Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాహుల్ బంధుగా రైతుబంధు

రాహుల్ బంధుగా రైతుబంధు

- Advertisement -

అన్ని వర్గాల ప్రజలను సతాయిస్తున్న రేవంత్ సర్కార్
పవరంతా ఖమ్మంలోనే ఉన్నా ఒరిగిందేంటి?
‘గ్యారంటీ’ గారడీ భట్టి ఏం సమాధానం చెప్తవ్?
40 రకాల సన్నాల బోనస్.. ఏడింటికే పరిమితం
​కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక
బంగాళాఖాతంలోకి యూరియా యాప్ : బీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ సర్ శిక్షణా కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్

నవతెలంగాణ- ఖమ్మం
ప్రాంతీయప్రతినిధి / సత్తుపల్లి

అన్ని వర్గాల ప్రజలను రేవంత్ సర్కారు సతాయిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు ‘రాహుల్’ బంధుగా మారిందని ఆరోపించారు. గ్యారెంటీ కార్డులు, బాండ్ పేపర్లు పంచి గారడీ చేసిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఏ ఒక్కటీ అమలు చేయట్లేదని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్‌ ‌హాల్‌‌లో బుధవారం ఏర్పాటు చేసిన సర్ శిక్షణా కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు.​ ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగులకు దిక్కులేదు కానీ డబ్బుల సంచులన్నీ ఢిల్లీకి చేర్చి.. రైతుబంధును రాహుల్‌ ‌బంధుగా మార్చిన ఘనత సీఎం రేవంత్‌‌ రెడ్డికి దక్కుతుందన్నారు. ముగ్గురు మంత్రుల రూపంలో పవరంతా ఖమ్మం జిల్లాలోనే ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమిటి అని ప్రశ్నించారు. ఏడు లక్షల ఎకరాలకు నీరందించే సీతారామ ప్రాజెక్టును 80శాతానికి పైగా కేసీఆర్ పూర్తి చేస్తే మిగిలిన పనులు ఇప్పటికీ పెండింగ్‌‌లోనే ఉన్నాయన్నారు. 40 రకాల సన్నాల బోనస్‌‌ను ఏడింటికి పరిమితం చేశారని తెలిపారు.’ముఖం బాగోలేక అద్దం పగుల గొట్టుకున్నట్టు’గా రేవంత్ పాలన ఉందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక యారియా యాప్ను బంగాళాఖాతంలో చేస్తామన్నారు.

​‘గ్యారంటీ’ గారడీ కార్డులు ఏమయ్యాయి?
​గ్యారంటీ కార్డును యాడ పెట్టుకోవాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కేటీఆర్‌ ప్రశ్నించారు. రూ.5వేల విద్యాభరోసా కార్డు ఏమైందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యా యన్నారు. 4వేల నిరుద్యోగ‌భృతి, మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. గారడీ గ్యారంటీలుగా భట్టి పంచిన కార్డులు, బాండ్ పేపర్లు మిగిలాయన్నారు. కమల్‌‌ హాసన్‌‌ను మించిన నటుడు భట్టీ అని విమర్శించారు. ​కేసీఆర్ ప్రజాసంక్షేమం కోసం రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేశారని కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్, 14 లక్షల మందికి కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి వాటి కోసం అప్పులు చేశారని, రెండున్నర ఏండ్లలో రేవం‌త్‌‌రెడ్డి రూ.4.5లక్షల కోట్లు అప్పులు చేసి ఏమి చేశారని ప్రశ్నించారు.

కార్యకర్తల విషయంలో చేయాల్సింది చేయలేకపోయాం
​అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల విషయంలో చేయాల్సింది చేయలేకపోయామని కేటీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్‌‌తో మాట్లాడి గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తానన్నారు. సర్ విషయంలో బీఅర్ఎస్ బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ లిస్టును జల్లెడ పట్టే కార్యక్రమమే సర్ అని అన్నారు. పశ్చిమబెంగాల్లో 95 లక్షల ఓట్లను కేంద్రం తొలగించిందని, అక్కడి మాజీ సీఎం 45 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింద న్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే తంతు నడుస్తోందని తెలిపారు. కాబట్టి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

విలేకరుల స్థాయి తగ్గింపుపై..
​సమాచారశాఖ మంత్రి సొంత జిల్లాలో విలేకరుల స్థాయి తగ్గిస్తూ అక్రిడిటేషన్లు ఇవ్వటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లోని రిపోర్టర్లకు డిస్ట్రిక్ట్ అక్రిడి టేషన్‌ ‌కార్డులు ఇచ్చేవారని, ఇప్పుడు వారికి మండ ల కార్డులు ఇవ్వటం సముచితం కాదన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్తా మని సత్తుపల్లి విలేకరులకు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్, మాజీ ఏంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్, నాయకులు రాకేష్‌‌రెడ్డి, లింగాల కమలరాజ్, బొమ్మెర రామ్మూర్తి, దిండిగల రాజేందర్, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -