
నవతెలంగాణ – అశ్వారావుపేట
దైవ నామస్మరణతో శివాలయాలు మారు మోగాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలు మొదలు శనివారం తెల్లవారు జాము వరకు ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. శివాలయాల్లో అభిషేకాలు,అర్చనలు,అన్నదానాలు,శివపార్వతుల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని లోని ప్రసిద్ధ ఆలయాలు కోనేరు బజారు కన్యకాపరమేశ్వరి ఆలయం,సాయిబాబా మందిరంలో గల ఆలయాలతో పాటు వినాయకపురం లోని యంత్ర రాజ సహిత కాళేశ్వర స్వామి ఆలయం, మామిళ్లవారిగూడెం లోని మల్లేశ్వరస్వామి ఆలయం,తిరుమలకుంట సమీపంలోని పోతురాజు గుట్ట ఆలయం,నారం వారి గూడెం కాలనీలోని ఓంకారేశ్వర స్వామి,గుర్రాల చెరువు లోని కనకదుర్గమ్మ ఆలయాల్లో తెల్లవారుజాము మూడు గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శివుడికి వివిధ రకాల అభిషేకాలు ను వేద మంత్రోచ్ఛరణలు నడుమ నిర్వహించారు. అభిషేక కార్యక్రమాలకు భక్తులు వేలాది గా తరలివచ్చారు. మామిళ్లవారిగూడెం లో మల్లేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మండలంలోని అనేక గ్రామాల నుంచి వేలాది గా భక్తులు తరలి రావటంతో ఆలయ ఆవరణం అంతా కోలాహలం గా మారింది.వినాయకపురంలోని యంత్ర రాజ సహిత కాళేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు.మధ్యాహ్నం వరకు భక్తుల రాక కొనసాగింది. అశ్వారావుపేట లోని ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.శివరాత్రి సందర్భంగా సాయంత్రం ఆలయాల్లో భజనలు నిర్వహించారు. అశ్వారావుపేట లోని సాయిబాబా మందిరంలో, కోనేరు బజారులో ఆలయంలో పాటు ఇతర ఆలయాల్లో నూ రాత్రి 9 గంటల నుంచి శివ కళ్యాణాన్ని నిర్వహించారు. అనేకమంది ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేశారు. పూజా కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.