Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆలయంలోకి దళితుల బోనాల నిరాకరణ

ఆలయంలోకి దళితుల బోనాల నిరాకరణ

- Advertisement -


​కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌‌ మండలంలో ఘటన
నవతెలంగాణ – తిమ్మాపూర్

కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బోనాల సందర్భంగా దళితులను ఎల్లమ్మ ఆలయంలోకి అనుమతించకపోవడంతో వారు మంగళవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ప్రతి ఏడాదీ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. ఈ క్రమంలో దళితులు కూడా బోనాలతో ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేసిన అనంతరం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలయంలోకి రావద్దంటూ కొంతమంది గౌడ సామాజిక తరగతి వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుని దుర్భాషలాడినట్టు దళితులు ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురైన దళితులు ఆలయానికి కొంత దూరంలోనే బోనాలు సమర్పించి, ఆలయం ముందు బై‌టాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ సయ్యద్ అన్వర్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరువైపుల వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆలయంలోకి అనుమతించకుండా అడ్డుకున్న వారిపైనా, దుర్భాషలాడిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -