నిజాం రాష్ట్రంలో గ్రంథాలయాల ఏర్పాటుకు దిశా నిర్దేశం

Libreryతెలంగాణలో మొదటి గ్రంథాలయ సదస్సు 1925 ఫిబ్రవరి 22 తేదీన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. మరొక విషయం ఏమిటంటే దీనికంటే ఒక రోజు ముందుగా (ఫిబ్రవరి 21 తేదీన) స్థానిక ఉస్మానియా గ్రంథాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో ప్రారంభ ప్రసంగం ధూపటి వెంకట రామణాచార్యులు, ప్రసిద్ధ రచయిత, పరిశోధకుడు, పండితుడు అందించారు.
మాడపాటి హనుమంతరావు మాట్లాడుతూ నిజాం రాష్ట్రంలో ముఖ్యంగా, తెలుగు భాషాసంస్కతిని పరిరక్షించడమే కాక, గ్రంథాలయాలు స్థాపించి ప్రజలకు జ్ఞానం అందించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఫిబ్రవరి 21, 1925 న ఉస్మానియా గ్రంథాలయ వార్షికోత్సవ సమావేశం మాడిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. అతి తక్కువ కాలంలో ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయం, మధిర 1000 పుస్తకాలకు పైగా సేకరించి సేవలందిస్తున్నందుకుగాను కార్యదర్శి మిర్యాల నారాయణ గుప్త గారిని ప్రశంసించారు.
గ్రంథాలయ సదస్సు వడెపల్లి దేశ్‌ముఖ్‌ అధ్యక్షతన పింగళి వెంకటరామరెడ్డి వారి ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగింది. ఆయన ఈ సందర్భంగా, ”గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలు నిర్వహించాలనీ, ఇవి పేదలకు ప్రయోజనకరంగా ఉంటాయనీ, ఆంధ్ర జన సంఘంతో సహకరించి పనిచేయాలి, దానితో పాటు వీలైనన్ని గ్రంథాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి’ అని చెప్పారు.
అలాగే ‘నిజాం రాష్ట్రంలో నేటికీ 83 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో మట్టేవాడ, హనమకొండ గ్రంథాలయాలు నిజాం ప్రభుత్వంలో 10 నుండి 15 రూపాయల వరకు గ్రాంటు పొందినవి’ అని వివరించారు. వీరితోపాటు కవులు వనమామలై లక్ష్మణాచార్యులు, మామునూరు నాగభూషణరావు తమ కవితలను చదివారు. ఈ సదస్సులో నిజాం ప్రభుత్వం గ్రంథాలయ ఉద్యమానికి ఇచ్చిన మద్దతు, సహాయానికి కతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర జన కేంద్ర సంఘం వారు గ్రంథాలయ ఉద్యమానికి చేస్తున్న ప్రయత్నాలను అభినందించటంతో పాటు వారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని సంఘం సూచించింది.
