ప్రజాస్వామ్యమంటే అప్పుడు గుర్తుకు రాలేదా?

– కేటీఆర్‌కు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రజాస్వామ్యం, అన్యాయం, అక్రమం అనే పదాలు…అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా? అంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్‌ మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ ఠాగూర్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే తలసానిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేసినప్పుడు కేసీఆర్‌ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. 2019లో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఎటు పోయాయని నిలదీశారు. పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో వీడ్కోలు పార్టీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని వివరించారు. బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఆ నలుగురు మాత్రమేనన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వివాదం తమ పార్టీ అంతర్గత విషయమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు సముచిత గౌరవం ఇస్తారని చెప్పారు.

Spread the love