్గరకెళ్ళిందామె. వెళ్ళేటప్పటికి రాజేష్‌ పెరటి బావిలో నీళ్ళు తోడి ఉతికిన బట్టలు నీళ్ళలో జాడిస్తున్నాడు. కొడుకు దుస్థితిని చూసి బాధపడి ”చూడ్రా నాన్న! నువ్వు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో పడి ఉంటే నీకు విలువ ఉండదు. కనీసం నువ్వు చిన్న బిజినెస్సైనా చేసి సంపాదించు. పైగా నువ్వు వియ్యపు వారి ఇంట్లో ఉంటున్నావు. చులకనౌతావు. ముందు నువ్వు వేరే అద్దె ఇంటికైనా మారు” అందామె.
”సరేనమ్మా సలహా బాగానే ఇచ్చావు. డబ్బులెక్కడ్నుంచొస్తాయి వాటికి? మా అత్తామామల్నెక్కడడిగేది?” అన్నాడు రాజేష్‌.
”ఒరేరు అసలైతే నాకు డబ్బవసరమయ్యే మీరైనా సాయం చేస్తారేమోనని వచ్చా. నీ పరిస్థితి చూడబోతే ఇలా ఉంది. ఏం చేస్తాను నువ్వు బాగుపడతానంటే ఇవిగో ఈ గాజులమ్మి వచ్చిన డబ్బుతో కూరగాయల కొట్టు పెట్టుకో” అంది యలమందమ్మ. సరేనంటూ ఆనందంతో గాజుల్ని తీసుకున్నాడు రాజేష్‌.
”అన్నట్లు ఒక విషయం. పెద్దోడు పొలం అమ్మేద్దామంటున్నాడు. వాటిల్లో నా అప్పులకు 3 లక్షలు ఉంచి మిగతావి మీ ఇద్దరూ పంచుకోండి” అందామె.
”సరేనమ్మా” అన్నాడు రాజేష్‌. ఆమె తిరిగి తన గ్రామానికి బయల్దేరి వెళ్ళిపోయింది.
****
యలమందమ్మ పొలాన్ని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసి కూతురు హేమలత తల్లి దగ్గరకొచ్చింది.
”అమ్మా మాకు చెప్పకుండా పొలాన్నెలా అమ్ముతావు. అన్నయ్యలిద్దరేనా నీ పిల్లలు నేను నీకు పుట్టలేదా? నీకు తెలుసో లేదో ఆడపిల్లలకు కూడా ఆస్తిపై సమాన హక్కులు ఉన్నాయి. పొలం అమ్మే మాటైతే అందులో ఒక వాటా డబ్బులు నాకివ్వాలి. లేకపోతే నేను కోర్టుకెళతాను” అని హెచ్చరించింది హేమలత.
”సరేనమ్మా . నాకందరూ సమానమే. అన్నయ్య వాళ్ళను ఒకసారి అడుగు” అంది యలమందమ్మ.
ఆ తర్వాత హేమలత తన అన్నయ్యల దగ్గరకెళ్ళి అడిగింది.
వాళ్ళు ”నీ పెళ్ళికి, కట్న కానుకలకు నీకు రావాల్సిన వాటాకంటే ఎక్కువే ఖర్చు పెట్టింది అమ్మ. ఇంక నీకు రావాల్సిన డబ్బులేవీ లేవు. అయినా మీ ఆయన గవర్నమెంట్‌ ఉద్యోగి. ఇంకా వేరే ఆస్తులు గురించి ఆశెందుకు?” అని అన్నారు.
హేమలత కోర్టులో కేసేసింది. ఆ కేసు వాయిదా మీద వాయిదా పడి 2 సంవత్సరాలు గడిచాయి. కోటిరెడ్డి కనిపించినప్పుడెల్లా యలమందమ్మకు చాలా చిన్నతనంగా ఉంటుంది.