నిజాం ప్రభుత్వం కొన్ని గ్రంథాలయాలకు గ్రాంట్లు మంజూరు చేసినందుకు కతజ్ఞతలు తెలపడంతో పాటు మిగతా గ్రంథాలయాలకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో గ్రంథాలయాల వ్యాప్తి కోసం గ్రంథాలయ సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభలో పింగళి వెంకటరామిరెడ్డి అధ్యక్షుడిగా, వేముగంటి రామకష్ణారావు, మాదిరాజు రామకోటేశ్వరరావు, మౌల్డ్‌ రఫీ దిన్‌ సాహెబ్‌, మల్లాది లక్ష్మీనరసింహారావు కార్యదర్శులుగా నియమితులైనారు. ఈ సభలో 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా హాకీ రఫీ రుద్దిన్‌ కూడా గ్రంథాలయాల గురించి మాట్లాడారు. ‘గ్రంథము నవరసభరితమైన స్నేహితుడు. సర్వకాల సర్వ వ్యవస్థలందు, సన్నిధాన వర్తియగా నెచ్చెలి, కొట్టినను తిట్టినను తన్నినను సహించగల పరమ మిత్రుడు. ప్రస్తుతము గ్రంథాలయాలు ధనాభావ రోగంతో బాధపడుతున్నవి. వీరికి సువర్ణ ఘటికలను సూత్రం వాడవలెను’ అన్నారు
1925 ఫిబ్రవరి 22వ తేదీన 100 ఏండ్ల కిందట మధిరలో జరిగిన ఈ సమావేశం తెలంగాణ సాహిత్య, గ్రంథాలయ ఉద్యమంలో ఒక చారిత్రక మలుపు. ఈ మహాసభకు సన్మాన సంఘం అధ్యక్షుడు శ్రీ మాడపాటి తిరుమల్‌ రావు పంతులు స్వాగతం పలికారు. ఈ సదస్సులో తెలంగాణ గ్రంథాలయ సంఘం స్థాపించడానికి ఇల్లిందల సీతారామరావు అధ్యక్షుడిగా, ఖండవల్లి లక్ష్మిరంజనమ్‌ కార్యదర్శిగా నియమించబడ్డారు.
ఈ సమావేశంలో నిజాం రాష్ట్రంలోని గ్రంథాలయ ఉద్యమంపై ప్రత్యేకంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయాలు స్థాపించడానికి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ నిజాం రాష్ట్రంలో గ్రంథాలయాలు స్థాపించడానికి అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం 1901లో ఏర్పడినప్పటి నుండి సార్వజనిక గ్రంథాలయ ఉద్యమం నడవడం ప్రారంభమైంది. దీనికంటే ముందు కొన్ని గ్రంథాలయాలు మొదలైయున్నా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం నిజాం రాష్ట్రంలో గ్రంథాలయాల స్థాపన ఒక మార్గదర్శిగా పని చేసిందని చెప్పవచ్చు.
1925 నాటికి నిజాం రాష్ట్రం వ్యాప్తంగా సుమారు 100 గ్రంథాలయాలు స్థాపించబడ్డాయని సమాచారం. అయితే అనేక గ్రంథాలయాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం సరైన భవనాలు, మౌలిక వసతులు లేకపోవడం, ఆర్థిక వనరులు మున్నగు కారణాలు కలవు. ఈ గ్రంథాలయాలు ప్రజలకు చేరువయ్యేందుకు వివిధ కార్యక్రమాల (నాటకాలు, బుర్రకథ, హరికథ, రేడియో) ద్వారా ప్రయత్నం చేశారు
నిజాం రాష్ట్రం ఆంధ్ర జన కేంద్ర సంఘం తృతీయ సమావేశం సందర్భంగా ఆహ్వాన సంఘం వారు గ్రంథాలయ సభను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా గ్రంథాలయ ఉద్యమంపై చర్చించే అవకాశం కల్పించినందుకు పింగళి వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుండి గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలు, గ్రంథాలయ స్థాపకులు బాలసరస్వతీ గ్రంథాలయం తరపున కోదండ రామారావు, వేమన ఆంధ్ర భాషా నిలయం తరఫున రాజగోపాల మొదలియార్‌, ఆంధ్ర విద్యార్థి సంఘం గ్రంథాలయం తరఫున రామచంద్రరావు, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం తరఫున వారణాసి శేషగిరిరావు, సంస్కృత