వృద్ధురాలితో దుర్భాషలాడిన అడిషనల్ కలెక్టర్

నవతెలంగాణ – యాదాద్రి: ప్రజాలు తమ సమస్యల పరిష్కారానికీ చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కనీసం వారి సమస్యలను పరిష్కరించకపోగా ఫిర్యాదుదారులపై అధికారులు నానా దుర్భాషలాడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు విచక్షణ కోల్పోయి 70 ఏళ్ల వృద్ధురాలితో పాటు వచ్చిన వ్యక్తిపై ప్రజావాణిలో విరుచుకుపడ్డారు. సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామానికి చెందిన కొలను సాలమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి తన అన్న కొడుకుతో కలిసి వచ్చారు. తనకు సంతానం లేదని భర్త చనిపోవడంతో తన ఐదుగుంటల భూమిని గుర్తు తెలియని వ్యక్తులు ధరణి పోర్టల్‌లో నాళా కన్వర్షన్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఆ దరఖాస్తును ధరణి పోర్టల్ నుండి తొలగించాలని 10 నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కూడా ఫిర్యాదు చేశామని అయిన ఇంతవరకు పరిష్కారం కాలేదని చెప్పడంతో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కరరావు అతనిపై మళ్లీ కలెక్టరేట్ కు వస్తే బండకేసి కొడతా అంటూ దుర్భాషలాడారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అడిషనల్ కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love