***
దీపం బుడ్డిలోకి కిరోసిన్‌ అయిపోతే షావుకారు కొట్టుకెళ్ళి తెచ్చుకుంది యలమందమ్మ. చీకటి పడ్తూంది. పిచ్చుకలన్నీ చెట్లపైకి చేరి కిచకిచ అరుస్తున్నాయి. ట్యూషన్‌ పిల్లలు లాంతర్లు తెచ్చి వెలిగించి చక్కగా గోతం పట్లపై కూర్చుని చదవసాగారు. యల్లమందమ్మ ఆ పిల్లల్ని చూసి ”ఈ కొద్ది మందికి ట్యూషన్లు చెప్పి ఎప్పుడు సంపాదించి కోటిరెడ్డి బాకీ తీర్చాలి? పోనీ ట్యూషన్లు ఆపేసి వేరే పనేమైనా చూసుకోవాలన్నా మనసొప్పట్లేదు. మంచి విద్యార్ధులను తయారు చేసే ఒక గొప్ప పనికి స్వస్తి పలకాలంటే చాలా బాధగా ఉంది.
పైగా తనను అభిమానించే శిష్యులు తన మీద నమ్మకం తో వాళ్ళ పిల్లలను తన చేతుల్లో పెట్టారు. అందుకే ఎలాగైనా ట్యూషన్‌ మాత్రం ఆపకూడదు అనుకుంది యలమందమ్మ.
***
ఆ రోజు సాయంత్రం వేపచెట్టు క్రింద కూర్చుని బియ్యం ఏరుతున్న యలమందమ్మ ముందు దబ్‌ మని చప్పుడు తో చెట్టు మీదనుంచేదో ఆమె ముందు పడింది. తీరా చూస్తే అది కోడి పిల్ల. బిక్క చచ్చి పోయినట్లు కదలకుండా ఉంది. వెంటనే ఆమె చేటను పక్కన పెట్టి కోడిపిల్లను చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని చూసింది గుండె చప్పుడు వినిపించింది. అది స్పహ తప్పి పడిపోయిందని గ్రహించిన ఆమె తన రెండు అరచేతుల మధ్య దానిని ఉంచి నోటితో గాలి ఊదింది. కోడిపిల్ల లో కదలికొచ్చింది. మళ్ళీ ఇంకోసారి గట్టిగా గాలూది చిన్న గా కోడిపిల్లను నేలమీదకు వదిలింది. అది నిలబడేందుకు ప్రయత్నిస్తూ పడిపోయింది. ఆమె మళ్ళీ కోడిపిల్ల ను చేతిలోకి తీసుకుని పరిశీలించింది. ఒంటి నిండా గాయాలున్నాయి. కుడిరెక్క బాగా దెబ్బతింది.. ఒకసారి పైకి చూస్తే చెట్టు మీద రాకాసి గద్ద ఒకటి కనిపించింది. అది ఈ కోడిపిల్ల వైపే చూస్తుంది. ఆమెకు విషయం అర్ధమయ్యింది. ఆ గద్దే ఎక్కడ్నుంచో కోడిపిల్ల ను తెచ్చి చెట్టుకొమ్మ మీద పెట్టుకుని తినబోతుంటే కోడిపిల్ల కొమ్మ మీద నుంచి జారి కింద పడిందని.! వెంటనే ఆమె పక్కనే ఉన్న చిన్న గులకరాయిని చెట్టు మీద కి విసిరేసి రాకాసి గద్దను తోలింది.. ఇంటి లోపలికెళ్ళి డబ్బాలోని పసుపును కోడిపిల్ల గాయాలపై అద్దింది.
ఒక వారానికి కోడిపిల్ల గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయి. వారాలు గడిచే కొద్దీ కోడిపిల్ల పెరగసాగింది. దానికందమైన రంగురంగుల ఈకలొచ్చాయి. పూల పూల ఈకల్తో భలే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొన్ని నెలలు గడవగానే తెలిసింది. అది కోడి పెట్ట అని. అది చిన్న గా గుడ్లు పెట్టడం ప్రారంభించింది. 1, 2, 3, 4… ఇలా పెడుతూనే పోతుంది. ఇంక ఆపుతుందేమో అని అనుకుంటూ ఉండగానే 30 గుడ్లు దాకా పెట్టింది. యలమందమ్మ ఒక కుండ పెంకులో ఇసుక పోసి గుడ్లు అందులో పేర్చి పూలకోడిని గుడ్లు పై కూర్చోబెట్టి గుడ్లు పొదగేసింది.
