ఓట్లు రాల్చే రుణ‌మాఫీ

Debt waiver by voting– రాజకీయ లబ్ది పొందిన ప్రభుత్వాలు
– వీపీ సింగ్‌ హయాంలోనే శ్రీకారం
– రైతుకే నష్టం అంటున్న మోడీ
– ఎంఎస్‌పీలకు చట్టబద్ధత పైనా మౌనం
– ముందుచూపుతో హామీ ఇచ్చిన రాహుల్‌
న్యూఢిల్లీ : హిందీ రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో అన్నదాతల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వారికి అతి ముఖ్యమైన హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. దేశంలో చిట్టచివరిసారిగా 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.60,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ రూపంలో రైతుల రుణాలు రద్దు చేసింది. ఆ తర్వాతి సంవత్సరమే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. యూపీఏ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. హార్యానాలో ఈ నెల 22న జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ రైతు రుణాలు మాఫీ చేస్తామని, పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పీ) చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రుణ మాఫీపై అధ్యయనం చేసి సిఫార్సులు అందజేసేందుకు వీలుగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానితో పాటు తక్షణమే రుణ మాఫీ జరుగుతుందని కూడా తెలిపారు. రుణ మాఫీలు చేస్తే నష్టపోయేది రైతులేనని మోడీ చెబుతున్నారని గుర్తు చేశారు. రుణాలు రద్దు చేయాలని, ఎంఎస్‌పీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు వివిధ రాష్ట్రాల్లో…ముఖ్యంగా రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఫిబ్రవరి నుండి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2022 నాటికి దేశంలోని రైతులపై రూ.18.5 లక్షల కోట్ల మేర రుణ భారం పడింది.
రుణాలు ఎందుకు ఇస్తారు?
వ్యవసాయం లేదా దాని అనుబంధ కార్యకలాపాల నిమిత్తం షెడ్యూల్డ్‌ బ్యాంకులు రైతులు, రైతు సమూహాలకు రుణాలు అందిస్తుంటాయి. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంటల కోసం స్వల్పకాలిక రుణాలు (18 నెలల వరకు) ఇస్తాయి. వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలు, నీటిపారుదల-ఇతర అభివృద్ధి కార్యకలాపాల కోసం మధ్యకాలిక (18 నెలల నుండి ఐదు సంవత్సరాల వరకు), దీర్ఘకాలిక (ఐదు సంవత్సరాల పైబడి) రుణాలు అందిస్తాయి. పంట కోతకు ముందు, కోతల తర్వాత చేసే పనుల కోసం కూడా రుణాలు ఇస్తారు. ఈ రుణాలను చాలా వరకూ వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణాల స్వభావం, రుణాలు ఇచ్చే బ్యాంకును బట్టి వడ్డీరేటులో వ్యత్యాసాలు ఉంటాయి.
రుణ మాఫీని ఎందుకు అడుగుతారు?
అప్పుల ఊబిలో కూరుకుపోవడం వల్లనే రైతులు రుణ మాఫీలు కోరతారని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. భూ వివాదాలు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, భూమిలో సారం తగ్గిపోవడం, పెట్టుబడి వ్యయం పెరగడం…ఇవన్నీ రైతును చుట్టుముడుతున్న సమస్యలే. పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులపై రుణభారం పెరుగుతోంది. వ్యవసాయ ఖర్చులు పెరగడంతో అన్నదాత అప్పులు చేయక తప్పడం లేదు. అయితే ఈ రుణాలు బ్యాంకులు మాత్రమే ఇవ్వడం లేదు. చిన్నపాటి రైతులు బ్యాంకుల నుండి రుణాలు పొందలేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అందుకే అన్నదాతలు రుణ మాఫీని కోరుకుంటారు.
మాఫీ అనివార్యమా?
అయితే రుణ మాఫీ అనేది అప్పుల భారానికి దీర్ఘకాలిక పరిష్కారం కాదు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపడితే రైతులకు ఈ తిప్పలు ఉండవు. కానీ రుణ మాఫీ అనేది అనివార్యమని కొందరు నిపుణుల వాదన. ‘జ్వరం వస్తే పారాసిటమాల్‌ ఇవ్వక తప్పదు. కాకపోతే మరోసారి జ్వరం రాకుండా చూసుకోవాలి. రుణ మాఫీ కూడా అంతే. తరచుగా ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల రుణ మాఫీలు
రైతులు పదే పదే డిమాండ్‌ చేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం మాత్రం రైతు రుణ మాఫీపై ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అంటూ తప్పించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు 2014లో, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర 2017లో, కర్నాటక, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ 2018లో, చివరగా జార్ఖండ్‌, మహారాష్ట్ర (మరోసారి) 2020లో రైతు రుణ మాఫీలు అమలు చేశాయి. ఈ రాష్ట్రాలన్నీ కలిపి రూ.2.52 లక్షల కోట్ల మేర రుణాలు రద్దు చేశాయి. 2021 ఫిబ్రవరిలో తమిళనాడులో అన్నా డీఎంకే ప్రభుత్వం అతి పెద్ద రుణ మాఫీని ప్రకటించింది. ఆ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దానికి ముందు ప్రభుత్వం రూ.12,110 కోట్ల పథకాన్ని ప్రకటించింది. రైతుల స్వల్ప కాలిక రుణ బకాయిలన్నీ రద్దు చేస్తున్నామని నాటి ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. 2016లో కూడా 12.02 లక్షల మంది రైతుల స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలను అన్నా డీఎంకే ప్రభుత్వం రద్దు చేసింది.
