– మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్
నవతెలంగాణ – రాయపోల్ : డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాటు లేకుండా పంట నమోదు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో డిజిటల్ క్రాప్ పంట నమోదు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేయర్లు రైతుల పొలాలను సందర్శించి సాగులో ఉన్న పంట, పంట విస్తీర్ణం, సర్వే నంబర్ తదితర వివరాలను వాస్తవ సాగుకు అనుగుణంగా మొబైల్ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్‌ను నియమించినట్లు తెలిపారు. పంట మార్పిడి జరిగిన సందర్భాల్లోనూ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రస్తుతం సాగులో ఉన్న పంట వివరాలను నమోదు చేయాలన్నారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంటల సాగు విస్తీర్ణం, పంట వివరాలు ఖచ్చితంగా నమోదు కావడంతో రైతులకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలు, వ్యవసాయ సేవలు, ఇతర ప్రయోజనాలను పారదర్శకంగా అందించేందుకు వీలవుతుందని వివరించారు.
సన్న రకాల పంట నమోదు తప్పనిసరి
తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి సన్న రకాల పంటలను కూడా డిజిటల్ క్రాప్ బుకింగ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏఓ నరేష్ సూచించారు. ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), బీపీటీ-5204 (సాంబా మసూరి), కేఎన్‌ఎం-1638 (కునారం సన్నాలు), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715 రకాల వరి విత్తనాలను డీలర్ల వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.ఈ ఏడు రకాల వరి సన్న రకాలను సాగు చేస్తున్న రైతుల్లో ఎవరైనా పంట నమోదు చేసుకోకపోతే, డీలర్ ఇచ్చిన బిల్లుతో వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా సంబంధిత డీలర్‌ను సంప్రదించి పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలో డిజిటల్ క్రాప్ బుకింగ్‌ను పూర్తి చేసి రైతుల పంట వివరాలు వాస్తవ సాగుకు అనుగుణంగా ఉండేలా చూడాలని అన్నారు.
రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాల్లో డిజిటల్ పంట నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, రైతులతో సమన్వయం చేసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ల చిన్న వెంకటయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి స్వర్ణలత, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు.



