– ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు, కార్యకర్తల సమక్షంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నూతన అధ్యక్షులు బోనగిరి భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు. ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా భారత దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణల పుణ్యమేనని పేర్కొన్నారు. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి,ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు అని చెప్పి, ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆధ్యుడిగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారన్నారు.
గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు , యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ పాలన ఆచరణీయమన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం అని, వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, డీసీసీ నాయకులు మురళి, తక్కురి దేవేందర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, బోనగిరి లక్ష్మణ్, కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్, కాంగ్ర పార్టీ నాయకులు బుచ్చి మల్లయ్య, అలకుంటా రాజేష్, వన్నెలా రాజేశ్వర్, నిమ్మ రాజేంద్రప్రసాద్, శివసరం గణేష్, సుమన్, మారుపక నరేష్, సుంకరి విజయ్, కౌడా శైలేందర్, అజర్, పాషా, తదితరులు పాల్గొన్నారు.



