మూడోసారి సీఎంగా కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం

– తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి జరుగుతుందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మూడోసారి సీఎంగా కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో రూ.9.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని వదిలిపెట్టకుండా రాష్ట్రంలోని సకల జనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు సీఎంగా కేసీఆర్ ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి పైరవీలు, పంచాయతీలకు తావు లేకుండా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించారని, ప్రజలు ఎవరు తమకు ఇది కావాలని అడగకముందే ప్రజల మనసెరిగి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. మున్సిపాలిటీలో మెయిన్ రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరై టెండర్ పూర్తయిందని, వారం రోజుల్లో ఆ పనులు ప్రారంభమై పూర్తవుతాయని తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలోని స్థలానికి పూర్తి స్థాయిలో ప్రహరీ నిర్మాణానికి మున్సిపల్ నిధులు కేటాయించాలని  చైర్మన్  సావిత్రిమేఘారెడ్డిని కోరారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి భువనగిరి రోడ్ లో 5 కిలోమీటర్ల వరకు డబుల్ బీటీ రోడ్డుకు రూ.5.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేయిస్తానన్నారు. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు కూడా చాలా వరకు పూర్తయ్యాయని, ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయని, మంత్రి కేటీఆర్ తిరుమలగిరి సభలో తిరుమలగిరి, మోత్కూర్  మున్సిపాలిటీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో మున్సిపాలిటీలో మిగతా అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు.  ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, దంత బంధు, గృహ లక్ష్మీ లాంటి పథకాలు కుల మతాలకతీతంగా ప్రజలకు అందుతున్నాయని, ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, మోత్కూర్, అడ్డగూడూరు మండలాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నా తుంగతుర్తిలో మూడోసారి బీఆర్ఎస్ ను గెలిపించి సీఎంగా మూడోసారి కేసీఆర్ ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని, ప్రజలు మూడోసారి కేసీఆర్ ను గెలిపించడానికి కంకణబద్ధులై ఉండాలని కోరారు. అనంతరం 12వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, ఓయూ జెఏసి నాయకుడు మర్రి అనిల్ కుమార్, బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, కౌన్సిలర్లు కారుపోతుల శిరీష, మలిపెద్ది రజిత, లెంకల సుజాత, కూరేళ్ల కుమారస్వామి, వనం స్వామి, నాయకులు డా.గుర్రం లక్ష్మీనర్సింహా రెడ్డి, కందుల విక్రాంత్, దాసరి తిరుమలేష్, మర్రి ఆనందం, గుంటి దేవా, బోడ శ్రీను, శ్రీరాములు, మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు కట్టా ఇంద్రజ్యోతి, దబ్బెటి శైలజ తదితరులు పాల్గొన్నారు.
Spread the love