మధిరలో అభివృద్ధి ఆగింది

మధిరలో అభివృద్ధి ఆగింది– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే లేకపోవడమే కారణం
– నన్ను గెలిపిస్తే సమస్యల పరిష్కారంపైనే దృష్టి
– సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్‌
మధిర నియోజకవర్గం సమస్యలకు నిలయంగా ఉంది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాసనసభలో ప్రభుత్వంపై పోరాడి నిధులు తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ అన్నారు. 20 ఏండ్లుగా మధిరకు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే లేకపోవటం వల్లే నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. 15 ఏండ్లు ఎమ్మెల్యేగా అందులో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గా, డిప్యూటీ స్పీకర్‌ గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క, నాలుగేండ్లుగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఉన్న లింగాల కమల్‌ రాజు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలడుగు భాస్కర్‌ నవతెలంగాణతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమిటి?
నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా నిరూపయోగంగా మారాయి. బోనకల్‌ – ఖమ్మం ప్రధాన రోడ్డు దారుణంగా ఉంది. బోనకల్‌ మండల కేంద్రంలో ఆర్‌ఓబి బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. మధిర మున్సిపాలిటీలో డ్రైనేజీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు సమస్య తీవ్రంగా ఉంది. బోనకల్‌ మండల కేంద్రంలో ఆనాటి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క బోనకల్‌ గ్రామానికి చెందిన దళిత, గిరిజన భూములను బలవంతంగా లాక్కొని ఇందిరమ్మ డైరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కాని దాని జాడ ఇంతవరకు అడ్రస్‌ లేదు. మధిర మండలం మడుపల్లిలో లెదర్‌ పార్కుకు నిర్మాణం చేయకుండా వదిలేశారు. బోనకల్‌ మండల కేంద్రంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు వాగ్దానం లాగే ఉంది. ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో పరిశ్రమల కోసం 60 ఎకరాలను సేకరించినా పరిశ్రమ లేదు. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలి. ఇంకా అనేక సమస్యలు నియోజకవర్గంలో విలయతాండం చేస్తున్నాయి.
వాటి పరిష్కారం మార్గం ఏమిటీ?
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసుకువచ్చి పరిష్కారం చేస్తాను. రైతుల పంటలకు మద్దతు ధర, రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు గోడౌల నిర్మాణానికి కృషి చేస్తాను. పోరాటమే తన ఎజెండా తప్పా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు, ప్రభుత్వానికి భయపడి లొంగిపోను. ఎమ్మెల్యే పదవిని అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాను.
సీపీటీయూ ఆధ్వర్యంలో తాను చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 5 జీవోలను విడుదల చేసింది. కార్మికులకు, సెక్యూరిటీ గార్డు, కెమికల్‌ ఇండిస్తీ కార్మికుల వేతనాలు పెరిగాయి. పెండింగులో ఉన్న ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయించాం. వీఆర్‌ఏలను పర్మినెంట్‌ చేపించాం. తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే విధంగా పోరాటం చేసి విజయం సాధించాం. ఇవన్నీ సీపీఐ(ఎం) పోరాటాల ఫలితమే. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రంగాల కార్మికుల పోరాటాలకు తలవంచి.. ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. అందుకే ఎన్నికల్లో గెలిపిస్తే శాసనసభలో పోరాడి నిధులు తీసుకువచ్చి మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను.

Spread the love