జ్వరం, కామెర్లతో గిరిజనుడి మృతి

నవతెలంగాణ – ఆళ్ళపల్లి (గుండాల)
గత వారం రోజులుగా తీవ్ర జ్వరం, ఆ తర్వాత కామెర్లతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందిన సంఘటన గుండాల మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గుండాల మండల పరిధిలోని లింగగూడెం గ్రామానికి చెందిన కల్తి సోమయ్య (48) గత వారం రోజులుగా జ్వరంతో భాదపడుతుండగా స్థానిక ఆసుపత్రిలో చూపించారు. తగ్గకపోవడంతో నర్సంపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. జ్వరంతో పాటు కామెర్లు అయ్యాయని పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వారం క్రితం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్షలు చేయలేదని జ్వరం మామూలుగానే ఉందని ఆరోపించారు. ఈ విషయమై గుండాల వైద్యాధికారి మనీష్ రెడ్డిని వివరణ కోరగా.. మృతుడు ఆసుపత్రికి రాలేదని, ప్రయివేటు ఆసుపత్రిలో చేసిన టెస్టులను పరిశీలించగా మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడం వలన చనిపోయినట్లు గుర్తించామన్నారు.

Spread the love