21 ఒక్క రోజుల తర్వాత చూస్తే ఆశ్చర్యం. 25 పిల్లలు దాకా పొదిగింది పూలకోడి. పూలకోడి తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. గద్ద నుంచి తాను ప్రాణాపాయం తప్పించుకున్న అనుభవమేమో.! ఆ పూలకోడి గద్దల్ని, కాకుల్ని దగ్గరకు రానీయకుండా తరిమివేసేది. అలా 25 పిల్లలలో 23 పిల్లలు పెద్దవి కాగా 2 మాత్రం అనారోగ్యం కారణంగా చనిపోయాయి.
ఆ తర్వాత కొన్నాళ్లకు పూల కోడి మళ్ళీ గుడ్లు పెట్టి పొదిగింది. ఈసారి మరో 27 పిల్లలు. ఇలా అది గుడ్లు పెట్టడం, పొదగడం నిరంతర ప్రక్రియగా సాగుతోంది. వాటి పిల్లల్లోని పెట్టలు కూడా గుడ్లు పెట్టి పొదగడం ప్రారంభించాయి. ఒక సంవత్సరంన్నర కాలంలోనే కోళ్ళ సంఖ్య 200 కి చేరింది. వాటిలో కొన్ని పుంజులను అమ్మగా యాభైవేల దాకా ఆదాయం వచ్చింది. దానిని కోటిరెడ్డికి చెల్లించింది. మరో సంవత్సరంలో కోళ్ళ సంఖ్య 300కి చేరింది. యలమందమ్మ వాటికి వెదురుతో దడి కట్టించి ఓ గదిని ఏర్పాటు చేసింది. మరో సంవత్సరం కోళ్ళను అమ్మి లక్ష దాకా సంపాదించి కోటిరెడ్డి బాకీ కొంత తీర్చింది. ఆమెకు పూలకోడిని దేవుడే తన కష్టాలు తీర్చడానికి పంపాడనిపించింది. ఇంత గొప్ప సంతానం కలిగిన పూలకోడి కోర్కెలు తీర్చే కామధేనువులా ఆమె కళ్ళకు కనిపించింది.
***
పొలం కేసు కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. పొలం విషయంలో వచ్చిన మనస్పర్ధలతో తమ చెల్లి హేమలత తో హరికష్ణ, రాజేష్‌ మాట్లాడటం లేదు. ఇలా తన కడుపున పుట్టిన బిడ్డలు ఎవరిదారిన వాళ్ళు ఉండటం యలమందమ్మ జీర్ణించుకోలేక పోతుంది. అందుకే మాట్లాడాలని ఉత్తరం రాసి కొడుకులు, కూతుర్ని పిలిపించింది.
అమ్మ ఆస్తి విషయం ఏం చేస్తుందోనని అందరూ ఆతతగా వచ్చారు. మూలన చుట్టి ఉన్న సిరిచాపను పర్చుకుని కూర్చున్నారు.యలమందమ్మ ఇంట్లో నుంచి కట్టెలు పొయ్యి మీద తాను చేసుకొచ్చిన పాయసం గ్లాస్‌లు ఓ ప్లేట్‌లో పెట్టుకొచ్చి స్టూల్‌ మీద పెట్టింది. ”పిల్లలు… వాటిని తీసుకోండ్రా. ఓ చిన్న పనుంది ఇంతలో చేసుకుని వస్తాను. ”అంటూ ఇంట్లోకి నడిచింది.హరికృష్ణ, రాజేష్‌, హేమలత ముగ్గురు మూడు గ్లాసులు తీసుకో బోతుండగా సునీత వచ్చింది. సునీత రాజేష్‌తో కలిసి చదువుకుంది. యలమందమ్మ దగ్గర ట్యూషన్‌ చదివింది. అందువల్ల హరికృష్ణ, రాజేష్‌, హేమలత ముగ్గురికి చిన్న నాటి స్నేహితురాలే. అందరూ సునీతను చూసి చాలా సంతోషించారు. చాప మీద సర్దుకుని ఆమెను కూర్చోమని హేమలత ఇంట్లోకెళ్ళింది సునీతకు పాయసం తెచ్చిద్దామని. తీరా చూస్తే అమ్మ పాయసమంతా వారికే ఇచ్చినట్లు గ్రహించింది. వెంటనే ఖాళీ గ్లాస్‌ తెచ్చి వారి ముగ్గురు గ్లాసుల్లో నుంచి కొంత పాయసం ఖాళీ గ్లాస్‌లో పోసింది. గ్లాస్‌ నిండిపోయింది. పాయసం సునీతకు అందించింది. రుచి చూసిన సునీత ”పాయసం మహాద్భుతంగా ఉంది. అమ్మ ప్రేమ మారలేదు పాయసం రుచి మారలేదు. కానీ మధ్యలో మీ మనస్తత్వాలే మారాయెందుకు హేమలత?” అని సూటిగా ప్రశ్నించింది సునీత. దానికి ముగ్గురు మౌనంగా తలదించుకున్నారు.
”చూసారా? నాకు పాయసం లేదని మీ దగ్గర ఉన్న గ్లాసుల్లో నుంచి కొంత పోసి నా గ్లాస్‌ నింపిచ్చారు. అలాగే అనుకుంటే అమ్మ కష్టపడకుండా మీ ముగ్గురూ కలిసి జీవితాంతం అమ్మ ను పోషించవచ్చు” అంది సునీత. ఇంతలో యలమందమ్మ పూలకోడిని చంకలో పెట్టుకొనొచ్చి మడతకుర్చీలో కూర్చుంది. పూలకోడిని ఒడిలోకి తీసుకుని. ”చూడండి పిల్లలు… ఇది నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నాకిచ్చిన కానుక. దీని పుణ్యమా అని నేనిప్పటికి లక్షన్నర దాకా అప్పు తీర్చాను. మనం తీరిగ్గా రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు మీకు నేను భోజనం తయారు చేస్తాను. మీరు మనింట్లో ఉండి రేపు మీ ఇళ్ళకెళ్ళండి” అంది.
అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని ”సరేనమ్మా” అన్నారు. వారంతా సునీత ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి బయల్దేరారు. చాలా కాలమయ్యింది తమ సొంత ఊరు, స్నేహితులను చూసి. ఊర్లో నడుస్తూ ఒక్కో ప్రదేశాన్ని సమీపిస్తూంటే వారికి ఆ ప్రదేశంతో ఉన్న అనుబంధం ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. తాము హైస్కూల్‌ కెళ్ళేటప్పుడు ఈ దార్లోనే వెళ్ళేవారు.
”సునీత ఈ రచ్చబండ ఇంకా అప్పటిలాగే అంతే ఉంది. ఆ విశాలమైన అరుగెక్కి ఊడలమర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఊయలూగుతూ స్నేహితుల్తో గంటలతరబడి ముచ్చట్లాడుకున్న జ్ణాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇదిగో ఇక్కడే రామయ్య తాత కూర్చుని పిల్లలకు మిఠాయిలు పంచేవాడు” అన్నాడు హరికృష్ణ.
పీర్ల చావిడి, కరణం గారి బంగళా అన్ని దాటి ఇంకా ముందుకు నడుచుకుంటూ పోతున్నారు.
”కాళ్ళు లాగుతున్నాయి . ఇంకెంత దూరం సునీత?. ఇంక నేను నడవలేను” అంటూ అరుగు మీద కూర్చుంది హేమలత.
హరికృష్ణ, రాజేష్‌ చెల్లి పక్కన కూర్చున్నారు. హరికృష్ణ ”గుర్తుందా హేమ నువ్వు రోజూ స్కూల్‌ కెళ్తున్నప్పుడు ఇలాగే సగం దూరం వచ్చి కాళ్ళు నొప్పులంటూ మొండికేసేదానివి. అప్పుడు మా ఇద్దర్లో ఒకరు నీ బుక్స్‌ మోసుకుంటూ వస్తే ఇంకొకరు నిన్ను వీపు మీద ఉప్పు కట్టలా ఎక్కించుకొని మోసుకు వెళ్ళేవాళ్ళం” అని తన చెల్లెల్తో అన్నాడు.
”అవునన్నా గుర్తుంది!” అంది హేమలత.
”ఇప్పుడు మాత్రం మిమ్మల్నెవరు కాదన్నారు? మీ చిట్టి చెల్లిని మీ ఇద్దరూ ఎత్తుకుని మోసుకుంటూ రావొచ్చు కదా” అంది సునీత.
హరికృష్ణ, రాజేష్‌ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఒకరి చేతులొకరు పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చున్నారు.
” చెల్లీ, మా చేతుల మీద కూర్చో” అన్నారు ముక్తకంఠంతో.
”అయ్యో వద్దు అన్నయ్యలు.. కాసేపు రెస్ట్‌ తీసుకుంటే నేను మరలా నడవగలను. చిన్నప్పుడు అంటే బరువు తక్కువగా ఉండేదాన్ని కాబట్టి మోసారు. ఇప్పుడు నన్ను మోయడం చాలా కష్టం అంది” హేమలత తన అన్నయ్యలను వారిస్తూ.
”ప్రేమ తో మోసేది బాధ్యతే కానీ బరువు ఎప్పుడూ కాదు. రా చెల్లి కూర్చో” అన్నాడు హరికృష్ణ.
హేమలత మనసు చలించింది. తాను అన్నయ్యల చేతులపై కూర్చుని ఇద్దరి మెడ చుట్టూ చేతులు వేసింది. అన్నయ్యలు తనను మోస్తూ తీసుకెళ్తుంటే భావోద్వేగానికి లోనైన హేమలత కళ్ళ నుండి అప్రయత్నంగా ధారాపాతమై కన్నీరు కారి చెక్కిట నుంచి జారి అన్నల పాదాలపై పడ్తూ ఉంది.. తనను మన్నించమన్నట్లుగా.!
దార్లో ఓ పెద్దాయన ఎదురై ”ఏం హరికృష్ణ? ఎప్పుడొచ్చారు? అమ్మను చూడటానికి వచ్చారా?” అంటూ ప్రశ్నించాడు.
”ఆ .. అవును బాబారు” అన్నాడు హరికష్ణ.
”అమ్మ ఒక్కతే ఇక్కడ చాలా కష్టపడ్తుంది. అమ్మను కూడా మీతో తీసుకుని వెళ్ళండి” అని సలహా ఇచ్చాడు పెద్దాయన.
” ఆ.. అలాగే బాబారు” అన్నారు ముగ్గురు.
దారిలో ఓ అత్త తన కోడలికి ఆ అన్నా చెల్లెళ్ళను చూపిస్తూ ”చూసావా! ఆ అన్నా తమ్ముళ్లు తమ చెల్లిని ఎంత గారాబంగా చూసుకుంటున్నారో! అన్నా చెల్లెళ్ళంటే అలా అన్యోన్యంగా ఉండాలి” అంది. ఆ మాటలు హరికృష్ణ, రాజేష్‌లకు ముల్లుగా గుచ్చు కున్నాయి. రాజేష్‌ హేమలతతో ”చెల్లి నిన్ను చిన్నప్పుడు చూసుకున్నంత ప్రేమగా చూసుకోలేక పోయాం. మాకు పెళ్ళిళ్ళైన తర్వాత మాలో స్వార్థం ప్రవేశించి ఒక్కగానొక్క చెల్లివైన నిన్ను నిర్లక్ష్యం చేసాం.మమ్మల్ని క్షమించమ్మా” అన్నాడు.
