పేదల ఇండ్లు కూల్చివేత

– గతంలో స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు

– ప్రజా ప్రతినిధుల సహకారంతో కబ్జాలోకి బాధితులు
– గ్రామం నలువైపులా చుట్టుముట్టిన పోలీసు బలగాలు
నవతెలంగాణ –  ఝరాసంగం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గోయి, బర్దిపూర్, చిలేపల్లి, గ్రామంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదకమండలి (నిమ్జ్) ప్రాజెక్టు కోసం అధికారులు భూసేకరణ చేపట్టారు. అయితే కేవలం ఎల్గోయి గ్రామంలోనే దాదాపు మూడు వేల ఎకరాల భూమిని ప్రాజెక్టు కింద ఆ గ్రామస్తులు కోల్పోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద కోల్పోయిన తమకు ఒక ఉద్యోగం, ప్లాట్లు కేటాయించాలని గతంలో అధికారులను కోరారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గ్రామంలో నెలకొల్పిన 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు కు సైతం భూములు కోల్పోయిన తమకు ఇంటి నిర్మాణాలు, సామూహిక భవనాలు, గ్రామంలో లైబ్రరీ లాంటి అవసరాలకు భూమిని కేటాయించాలని విన్నవించారు. అందుకు ఆయన ప్రతిస్పందిస్తూ జిల్లా కలెక్టర్కు సభాముఖంగా ఆదేశించారు. అధికారులు ఆదేశించిన వారం రోజుల్లోనే రెవెన్యూ, టీఎస్ఐఐసీ బృందం సర్వే నిర్వహించి, చేతులు దులుపుకున్నారు. ఈ విషయం అంతటితోనే సద్దుమణిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గ్రామంలోని భూ బాధితులు  ప్రజాప్రతినిధుల సహకారంతో కబ్జా చేసిన స్థలాలలో రేకుల షెడ్లు, ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా తమకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తారని వారు ఆశించారు. కానీ ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, స్థానిక తహససీల్దార్ సంజీవరావు, డిప్యూటీ తాహసీల్దార్ యాసిన్, ఆర్ ఐ రామారావు ప్రభుత్వ స్థలాలలో నిర్మిస్తున్న రేకుల షెడ్లు, ఇండ్లు, ఆయా మతాలకు సంబంధించిన జండాలను సైతం నాలుగు జెసీపీల సహాయంతో కూల్చివేశారు. జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామం నలువైపులా పోలీసు బలగాలను పహారకాస్తూ ఎక్కడివారికక్కడ చెల్లాచెదరంచేశారు. దాదాపు 400 మంది పోలీసులు గ్రామం చుట్టుముట్టడంతో గ్రామస్తులంతా భయాందోళనకు లోనయ్యారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు తో పాటు, సామూహిక భవనాలు, లైబ్రరీ వాటికి భూమిని కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love