కళా సంవర్ధిని గ్రంథాలయం తరపున దత్తాత్రేయ శర్మ, మాడూరి రాఘవులు, భాషా కల్పవల్లి తరఫున సాల్వే రామయ్య, శ్రీ హనుమంత గ్రంథాలయం ఆరుట్ల తరఫున ఉన్నవ వెంకట్రామయ్య, శ్రీ బాల భారతి నిలయం ఆంధ్ర భాషా సంఘం నారాయణ శర్మ, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం తరఫున పర్చ రంగారావు, శబ్దాన్ని శాస్త్రం ఆంధ్ర భాషా నిలయం తరుపున తూము వరదరాజులు, హిందీ ప్రచారం ఈ గ్రంథాలయం మల్లేపల్లి తరుపున మల్లెల నరసింహారావు, విజ్ఞాన జూతీaసaరష్ట్రaఅఱ గ్రంథ నిలయం కలకోట తరఫున పి వెంకట అప్పారావు, మధిరలో ఉస్మానియా గ్రంథాలయం తరఫున మిర్యాల నారాయణ గుప్తా, జనార్ధన్‌ ఆలయం తరఫున మామునూరు నాగభూషణరావు, వెంకటేశ్వర గ్రంథాలయం గార్ల తరపున చిలుకూరు రాములు, విష్ణువర్ధన్‌ ఆంధ్ర భాషా నిలయం దుర్గం పాడు తరఫున చెన్నం మల్లయ్య, ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం తరఫున పెద్ది శివ రాజయ్య, ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయం కరీంనగర్‌ తరఫున గూడూరు కిషన్‌ రావు, విశ్వేశ్వర్‌ ఆంధ్ర భాషా నిలయం తరఫున రామకృష్ణారెడ్డి, నీలగిరి గ్రంథాలయం నల్లగొండ తరఫున వెంకట నరసింహారావు, ఆంధ్ర సరస్వతి నిలయం నల్లగొండ తరఫున అనంత రామారావు, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం తరఫున యామ రామ నరసయ్య, శ్రీపతి రెడ్డి గ్రంథాలయం పిల్లలమర్రి తరఫున గవ్వ మురహరి రెడ్డి, విష్ణు నగర్‌ ఆంధ్ర భాషా నిలయం విస్నూరు తరపున నెల్లుట్ల లక్ష్మీ నరసింహారావు, సీతారామ పుస్తక భాండాగారం కందిబండ తరఫున వెంకట నరసింహారావు, జోగి నంద గ్రంధాలయం నుండి హనుమత్‌శర్మ, దక్షిణ ఆనంద గ్రంథమాల సంగారెడ్డి నుండి గొల్లపూడి లక్ష్మీ నరసింహరావు, ఆంధ్ర భాషా సంజీవిని గ్రంథాలయం మెదక్‌ పాలపర్తి సత్యనారాయణ మొదలగు గ్రంథాలయ నిర్వాహకులు, గ్రంథాలయ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు భాషను ఆదరించడానికి ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఉండాల్సిన అవసరం ఉన్నదని, గ్రంథాలయాలు లేని గ్రామం నివాసానికి ఉపయోగపడదని తెలిపారు. స్వదేశీ సంస్థానాలు కూడా గ్రంథాలయాల స్థాపనకు పెద్ద ప్రాధాన్యం ఇచ్చాయని, ఉదాహరణగా బరోడా రాష్ట్రం వారు గ్రామస్థుల నుండి విరాళాలు సేకరించి, ప్రభుత్వం వారు గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు అందించడాన్ని వివరించారు.
అమెరికా, బ్రిటిష్‌ రాజ్యం, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలలో కూడా గ్రంథాలయాలు మరింత ప్రాచుర్యం పొందాయి. ఇక నిజాం ప్రభుత్వానికి కూడా గ్రంథాలయాల అభివద్ధి కోసం 69 లక్షల రూపాయలు వెచ్చించిన విషయం గుర్తించబడింది. ప్రస్తుతం హైదరాబాదు అసఫియా గ్రంథాలయం, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం వాటి అభివృద్ధిలో నిజాం ప్రభుత్వ భాగస్వామ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశాలు నిజాం రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి మరింత పటిష్టత, మిగతా గ్రంథాలయాల ఏర్పాటుకు దిశా నిర్దేశం చేశాయి అని చెప్పవచ్చు.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

Spread the love