దానికి హేమలత”’ అయ్యో .. అన్నయ్య మీరే నన్ను క్షమించాలి. మీరు చూపిన స్వచ్చమైన ప్రేమను మరిచి మీపై కేసు పెట్టి పొలాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. నేను ఇంటికి వెళ్ళగానే నా కేసు విత్‌ డ్రా చేసుకుంటాను” అంది.
”అది కాదమ్మా ఆ పొలం నువ్వే తీసుకో. నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి” అన్నారు హరికృష్ణ, రాజేష్‌లు తమ చెల్లెలితో. మాటల్లోనే సునీత ఇంటిని చేరుకున్నారు. అక్కడ సునీత తల్లిదండ్రులతో మాట్లాడారు. సునీత తల్లి విమల పంతులమ్మ గారి పూలకోడిని గురించి చెప్పింది. దాని సంతానంతో పెద్ద కోళ్ళ ఫారం ఏర్పడిందని, ఆ కోళ్ళను పెంచడం ఒక్కటే కొంచెం కష్టమైనా పంతులమ్మ గారు మాత్రం ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇంతలో చిన్న నాటి స్నేహితులంతా వీరితో చేరారు. వారంతా ఆ చల్లని వెన్నెల రాత్రి చంద్రవంక వాగు ఒడ్డున చేరి చిన్న నాటి మధుర జ్ణాపకాలన్నీ నెమరేసుకుని తిరిగి ఇళ్లకు వచ్చేశారు.
***
ఇంటికి చేరిన అన్నాచెల్లెళ్ల కు యలమందమ్మ తాను ఇష్టంగా వండిన పనస పొట్టు కూరతో భోజనం పెట్టింది. తల్లి చేతి భోజనం తిన్న అన్నా చెల్లెళ్ళు అరుగు పై కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇంతలో తల్లి యలమందమ్మ పూలకోడితో వచ్చి వారి మధ్య కూర్చుని వాళ్ళను దగ్గరకు తీసుకొని తల నిమురుతూ ”తోడబుట్టిన వారంతా అన్యోన్యతతో కలిసి జీవిస్తే ఆ గృహమే ఒక స్వర్గసీమ. నేను మీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాను. నాకు మీరందరూ సమానమే. నేను మీకు తెలియకుండానే పొలాన్ని బేరం కుదుర్చుకున్నాను. రోడ్డు మీద ఉన్నందువల్ల మన పొలాన్ని 30 లక్షలకు కొనేందుకు మన ఊరి హరనాధ్‌ చౌదరి ముందుకొచ్చాడు. హేమలతా నువ్వు కోర్టు కేసు వెనిక్కి తీసుకుంటే పొలం అమ్ముదాం. ఆ వచ్చిన డబ్బులను మీ ముగ్గురూ సమానంగా తీసుకోండి” అంది.
” అలాగే నమ్మా! ” అంది హేమలత.
”ఇంకో విషయం… నా తదనంతరం ఈ ఇల్లు కూడా మీ ముగ్గురికి చెందేలా వీలునామా రాసాను” అంది యలమందమ్మ.
”అమ్మా! నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు? మాతో ఉండమ్మా! నీ విలువ తెలియక మేము నిన్ను చాలా కష్టపెట్టాం. నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే ఎంతో కష్టపడి మాకు ఏలోటు లేకుండా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు జరిపించావు. మాకు గొప్ప జీవితాన్నిచ్చావు. ఈ వృద్ధాప్యం లో నీకు మేము సేవ చేసుకునే అదృష్టాన్నివ్వు. తన ప్రాణం కాపాడినందుకే మాటలు రాని ఈ పూలకోడి నీకు లక్షలు సంపాదించి పెట్టి నీ ఋణాన్ని తీర్చుకుంది. మరి మాకు జన్మనిచ్చిన నీకు కనీసం సేవలు చేసైనా ఋణం తీర్చుకునే భాగ్యం ఇవ్వమ్మా” అన్నారు ముగ్గురు తల్లి పాదాల మీద పడి రోదిస్తూ.