పాన్‌-ఇండియా మాఫీలు
దేశంలో తొలిసారిగా 1990-91 బడ్జెట్‌లో వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం పాన్‌-ఇండియా రుణ మాఫీ ప్రకటించింది. అందుకోసం వ్యవసాయ, గ్రామీణ రుణ సహాయ పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయితే ఈ పథకం 1991 మార్చి 31న ముగిసింది. ఆ తర్వాత దానిని నవీకరించలేదు. 2008-09 బడ్జెట్‌ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పాన్‌-ఇండియా రుణ మాఫీని ప్రకటించారు. రుణ మాఫీ కారణంగా సింగ్‌ ప్రభుత్వంపై రూ.7,825 కోట్ల భారం పడగా 3.2 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై రూ.52,000 కోట్ల భారం పడగా 2.9 కోట్ల మంది అన్నదాతలు లబ్ది పొందారు.
ప్రత్యామ్నాయాలు అవసరం
2014-22 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిది సార్లు రుణ మాఫీలు ప్రకటించాయి. అయితే కేవలం సగం మంది లబ్దిదారుల రుణాలు మాత్రమే రద్దయ్యాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా రైతు రుణ మాఫీలు ప్రకటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో అన్నదాతలకు ఊరట కలిగించలేకపోయాయి. రుణ మాఫీకి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ నిపుణులు పలు చర్యలను సూచిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, అన్నదాతలకు విద్యుత్‌, నీటిపారుదల, విత్తనాలు, ఎరువులు, పరిశోధనలు, విస్తరణ సేవలు వంటి పలు సౌకర్యాలు సమకూర్చాలని వారు కోరారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని, దీర్ఘకాలిక విధానాలు రూపొందించాలని సూచించారు.
ఎన్నికలకు ముందు ప్రకటనలు
1987 నుండి 2020 వరకూ ఎలాంటి అభివృద్ధి అజెండా, భావజాలం లేకుండానే రుణ మాఫీలు జరిగాయి. మాఫీలకు, కరువు తీవ్రతకు సంబంధం కూడా లేదు. 2016 వరకూ రాష్ట్ర ప్రభుత్వాలే రుణ మాఫీలు ప్రకటించాయి. ఆర్థిక భారాన్ని కూడా అవే భరించాయి.2016 తర్వాత రుణభారం అధికంగా ఉండడంతో అలంటి ప్రకటనలేవీ వెలువడలేదు. ఈ మధ్యకాలంలో ప్రకటనలు వెలువడిన సమయాలు కూడా కీలకంగా మారాయి.
ఈ తరహా ప్రకటనలన్నీ ఎన్నికలకు ముందు జరిగినవే. అవి అధికారంలో ఉన్న పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయి. ఎన్నికలకు ముందు రుణ మాఫీలు ప్రకటించిన 21 రాష్ట్ర ప్రభుత్వాల్లో కేవలం నాలుగు మాత్రమే ఓటమి పొందడం గమనార్హం.
ప్రభుత్వాల జోక్యం ఎప్పుడు?
వాయిదాలు సకాలంలో చెల్లిస్తే అటు బ్యాంకులు, ఇటు రైతులు ప్రయోజనం పొందుతారు. అయితే రుతుపవనాలు అనుకూలించకపోవడం, ప్రకృతి విపత్తుల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించడం సాధ్యంకాకపోవచ్చు. కాలం గడిచేకొద్దీ రుణభారం పెరుగుతూ ఉంటుంది.
మధ్యలో పంట నష్టపోయినా, ఇతర రకాల సమస్యలు ఎదురైనా పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయి. రుణాలను రీషెడ్యుల్‌ చేయడమో లేదా పూర్తిగా మాఫీ చేయడమో చేస్తాయి. బ్యాంకులకు చెల్లింపులు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే పడుతుంది.
మాఫీలు సాధారణంగా రుణాల స్వభావంపై ఆధారపడి ఉంటాయి. రుణం ఏ తరహాకు చెందినది (స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక), రైతులు ఏ తరగతికి చెందిన వారు, రుణ వనరు ఏమిటి వంటి అంశాలపై ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కొత్త పథకాన్ని ప్రకటించడం, బడ్జెటరీ మద్దతు కల్పించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వాలు రుణ మాఫీ చేస్తాయి.

Spread the love