ఇంతలో కోటీరెడ్డి అక్కడ కు వచ్చాడు. ఆ.. కోటిరెడ్డి వచ్చావా నేనే కబురు చేద్దామనుకుంటున్నాను. ఇటురా ఇక్కడ కూర్చో. డబ్బు ఇస్తాను” అంటూ ”అమ్మా మొన్న కోళ్ళంన్నింటినీ అమ్మగా వచ్చిన డబ్బు భోషాణం పెట్టెలో పెట్టాను. తీసుకురా” అంటూ కూతురు హేమలతకు తాళం ఇచ్చింది. హేమలత పెట్టెలోని డబ్బు మూటను తీసుకుని వచ్చి తల్లికిచ్చింది.
”ఇదిగో నయ్యా కోటిరెడ్డి దీంతో నీ బాకీ అంతా తీరిపోయింది. ఆ నోటు పేపర్లు ఇలా ఇచ్చేయి” అంటూ డబ్బు మూట చేతిలో పెట్టింది. కోటిరెడ్డి డబ్బు లెక్క చూసుకుని నోట్‌ యలమందమ్మకు ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి అందరూ తమ చిన్న నాటి ముచ్చట్లు చెప్పుకుంటూ అమ్మ తో ఆనందంగా గడిపారు.
***
ఉదయాన్నే అందరూ తయారై బయల్దేదేరారు. వాళ్ళు అమ్మ ను తమతో రమ్మన్నారు. ”నేను పెరిగిన ఇల్లు, ఊరు.. ఇక్కడ మధుర జ్ఞాపకాలను వదిలిరాలేను” అంది యలమందమ్మ.
” కోళ్ళన్నీ అమ్మావు. ఎలాగమ్మా నీకు గడిచేది. ఈ డబ్బుంచు ” అంటూ డబ్బు ఇవ్వబోయారు. ఆమె సున్నితంగా తిరస్కరించి ”పిల్లలూ… నాకు డబ్బు అవసరం లేదు. కోళ్ళు అమ్మగా వచ్చిన డబ్బు ఇంకా కొంత ఉంది. అంటూ చిరునవ్వు నవ్వుతూ గంప కింద ఉన్న పూలకోడిని చేతిలోకి తీసుకుని అది అప్పుడే పెట్టిన గుడ్డును తాటాకు బుట్టలో దాచింది. ప్రేమగా పూల కోడి తలనిమిరి ముద్దాడుతూ చెప్పింది ”నా పూలకోడి ఉన్న చోటు సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుంది. నేను ప్రాణాలతో ఉన్నంత కాలం నా పూలకోడి నేను కలిసే ఉంటాం. మీరు నన్ను చూడాలనుకున్నప్పుడు మీ కుటుంబాలతో వచ్చి నాలుగు రోజులుండి పోండి” అంది యలమందమ్మ.
కొడుకులు, కూతురు భారమైన హృదయాలతో తల్లి వద్ద సెలవు తీసుకొని బయల్దేరారు. అప్పుడే వచ్చిన సునీత వారికి వీడ్కోలు పలికేందుకు బస్టాప్‌ వరకు తోడుగా వారితో కలిసి బయల్దేరింది.
ఇంతలో యల్లమందమ్మ ” పిల్లలూ ఆగండి” అనడంతో అందరూ ఆగి వెనక్కి చూసారు.
”మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినండి. నిజమైన ప్రేమలో బంధాలు ఎప్పుడూ బలహీనపడవు. మన ప్రేమలో స్వార్థం ప్రవేశించినప్పుడే బంధాలు బలహీనమౌతాయి.! మీలో స్వార్థం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. అప్పుడే మీ బంధాలు శాశ్వతమై నిలుస్తాయి” అంది రెండు చేతుల్తో దీవిస్తూ. అందరూ తడి నిండిన కళ్ళతో అమ్మకు చేతులెత్తి నమస్కరించి కదిలారు.
– భావ శ్రీ, 8106586997

Spread the love